రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి కార్మికుల ధర్నాలు, నిరసనలు
ప్రజాశక్తి - యంత్రాంగం : విబి గ్రామ్ జి పథకాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్నే కొనసాగించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యాన బుధవారం పలుచోట్ల ధర్నాలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రదర్శన, మానవహారం ఏర్పాటు చేశారు. ఎంపిడిఒ కార్యాలయాలు, సచివాలయాల వద్ద నిరసనలు తెలిపారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి కార్మికులు, మహిళలు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాతూరు వద్ద నిర్వహించిన ధర్నానుద్దేశించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి రమాదేవి మాట్లాడారు. పేదల పొట్టగొట్టె విబి గ్రామ్ జి పథకాన్ని రద్దుచేసి, 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, రాష్ట్రాలపై భారాలు పెరిగే విధంగా విబి గ్రామ్ జి పథకం ఉందని దీని గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. గత ఉపాధి హామీ చట్టంలో కేంద్రం 90శాతం నిధులు కేటాయిస్తే రాష్ట్రాలు 10 శాతం నిధులు ఖర్చుచేసేవని, కానీ ఈ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు భరించేలా మార్పులు చేశారన్నారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ర్టాలు ఈ నిధులు కేటాయించలేమని చెబుతున్నాయన్నారు. అంటే ఈ పథకాన్ని ఎత్తివేసే దురుద్దేశంతోనే మార్పులు తీసుకువచ్చారని విమర్శించారు. దీనివల్ల తిరిగి వ్యవసాయ కార్మికులు, పేదలు భూస్వాములపై ఆధారపడే పరిస్థితి వస్తుందని, తిరిగి వలసలు ప్రారంభమవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లు, పెట్టుబడిదారుల సేవలో తరిస్తూ సంపద సృష్టిస్తున్న శ్రమజీవుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 90 శాతం నిధులు కేంద్రమే భరించాలని, రోజు వేతనం రూ.600 చెల్లించాలని కోరారు. పని ప్రదేశాల్లో రెండు సార్లు ఫేస్ మస్తర్ రద్దు చేసి మాన్యువల్ హాజరు వేయాలని, వడదెబ్బకు, ప్రమాదాలకు చనిపోయిన పేదకుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం పంచాయతీ రాజ్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
విశాఖపట్నం మద్దిలపాలెం, అనకాపల్లి జిల్లా పరవాడ మండలం రావాడ, మునగపాక మండల కేంద్రం, ఎస్.రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం, కె.కోటపాడు మండలం వి.సంతపాలెం, దేవరాపల్లి మండలం చింతలపూడి తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మద్దిలపాలెం జంక్షన్‌లో నిరసన కార్యక్రమానికి ముందు కళాభారతి జంక్షన్ నుంచి మద్దిలపాలెం వరకు ప్రదర్శన చేపట్టారు. అనంతరం మానవహారం నిర్వహిం చారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలోని సచివాలయంతో పాటు బలిజిపేట మండలం బలిజపేట, వంతరాం, పలగర, కుమరాడ గ్రామ సచివాలయాల్లో వినతులు అందజేశారు. ఉమ్మడి అనంతపురం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లోని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టారు. ఎంపిడిఒ కార్యాలయాల వద్ద నిరసన తెలిపి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.







కామెంట్‌లు (0)