ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్ అగ్ని ప్రమాదంలో మరో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో రిమ్స్ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య ఐదు కు చేరిందని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి ఎసి పేలడంతో వెంటనే మంటలు రాజుకొని దట్టమైన పొగలు చిన్నారుల విభాగంలో వ్యాపించాయి. మంటలకు గాయపడిన చిన్నారులు, పొగ పీల్చి అస్వస్థతకు గురైన చిన్నారులను ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 5 రోజుల శిశువు చనిపోగా, మంగళవారం చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. బుధవారం ఉదయం మరో ఇద్దరు శిశువులు చనిపోవడంతో మరింత విషాదం నెలకొంది.
కలెక్టర్ రాజర్షి షా చిన్నారుల చికిత్సను పర్యవేక్షించి, ఆదేశాలిచ్చారు. కల్వకుంట్ల కవిత రిమ్స్, ప్రైవేట్ ఆసుపత్రులను సందర్శించారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలోని ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగంలో రెండు రోజుల కిందట జరిగిన అగ్నిప్రమాద ఘటనలో గాయపడిన, అస్వస్థతకు చిన్నారులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మంగళవారం రాత్రి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రులను సందర్శించిన కలెక్టర్, అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు అందుతున్న వైద్య సేవలు, అవసరమైన చికిత్స, మందులు, వైద్య పర్యవేక్షణ తదితర అంశాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, అవసరమైన వైద్య చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు, మెడికల్ సిబ్బందికి స్పష్టం చేశారు. చికిత్సలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు కలెక్టర్ సూచించారు. డీఎంహెచ్‌ఓ డా. సాధన, వైద్యులు, వైద్యాధికారులు, వైద్య సిబ్బంది తదితరులు అక్కడ ఉన్నారు.
రిమ్స్‌కు వెళ్లిన కల్వకుంట్ల కవిత ...
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. రిమ్స్ ఘటనపై మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే కోవా లక్ష్మి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ ఉమా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిని సందర్శించనున్నారు. మొదట రిమ్స్ హాస్పిటల్ ను సందర్శించి బాధితుల్ని పరామర్శిస్తారు. అనంతరం పట్టణంలోని సురక్ష హాస్పిటల్, గణేష్ హాస్పిటల్,(మాజీ స్వామి డాక్టర్హాస్పిటల్ ), కేర్ హాస్పిటల్ ( టాకుర్ హోటల్), ఈషా హాస్పిటల్( నయారా పెట్రోల్ బంక్ రోడ్డు ), లక్ష్మీ నరసింహ( SLN), శ్రీ విఘ్నేశ్వర (తిరుమల్ రెడ్డి) హాస్పిటల్ లను సందర్శించి పిల్లల పరిస్థితికి తెలుసుకోనున్నారు.







కామెంట్‌లు (0)