శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమహిళా రైతుల విలువ గుర్తించండి

1 గంట క్రితం

agri workers
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

అమ్మ అన్నం పెడుతుంది. అమ్మ అన్నానికి కావాల్సిన గింజల్ని, కాయల్ని పండిస్తున్నది. ఈ కీలక అంశాన్ని ప్రపంచం పట్టించుకోవటం లేదా?! వాస్తవానికి వ్యవసాయ రంగ సంక్షోభాలకు మూల కారణం ఇక్కడే ఉంది. ఈ విషయాన్ని ప్రపంచ దేశాలకు మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేసింది 'ప్రపంచ వ్యవసాయ ఫోరం'.

వ్యవసాయ సంక్షోభాల పరిష్కారానికి, సహజ వనరుల పునరుద్ధరణకు ప్రజల్ని సమాయత్తం చేసేందుకు ఐక్యరాజ్యసమతి ప్రతి సంవత్సరం కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ (సి.ఒ.పి-కాప్‌) జరుపుతూనే వుంది. తాజాగా ముప్పయ్యవ సదస్సు బ్రెజిల్‌ లోని బెలెమ్‌ నగరంలో జరిపింది. ఇప్పుడు ప్రపంచ వ్యవసాయ ఫోరం ప్రపంచ దేశాలలో మహిళా రైతుల దీక్ష జరపాలంటున్నది. అంటే 2026ను ప్రపంచమంతటా మహిళా రైతుల కోసం ఆచరణాత్మక శాసనాలు చేయమంటున్నది. వాస్తవానికి యు.ఎన్‌.ఒ 2025 డిసెంబర్‌ నెలలోనే ఈ పిలుపునిచ్చింది. వ్యవసాయ ఉత్పత్తులకు, వాటి వినియోగానికి కీలకమైన శ్రమజీవుల పాత్రను గుర్తించటమే దీనంతటి సారాంశం. ఆ శ్రమ జీవుల్లో అత్యధిక భాగంగా వున్న స్త్రీలకు తగిన భాగస్వామ్యాన్ని ఇవ్వటమన్నమాట. వివిధ దేశాల నిపుణుల గణాంక వివరాల ప్రకారం, వ్యవసాయంలో సుమారు 45-50 శాతం పాత్రను మహిళలు నిర్వహిస్తున్నారు. అయినా సరే శతాబ్దాల తరబడి మహిళా వ్యవసాయదారుల శ్రమకు తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం లేదు. వెనకబడిన దేశాలున్న ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోనేగాక, అభివృద్ధి చెందాయనే భ్రమను కలిగిస్తున్న ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల పరిస్థితి కూడా ఇలాగే వుంది. మహిళా రైతులకు తగిన భాగస్వామ్యం లేకపోవటం శోచనీయం. వ్యవసాయపరంగా ఈ లింగ వివక్షను రూపుమాపగలిగితేనే ప్రపంచ వార్షిక ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికీ ఆహార భద్ర‌తకు నోచుకోలేని 4-5 కోట్ల మందికి మేలు జరుగుతుంది. 'కాప్‌' ‌సదస్సులు ఇచ్చే పిలుపులు ఫలవంతం కావాలంటే ఈ మార్పులు జరగాలి!

ప్రపంచ వ్యవసాయ ఫోరం సమావేశంలో అనేకమంది శాస్త్రవేత్తలు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ రంగ నిపుణులు పాల్గొన్నారు. సదస్సు ద్వారా అనేక విశ్లేషణలు జరిగాయి. ఆహార రూపకల్పనలో, వినియోగంలో స్త్రీల పాత్ర అత్యంత విలువైనది. దాదాపు 75 శాతం దిగువ, మధ్య తరగతి కుటుంబాల మహిళలు, ముఖ్యంగా దక్షిణ ఆఫ్రికా, ఆసియా దేశాల్లో వ్యవసాయ పరంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అధ్యయనాలు తేల్చాయి. అయినప్పటకీ వారిలో 15 శాతం మహిళలకు కూడా వ్యవసాయ వనరులపై హక్కులు లేవు. ఆర్థికపరంగా, సాంకేతికాంశాల రూపకల్పనలో, అలానే వాణిజ్య విస్తరణల పరంగా వారి పాత్ర అత్యల్పం. మహిళా వ్యవసాయదారుల హక్కులను పునరుద్ధరించటం ద్వారా సుస్థిరమైన ఆహార ఉత్పత్తులకు, వినియోగానికి ప్రణాళికలు రూపొందించవచ్చని గత అనుభవాలు నిరూపించాయి. నూతన వనరుల వినియోగం ద్వారా సమాజం ఎదుర్కొంటున్న అసమతుల్య వరవడిని ఆపవచ్చు. అందుకే ప్రపంచ దేశాలన్నీ మహిళా వ్యవసాయదారుల రక్షణకు తగిన సంస్కరణలను 2026 నుండి అమలుపరచాలి.

కాని దురదృష్టవశాత్తు గత ఆరు నెలల కాలంలో (2026) ఈ పిలుపును కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థలేవీ పట్టించుకొన్న దాఖలాలు లేవు. భారతదేశంలో కేవలం ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పరిశోధనా సంస్థ (చెన్నై) ఈ పిలుపునకు స్పందించి కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. వాటిని మన తెలుగు రాష్ట్రాల రైతులకు తెలియచేసేందుకు, మన ప్రభుత్వం మేల్కొనాలన్న లక్ష్యంతో 'ప్రజాశక్తి' గత నెలలో విశ్లేషణాత్మక వ్యాసం ప్రచురించింది. 'మన రైతువాణి' సైతం ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ఈ పిలుపును అందించే ప్రయత్నం చేసింది.

ఈ సందర్భంగా మనం వాటిని గుర్తించి మరోసారి ప్రపంచ వ్యవసాయ ఫోరం తీర్మానాన్ని విస్త్రృతంగా రైతులకు, వ్యవసాయ అభివృద్ధికి నియమించబడిన అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం.

1. మహిళా రైతుల రక్షణకు, భాగస్వామ్యానికి తగిన వ్యవసాయ రంగ (భూసాగు) చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేద్దాం.

2. లింగ వివక్షను తగ్గించగల సంస్కరణలను హేతుబద్ధంగా అమలు చేద్దాం.

3. నూతన వ్యవసాయ సాంకేతికాల రూపకల్పనలో మహిళల గొడ్డు చాకిరిని తగ్గించేందుకు ప్రాధాన్యతనివ్యాలి.

4. శాస్త్ర-సాంకేతికాల అభివృద్ధిలో స్త్రీల పాత్ర పెరగాలి (ఈ విషయాన్ని 60-70 సంవత్సరాల నాడు డా. జానకీ అమ్మాళ్‌ ప్రపంచానికి వివరించి ఆచరణలో చూపెట్టారు).

5. ప్రాంతీయ సదస్సులను జరపాలి. వీటిని ప్రధానంగా సహకార సంఘాలు నిర్వహించగలగాలి (స్వామినాధన్‌ జాతీయ రైతు కమిషన్‌ సూచన, ఆచరణ). వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలను పంచాయతీలు నడపాలి (రైతు కమిషన్‌ సూచన).

7. వాతావరణ మార్పులను ఎదుర్కోగలిగిన ప్రణాళికల్ని స్త్రీల అనుభవ నేపథ్యంతో రూపొందించాలి.

8. వివిధ ప్రాంతాల్లో గణాంక సేకరణ, విధి నిర్వహణల పరంగా స్త్రీల భాగస్వామ్యం ఉండాలి. (పొ. సుమన్‌ సహాయ్‌, జీన్‌ క్యాంపెయిన్‌)

9. స్త్రీ శ్రమకు తగిన వాణిజ్య విధానాన్ని గుర్తించి, వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరను నిర్ణయించి అమలు చెయ్యాలి. (డా. సునీతా నారాయణ్‌, డౌన్‌ టు ఎర్త్‌)

10. దేశ స్వావలంబనకు, పర్యావరణ రక్షణకు తగిన మూల విత్తన రక్షణ పథకాల పరంగా ఆదివాసీ రైతుల పాత్రను గుర్తించాలి. (డా. వందనా శివ, నవధాన్య, మూల విత్తన రక్షణ ఉద్యమం)

n. venugopal rao

వ్యాసకర్త : ప్రొ. ఎన్‌.వేణుగోపాలరావు

రైతు రక్షణ వేదిక నేత, సెల్‌: 9490098905 /


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్