- కదంతొక్కిన కర్షకులు
- ఆకట్టుకున్న రెడ్ డ్రెస్ వలంటీర్ల కవాతు
- థింసా, లంబాడీ నృత్యం, కోయడప్పు, కోలాటం
- నల్లగొండలో ఎఐకెఎస్ మహాసభ మహాప్రదర్శన
ప్రజాశక్తి- ప్రత్యేక ప్రతినిధి నల్గొండ : అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) 36వ జాతీయ మహాసభల సందర్భంగా కర్షకులు కదంతొక్కడంతో నల్లగొండ పట్టణం ‘ఎర్ర’గొండగా మారింది. ఆదివారం నల్లగొండ నగర శివారు మర్రిగూడ బైపాస్ సెంటర్ వద్ద మహా ప్రదర్శనను ఎఐకెఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. ఎన్‌జి కాలేజ్ ప్రాంగణం వరకు సుమారు నాలుగు కిలోమీటర్లు నిర్వహించిన ర్యాలీలో కర్షకులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువత, మహిళలు, వృద్ధులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. ఎఐకెఎస్ జెండాలు చేతబట్టి ఎర్రజెండా పాటలతో ఉత్సాహంగా కదంతొక్కారు. ప్రదర్శనలో రెడ్ డ్రెస్ వలంటీర్ల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దారి పొడుగునా ఆదివాసీ సంప్రదాయ థింసా నృత్యాన్ని మహిళలు డప్పు దరువులకు లయబద్ధంగా ప్రదర్శించారు. లంబాడీ సంప్రదాయ నృత్యం, కోలాటం, పాటలతో ప్రదర్శన దద్దరిల్లింది. రైతాంగ పోరాట అమరులను స్మరించుకుంటూ సాగిన ప్రదర్శన ఆద్యంతం స్ఫూర్తివంతంగా, అత్యంత క్రమశిక్షణగా సాగింది. రైతు సంఘం నేతలపై స్థానిక ప్రజలు అడుగడుగునా బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికి పూలవర్షం కురిపించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు... ఎడ్లబండ్లపై ర్యాలీగా ప్రదర్శనకు వచ్చారు. రైతుల మహాప్రదర్శనలో మాజీ ఎంపి బృందా కరత్, ఎఐకెఎస్ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే, ఎఐకెఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్, మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహా రెడ్డి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, రైతు సంఘం నాయకులు ఎండి జహంగీర్, సుధాకర్ రెడ్డి, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)