ప్రముఖ రైతు నాయకుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షునిగా, కార్యదర్శిగా సుదీర్ఘ కాలం సేవలందించిన ఆయన మృతి ఉద్యమానికి తీరని లోటు. వరంగల్ జిల్లా కమ్యూనిస్ట్ ఉద్యమంలో మల్లారెడ్డి ముఖ్య పాత్ర నిర్వహించారు. ప్రధానంగా సిపిఎం జిల్లా కమిటీలో విచ్ఛిన్నకులు చేసిన ప్రయత్నాలను ఎదుర్కొని యువతీ యువకులను సమీకరించి పార్టీ పునర్నిర్మాణ కృషిలో చురుకైన పాత్ర నిర్వహించారు. సాధారణ రైతాంగ సమస్యలతోపాటు సహకారం, నీటి పారుదల రంగాల్లో ఆయనకు లోతైన అవగాహన ఉండేది. రైతాంగ సంక్షోభం గురించి, దాని లోతుపాతులపైనా ఆయన అపారమైన అధ్యయనం చేశారు. ప్రజాశక్తి పత్రికకు అసంఖ్యాకంగా వ్యాసాలు రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతు సంఘం రాష్ట్ర కేంద్రం పనిలో దాదాపు దశాబ్ద కాలంపాటు ఆయనతో సహచరునిగా నాకు అవకాశం దక్కింది.
లోతైన అధ్యయనం
సమస్యలను ఆయన లోతుగా అధ్యయనం చేసేవారు. ఆ అంశంలో జాతీయ, అంతర్జాతీయ అనుభవాలు ఏమున్నాయో తెలుసుకునేవారు. అనుభవజ్ఞులైన రైతు నాయకులు కొరటాల సత్యనారాయణ వంటి వారితో ఎప్పటికప్పుడు చర్చించడం సలహాలు తీసుకోవడం జరిగేవి. అంతేకాదు వయసు అనుభవంలో ఆయన కంటే చిన్నవారే అయినా వారిని అడిగి విషయాలను తెలుసుకునేందుకు ఏనాడూ వెనుకాడేవారు కాదు. వ్యవసాయ సంక్షోభం గురించి రాష్ట్ర జాతీయ స్థాయి సెమినార్లకు హాజరై ప్రసంగించారు. శ్రోతగా వెళ్లిన సందర్భాల్లోనూ మొత్తం ప్రతినిధులందరినీ ఆలోచింపజేసేలా ప్రశ్నలు సంధించేవారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రజ్ఞుడు ఎం.ఎస్. స్వామినాథన్ తో ఆయన కొన్ని సార్లు సంభాషించారు. ప్రొఫెసర్ జయతి ఘోష్ కమిషన్ చర్చలు సంప్రదింపుల్లో మల్లారెడ్డి పాత్ర గణనీయమైనది. ముఖ్యంగా అనుభవపూర్వక అంశాలను ఆయన వారికి వివరించేవారు. ఇటువంటి విషయాలను ప్రముఖ జర్నలిస్ట్ పాలగుమ్మి సాయినాథ్ కూడా మల్లారెడ్డితో సంభాషించేవారు.
రెవెన్యూ, సహకారం, పంచాయతీరాజ్ పరిపాలన అంశాలపై పట్టు
సహకార రంగంపై మల్లారెడ్డి ఎంతో అనుభవం కలిగినవారు. వారి స్వగ్రామంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాన్ని సమర్ధవంతంగా లాభసాటిగా నిర్వహించారు. వరంగల్ డిసిసిబి నిర్వహణలోనూ ఆయన పాత్ర ఉంది. వంశపారంపర్యంగా వచ్చిన పటేల్ (గ్రామాధికారి) బాధ్యతలను ఆయన నిర్వహించారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ అనుభవమూ ఉంది. ఆయన ఆ పునాదితోనే ప్రభుత్వం సంస్కరణల పేరిట తెచ్చిన మార్పుల మూలంగా రైతాంగానికి జరిగే చేటు వివరించేవారు. విధాన పరంగా అది ఎలా తప్పో విడమర్చి చెప్పేవారు. సహకార రంగాన్ని ముఖ్యంగా సహకార చక్కర ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు, సహకార డెయిరీలను మూసివేయడం లేదా ప్రైవేట్ పరం చేసిన సందర్భాల్లో ఆగ్రహంతో ఉగిపోయేవారు.
సమస్యలు ఎక్కడ వస్తే అక్కడ వెంటనే వాలిపోవడం
ఉమ్మడి రాష్ట్రంలో అన్ని జిల్లాల రైతు ఉద్యమంపై అయన ప్రభావం వుంది. ప్రత్యేకంగా అనంతపురం జిల్లా ఆయనకు ప్రీతిపాత్రమైనది. అక్కడి సమస్యలు అధ్యయనం చేయడం, వాటికి పరిష్కారాలు వెతకడం ఆయనకు ఎంతో ఇష్టం. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఎక్కువగా వెళ్ళింది ఉమ్మడి గుంటూరు జిల్లా ఒకటి. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు తరచూ వెళ్లేవారు. నయా ఉదారవాద విధానాలు రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు ఆదేశిత సంస్కరణలతో సహకార రంగాన్ని పాలకులు భ్రష్టు పట్టిస్తుంటే ఎంతగానో బాధ పడేవారు. ఆ క్రమంలోనే నాటి టిడిపి ప్రభుత్వం నీటి మీటర్లు ఏర్పాటు చేసింది. రైతు సంఘం వాటికి వ్యతిరేకంగా రైతుల్లో విస్తృత ప్రచారం గావించింది. మరింత చైతన్యం కలిగించేందుకు రైతు ప్రతిఘటన పెంచడం కోసం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో రైతులతో కలిసి ఆయన స్వయంగా నీటి మీటర్ పగులగొట్టారు. పోలీసులు కేసు పెట్టడంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది. అప్పుడు జైలు శిక్ష అనుభవించినా రైతుల వ్యతిరేకతతో సర్కారు నీటి మీటర్ల ఏర్పాటును వెనక్కు తీసుకుంది. ఆ తరువాత ఆ కేసు కూడా కోర్టు కొట్టేసింది.
కార్యకర్తల పట్ల అవ్యాజ ప్రేమ
కార్యకర్తలంటే మల్లారెడ్డికి ఎంతో ప్రేమాభిమానాలు. కేవలం వారి గురించి మాత్రమే కాకుండా భార్యాపిల్లలు, తల్లిదండ్రుల మంచి చెడ్డల గురించి తెలుసుకునేవారు. వారు కష్టాల్లో ఉంటె ఈయన చలించిపోయేవారు. జిల్లాలకు వెళ్ళినపుడు నాయకులు కార్యకర్తల ఇళ్లలో బస చేసేవారు. ఆ కుటుంబ సభ్యులంతా ఆయనతో ఎంతో కలివిడిగా మసిలేటట్టు ఆయన వ్యవహరించేవారు. మహిళలు, చిన్నపిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. ఊరందరినీ ఉద్యమం వైపు తేవడమేగాదు, తన కుటుంబ సభ్యులు యావత్తూ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల విశ్వాసంతో నిలబెట్టడం శ్లాఘించదగినది. ఆయన సతీమణి భాగ్యలక్ష్మి మాతోపాటు రైతు సంఘ రాష్ట్ర కార్యవర్గంలో పని చేశారు. ఆమెను పనిలో ప్రోత్సహించేవారు. అయితే భాగ్యలక్ష్మి జీవిత భాగస్వామిగా మల్లారెడ్డి ని ఎల్లవేళలా కనిపెట్టుకొని ఉండేవారు. ఆయన అవసరాలన్నిటినీ సకాలంలో సమర్ధవంతంగా తీర్చేవారు. ఆయన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆమె పాత్ర అద్వితీయం. ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె, వారి కుటుంబ సభ్యులు మనో స్థైర్యం పెంచుకోవాలి. మల్లారెడ్డి తుదికంటా నడచిన బాటలో కొనసాగడమే ఆయనకు మనమిచ్చే నివాళి.
- బి. తులసీదాస్







కామెంట్‌లు (0)