భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ పుస్తకాలను విసిరేసిన పోలీసులు
నిలదీసిన అభిజిత్ దీప్కే
• జోరు వర్షంలోనూ సిజెపి ఆందోళన
క్షీణిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం
ఎసిపి అజయ్ శర్మను తక్షణమే సస్పెండ్ చేయాలి : అభిజీత్ దీప్కే
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆందోళనపై పోలీసులు విరుచుకుపడ్డారు. ఢిల్లీ జంతర్ మంతర్ లోని ఆందోళన శిబిరం వద్ద నిర్వహిస్తున్న గ్రంథాలయంపై గురువారం దాడికి పాల్పడ్డారు. భగత్‌సింగ్, ఛత్రపతి శివాజీ తదితరుల పుస్తకాలను సైతం విసిరేశారు. అడ్డుకున్న పలువురు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. దీంతో, పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ చర్యపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చిన పోలీసులను సిజెపి వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే నిలదీశారు.
‘‘భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ లకు సంబంధించిన పుస్తకాలతో సహా ఇతర పుస్తకాలను ఎసిపి అజయ్ శర్మ, ఆయన బృందం పారవేసి, లైబ్రరీని ఏర్పాటు చేసిన విద్యార్థులపై దారుణంగా దాడి చేశారు. భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్‌లను అవమానించినందుకు ఎసిపి అజయ్ శర్మను తక్షణమే సస్పెండ్ చేయాలి’’ అని డిమాండ్ చేశారు. గాయపడిన విద్యార్థులను పిలిచి, పోలీసు దాడిలో తగిలిన దెబ్బలను చూపించారు. ఇటువంటి చర్యలు మానుకోవాలని కోరారు.

13వ రోజూ కొనసాగిన ఆందోళన
నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఇ అవకతవకలతోపాటు విద్యా రంగ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన 13 రోజు గురువారం కొనసాగింది. విద్యార్థులు విద్యా వ్యవస్థకు ప్రతీకాత్మక అంత్యక్రియలు (శిక్షా వ్యవస్థ కా శవ్) నిర్వహించారు. ‘భవిష్యత్తును నిర్మించాల్సిన వ్యవస్థే నిరంతర పేపర్ లీక్‌లతో దానిని నాశనం చేస్తుంటే, ఇక ఏమి చేయగలరు? వారు ఎవరి వైపు చూడాలి?’ అంటూ విద్యా వ్యవస్థకు పాడె కట్టి వినూత్నంగా ఆందోళన చేపట్టారు. గురువారం జోరు వానలో కూడా విద్యార్థులు, యువత ఆందోళన చేపట్టారు.
పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరహారదీక్ష ఐదో రోజు కొనసాగింది. ఆయన ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తోంది. గురువారం రక్తపోటు (బిపి) 115/69, నాడి వేగం (పల్స్ రేటు) 72, రక్తంలో షుగర్ లెవల్ 60కి పడిపోయింది. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి విషమిస్తోందని, ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అభిజీత్ దీప్కే హెచ్చరించారు. ప్రధాన్ రాజీనామా చేయాలన్న తన డిమాండ్‌ను ఆయన పునరుద్ఘాటించారు.
"బొద్దింకలతో చాయ్ పే చర్చ"
సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే "బొద్దింకలతో చాయ్ పే చర్చ" కార్యక్రమాన్ని ప్రకటించారు. "ఈ ఉద్యమాన్ని మరింత మెరుగ్గా, పెద్దదిగా ఎలా చేయగలం" అనే దానిపై అభిప్రాయాలు సేకరించడమే లక్ష్యంగా, దీప్కే నిరసనకారులతో "బొద్దింకలతో చాయ్ పే చర్చ" పేరుతో ఒక సమావేశం నిర్వహించారు. సిజెపి ఆందోళనకు సిపిఐఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, సమాచారహక్కు కార్యకర్త అంజలి భరద్వాజ్, టిఎంసి ఎంపి సాగరిక ఘోష్ సంఘీభావం తెలిపారు. ఇప్పటికే ఈ ఉద్యమానికి సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ, సీనియర్ నాయకురాలు బృందాకరత్ మద్దతు తెలిపారు. విద్యార్థి, రైతు, మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి.







కామెంట్‌లు (0)