సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

69 అడుగుల ఖైరతాబాద్‌ మహాగణపతికి గవర్నర్‌ దంపతుల తొలి పూజ

37 నిమిషాల క్రితం

Governor and his wife perform the first puja to the 69-foot Khairatabad Maha Ganapati.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 12:42 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

తెలంగాణ : హైదరాబాద్ ఖైరతాబాద్‌లో 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతి కొలువుదీరాడు. రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా దంపతులు తొలి పూజ నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ... ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతికి అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. గవర్నర్‌ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్‌, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికి స్వామివారి వద్దకు తీసుకెళ్లారు.


గవర్నర్‌ దంపతులు పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఖైరతాబాద్‌ గణనాథుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి భారీ కండువా, యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. తొలి పూజ అనంతరం బడా గణేశ్‌ దర్శనానికి యాత్రికులను అనుమతించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ జనాలు పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్‌కు తరలివచ్చారు. దీంతో పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది.


ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా .... ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఐదు పడగల ఆదిశేషుడి నీడలో ఐదు ముఖాలు, ఎనిమిది హస్తాలతో పద్మంపై ఆశీనుడైన గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు. స్వామివారి కుడివైపు అంకుశం, త్రిశూలం, కమలం, అభయహస్తం ఉండగా.. ఎడమవైపు పాశం, పరశు, మాల, మోదకం ఉన్నాయి. గణపతి కుడివైపున సుమారు 20 అడుగుల ఎత్తులో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్‌ జ్యోతిర్లింగం, ఎడమవైపు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కాళికామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.


700 మంది పోలీసులతో బందోబస్తు ....

ఖైరతాబాద్‌ మహాగణపతి దర్శనానికి ఈసారి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సుమారు 700 మంది పోలీసు సిబ్బంది శాంతి భద్రతల విధుల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మహాగణపతి దర్శనానికి యాత్రికులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్‌ నియంత్రణపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్