సైన్స్ క్లాస్ సీరియస్‌గా జరుగుతోంది. సురేష్ మాస్టారు వివిధ రకాల పక్షుల గురించి ఆసక్తికరంగా బోధిస్తున్నారు. ఇంతలో రామూ లేచి నిలబడ్డాడు.
‘ఏంటి రామూ! ఏదైనా సందేహమా?’ అని అడిగారు సురేష్ మాస్టారు.
‘అవును సార్.. నేను రోజు బాగా మారాం చేస్తున్నానని మా నాన్న నన్ను “రాబందులా పీక్కుతింటున్నావు” అని అన్నారు. రాబందులు పీక్కుతింటాయా సార్! మనకు కాకులు, పిచ్చుకలు, చిలుకలు కనిపిస్తున్నాయి. కానీ రాబందులు ఎక్కడా లేవుగా సార్.. ఎందుకని?’ అని అడిగాడు రాము.
‘నిజమే రామూ.. ఒకప్పుడు రాబందులు చాలా ఉండేవి. అయితే పశువుల నొప్పులు, వ్యాధులను నయం చేయడానికి అప్పట్లో చాలా మంది 'డైక్లోఫెనాక్' అనే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్‌ను విపరీతంగా వాడేవారు. డైక్లోఫెనాక్ ఇచ్చిన పశువులు చనిపోయిన తర్వాత, ఆ కళేబరాలను (మృతదేహాలను) తిన్న రాబందుల శరీరంలోకి ఈ మందు ప్రవేశించింది. ఈ మందు రాబందుల శరీరంలో అత్యంత విషపూరితంగా మారి వాటి మూత్రపిండాలు పాడై, అవి చనిపోయాయి’ అని మాస్టారు రాబందుల గురించి వివరించారు.
‘మరయితే రాబందులు పీక్కుతినేవా సార్?’ అని రాము అమాయకంగా మాస్టారిని అడిగాడు.
‘లేదు రామూ.. అవి చనిపోయిన జంతువులను మాత్రమే తినేవి. వాస్తవానికి అవి పర్యావరణ బంధువులు’ అంటూ ఆ రోజు పాఠాన్ని మాస్టారు ముగించారు. సురేష్ మాస్టారు ఇచ్చిన వివరణతో ఒక కొత్త విషయం తెలుసుకున్నామన్న ఆనందంలో రామూతో పాటు ఇతర విద్యార్థులు కూడా మాస్టారికి ధన్యవాదాలు తెలిపారు.
- యం. రాం ప్రదీప్, జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు,
94927 12836.







కామెంట్‌లు (0)