బుధవారం, 23 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆసియా గేమ్స్: సాఫ్ట్ టెన్నిస్‌లో భారత్‌కు చారిత్రక కాంస్యం

1 గంట క్రితం

ఆసియా క్రీడల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారతదేశం చారిత్రక ఘనత సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల క్రీడాకారుడు జయ్ మీనా కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 05:35 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

* అదరగొట్టిన జయ్ మీనా


నగోయా:

ఆసియా క్రీడల సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో భారతదేశం చారిత్రక ఘనత సాధించింది. పురుషుల సింగిల్స్ విభాగంలో మధ్యప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల క్రీడాకారుడు జయ్ మీనా కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్ చరిత్రలోనే ఈ క్రీడలో భారత్‌కు పతకం దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


బుధవారం నాటి సెమీఫైనల్ పోరులో జపాన్‌కు చెందిన టకుయా కురోసాకాతో జయ్ మీనా తలపడ్డాడు. 45 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ ప్రారంభంలో జయ్ వరుసగా మూడు గేమ్‌లు ఓడిపోయి ఒత్తిడిలో పడ్డాడు. ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లను (4-1, 6-4) తన ఖాతాలో వేసుకుని మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. అయితే, చివరి ఆరో గేమ్‌లో కురోసాకా ఆధిపత్యం ప్రదర్శించడంతో జయ్ మీనా 2-4 (3-5, 1-4, 1-4, 4-1, 6-4, 1-4) తేడాతో ఓటమి పాలై కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు.


ఉత్కంఠభరిత పోరులో సెమీస్‌కు..

అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జయ్ మీనా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఫిలిప్పీన్స్‌కు చెందిన షెర్విన్ నుగుయిట్‌పై 4-3 (0-4, 4-2, 2-4, 4-2, 5-3, 2-4, 7-5) తేడాతో విజయం సాధించి సెమీఫైనల్‌తో పాటు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. గ్రూప్-డి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు చెందిన అరేన్ హుస్సేన్‌ను 4-0తో చిత్తు చేసి నాకౌట్‌కు అర్హత సాధించాడు.


ఇది నాకు ఒలింపిక్ పతకంతో సమానం: జయ్ మీనా

పతకం సాధించిన అనంతరం జయ్ మీనా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. "ఈ పతకం నాకు ఒలింపిక్ పతకంతో సమానం. ఈ స్థాయికి చేరుకోవడానికి పడే శ్రమ, పడే వేదన క్రీడాకారుడికి, కోచ్‌లకు మాత్రమే తెలుస్తుంది. గత రెండు ఎడిషన్ల (2018, 2023) నుంచి ఆసియా గేమ్స్ పతకం కోసం ఎదురుచూస్తున్నాను. హ్యాంగ్‌జౌలో తృటిలో చేజారిన పతకాన్ని ఈసారి సాధించడం ఎంతో సంతృప్తినిచ్చింది. ఈ విజయం భవిష్యత్తులో పతకం రంగును స్వర్ణంగా మార్చేందుకు నాలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది" అని పేర్కొన్నాడు.


మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌కు చెందిన జయ్ మీనా 2022 జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాడు. అలాగే 2024 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మిక్స్‌డ్ డబుల్స్ కాంస్యం, 2025 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్ కాంస్యం సాధించిన అనుభవం అతనికి ఉంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్