సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

24 ఆగస్టు, 2026

cpim leader
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 25, 2026, 12:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- బివి.రాఘవులు సహా పలువురు ప్రముఖుల నివాళి

- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సంతాపం

- ఎల్‌‌వి ప్రసాద్‌ ఆస్పత్రికి నేత్రాలు, ఉస్మానియాకు చర్మం దానం

- నేడు గాంధీ మెడికల్‌ కాలేజీకి భౌతికకాయం అప్పగింత

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : రైతు ఉద్యమ నేత, సిపిఎం సీనియర్‌ ‌నాయకులు సారంపల్లి మల్లారెడ్డి (89) సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు కన్నుమూశారు. శ్వాసకోశ, ఇతర సమస్యలతో నిమ్స్‌ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిశారు. ఆయనకు భార్య భాగ్యలక్ష్మి, ఇద్దరు కుమారులు వాసుదేవరెడ్డి, మధుసూదన్‌‌రెడ్డి, ఇద్దరు కుమార్తెలు అనిత, సునీత. పెద్ద కుమార్తె అనిత ఇటీవల కేన్సర్‌‌తో మరణించారు. మల్లారెడ్డి మరణవార్త తెలియగానే సిపిఎం పొలిట్‌‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కైలాబ్‌‌బాబు, బాబూరావు తదితరులు నిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లి మల్లారెడ్డి భార్య భాగ్యలక్ష్మిని, కుటుంబసభ్యులను ఓదార్చారు. మార్చురీలో భద్రపరిచిన మల్లారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. తెలంగాణ రైతు కమిషన్‌ ‌చైర్మన్‌ కోదండరెడ్డి... నిమ్స్‌ ‌ఆస్పత్రికి వెళ్లి మల్లారెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. మల్లారెడ్డి నేత్రాలను ఎల్‌‌వి ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి, చర్మాన్ని ఉస్మానియాలోని చర్మ బ్యాంకుకు కుటుంబ సభ్యులు దానం చేశారు. వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి మంగళవారం అప్పగించ నున్నారు. మల్లారెడ్డి ఆదర్శ కమ్యూనిస్టు అని, అన్నదాతల కోసం హక్కుల కోసం జీవితాంతం పోరాడిన రైతు బాంధవుడని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌‌వెస్లీ కొనియాడారు. ఆయన నిరాడంబర జీవితం నేటితరానికి ఆదర్శప్రాయమని తెలిపారు. మల్లారెడ్డి మృతికి సంతాపం, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మల్లారెడ్డి మృతికి ఎంబి భవన్‌‌లో శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాప కార్యక్రమాన్ని నిర్వహించి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చివరి శ్వాస వరకు సిపిఎం కోసమే పనిచేశారని గుర్తు చేశారు. దేశంలో వర్గ, సామాజిక పోరాటాలను నడపడమే మల్లారెడ్డికి ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి

మల్లారెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైతుల హక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ముందుండి అనేక ఉద్యమాలు నడిపించారని గుర్తుచేశారు. రైతు సంఘం నేతగా, అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులకు సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పలువురు మంత్రులు, ప్రజాసంఘాల నేతలు సంతాపం తెలిపారు. రైతు ఉద్యమం పెద్ద దిక్కును కోల్పోయిందని, నేనూ గొప్ప సహచరుడిని కోల్పోయానని మాజీ ఎమ్మెల్యే పాటూరి రామయ్య తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. సారంపల్లి మల్లారెడ్డి గొప్ప మేధావి అని తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంతాపం తెలిపారు.

​నేడు అంతిమ యాత్ర

సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయాన్ని మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు హైదరాబాద్‌‌లోని సిపిఎం రాష్ట్ర కార్యాలయమైన ఎంబి భవన్‌‌కు తీసుకొస్తారు. ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంచుతారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్‌ ‌గాంధీ ఆస్పత్రి వరకు అంతిమయాత్ర కొనసాగుతుంది. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్, రైతు సంఘం జాతీయ నాయకులు కృష్ణప్రసాద్, సిపిఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, వివిధ రాష్ర్టాల నుంచి పార్టీ ప్రతినిధులు, వామపక్ష పార్టీల నాయకులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు హాజరు కానున్నారు.

కుటుంబ నేపథ్యం...

వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలం తిమ్మంపేటలో 25 ఆగస్టు 1939న మల్లారెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు సారంపల్లి కృష్ణారెడ్డి, రాధమ్మ. వరంగల్‌లోని మహబూబియా హైస్కూల్, వేయిస్తంబాల గుడి పాఠశాల, ఎబివి హైస్కూల్‌లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. 1953లో వివాహమైంది. 1964 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 1971 ఆగస్టు పదో తేదీ వరకు తిమ్మంపేట పోలీస్ పటేల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1971 ఆగస్టు ఆరున తిమ్మంపేట గ్రామంపై కాంగ్రెస్ నాయకుల దాడి జరిగినప్పుడు ప్రజల పక్షాన నిలిచారు.

ఉద్యమ ప్రస్థానం..

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమం వైపు వచ్చారు. రైతు సంఘం నర్సంపేట డివిజన్ కార్యదర్శిగా 1973లో బాధ్యతలు చేపట్టారు. సిపిఎం పూర్తికాలం కార్యకర్తగా మారారు. 1981లో రైతు సంఘం వరంగల్‌ ‌జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1978 జూన్ 25న హైదరాబాద్ మహాసభలో రాష్ట్ర రైతు సంఘం నాయకత్వంలోకి వచ్చారు. 1999 ఫిబ్రవరి 17న జరిగిన వరంగల్ మహాసభలో రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా, 2003 ఫిబ్రవరి 21న కర్నూలు మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2003 మార్చి తొమ్మిదిన అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తిమ్మంపేట సర్పంచ్‌గా (1981-1988) పనిచేశారు. సింగిల్ విండో అధ్యక్షులుగా గ్రామాభివృద్ధికి, పేదల భూముల పరిరక్షణకు విశేష కృషి చేశారు. ఓంకార్‌ ‌సిపిఎంలో ఉన్న సమయంలో వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. నర్సంపేట డివిజన్‌‌లో 1973 నుంచి సిపిఎం పూర్తికాలం కార్యకర్తగా పనిచేశారు. 1981 అక్టోబర్ 11న నల్లబెల్లి మహాసభలో వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడిగా, 1985లో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడిగా, 1991లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005 జనవరి 28న రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుగా బాధ్యతల్లోకి వచ్చారు. 2015 వరకు ఆ విధుల్లో ఉన్నారు. 2015లో సిపిఎం రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్‌‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్