విశాఖపట్నం సముద్ర తీరం అంతా ఇటు ఆర్కే బీచ్ నుంచి అటు భీమిలి దాకా కోలాహలంగా ఉంది. రోడ్డు మీది నుంచి చూస్తే బీచ్ అస్సలు కనిపించడం లేదు. రోడ్డు దిగి బీచ్ లోకి అడుగు పెట్టి చెప్పులు విప్పి ఒట్టి కాళ్ళతో నడుస్తూ వుంటే నా కాళ్ళను చల్లగా తాకుతూ ఆప్యాయంగా పలకరించే తడి ఇసుక, ఊపిరితిత్తులలోకి వ్యాపించే ఆ సముద్రపు గాలి. మంద్రంగా, లయ బద్ధంగా చెవులకు వినిపించే ఆ కెరటాల హోరు---ఇవేవీ లేవు. అలసిపోయినప్పుడో, మనస్సులో కలవరపాటు ఉన్నప్పుడో, రొటీన్ జీవితపు యాంత్రికత మీద విసుగొచ్చినప్పుడో, పెళ్ళాం బిడ్డలతో ఆహ్లాదంగా కొంతసేపు కాలక్షేపం చేద్దామనుకున్నప్పుడో వైజాగ్ లోని సామాన్య జీవికి గుర్తొచ్చేదీ, భరోసానిచ్చేదీ, ఓదార్చేదీ, జీవితం మీద మళ్ళీ ఆశలను చిగురింపజేసేదీ ఆ వైజాగ్ బీచ్ మాత్రమే కదా ! కాని ఇప్పుడు అక్కడ నా బీచ్ లేదు. అదృశ్యం అయిపోయింది! అక్కడ ఉన్నవన్నీ టెంట్లు, కాళ్ళకి ఇసుక అంటకుండా పట్టాలు, సముద్రం కెరటాల హోరు వినపడకుండా డి.జె ల రొదలు మాత్రమే.
నిన్న సాయంత్రం నా దగ్గరికి వచ్చిన ఒక మిత్రుడు విశాఖపట్నం నగరపు రూపు రేఖల్ని కూటమి ప్రభుత్వం మార్చేయడానికి ఎంత గట్టిగా పూనుకుంటోందో కొంతసేపు వివరించేడు. గూగుల్ డేటా సెంటర్ గురించి వర్ణించి అదో అంతర్జాతీయ అనుభవం అని, గూగుల్ కంపెనీ కన్ను మన ఊరిమీద పడడమే ఈ ఊరి ప్రజలు చేసుకున్న పుణ్యం అని అన్నాడు. ఆ తర్వాత భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం గురించి చెప్పేడు. దాంతో మన ఊరు ఇంటర్నేషనల్ లెవెల్లో టాప్ రేంజ్ లో ఉంటుంది అని చెప్పేడు. ఆ మీదట బీచ్ షాక్స్ గురించి మరీ చెప్పేడు. గోవాను తలదన్నే విధంగా వైజాగ్ బీచ్ మారిపోతుందని ఉబ్బి తబ్బిబ్బైపోయేడు. ఇవన్నీ మనకి చంద్రబాబు గణం ఇచ్చిన వరాలు అన్నాడు. అటువంటి సిఎం ఉండడం మన వైజాగ్ వాసులు చేసుకున్న పుణ్యం అన్నాడు.
మామూలుగా నాకు నిద్రలో కలలు రావు. కాని మా మిత్రుడి పుణ్యమో ఏమో గాని ఒక కల వచ్చింది. ఆ కల ఎంతగా నన్ను భయపెడుతోందంటే ఇప్పుడు తలుచుకున్నా వొళ్ళు గగుర్పొడుస్తూ వుంది. ఇంతకీ ఏమిటా కల?
విశాఖపట్నం సముద్ర తీరం అంతా ఇటు ఆర్కే బీచ్ నుంచి అటు భీమిలి దాకా కోలాహలంగా ఉంది. రోడ్డు మీది నుంచి చూస్తే బీచ్ అస్సలు కనిపించడం లేదు. రోడ్డు దిగి బీచ్ లోకి అడుగు పెట్టి చెప్పులు విప్పి ఒట్టి కాళ్ళతో నడుస్తూ వుంటే నా కాళ్ళను చల్లగా తాకుతూ ఆప్యాయంగా పలకరించే తడి ఇసుక, ఊపిరితిత్తులలోకి వ్యాపించే ఆ సముద్రపు గాలి. మంద్రంగా, లయ బద్ధంగా చెవులకు వినిపించే ఆ కెరటాల హోరు---ఇవేవీ లేవు. అలసిపోయినప్పుడో, మనస్సులో కలవరపాటు ఉన్నప్పుడో, రొటీన్ జీవితపు యాంత్రికత మీద విసుగొచ్చినప్పుడో, పెళ్ళాం బిడ్డలతో ఆహ్లాదంగా కొంతసేపు కాలక్షేపం చేద్దామనుకున్నప్పుడో వైజాగ్ లోని సామాన్య జీవికి గుర్తొచ్చేదీ, భరోసానిచ్చేదీ, ఓదార్చేదీ, జీవితం మీద మళ్ళీ ఆశలను చిగురింపజేసేదీ ఆ వైజాగ్ బీచ్ మాత్రమే కదా ! కాని ఇప్పుడు అక్కడ నా బీచ్ లేదు. అదృశ్యం అయిపోయింది! అక్కడ ఉన్నవన్నీ టెంట్లు, కాళ్ళకి ఇసుక అంటకుండా పట్టాలు, సముద్రం కెరటాల హోరు వినపడకుండా డి.జె ల రొదలు మాత్రమే.
ఉదయాన్న సూర్యోదయం, పౌర్ణమి నాడు చంద్రోదయం చూసి ఆ అనుభూతిని పలవరించాలంటే వైజాగ్ వాసులకి ఉన్న అవకాశం మా బీచ్. కాని ఇప్పుడు అక్కడికి వెళ్తే బీచ్ అనేదే కనిపించకుండా ఏవేవో దుకాణాలు, పబ్ లు వచ్చేశాయి! అసలు సముద్రమే కనిపించనప్పుడు ఇక సూర్యోదయం, చంద్రోదయం ప్రసక్తే లేదు. బీచ్ లో వెల్లకిలా పడుకుని నిండు పున్నమి చంద్రుడిని చూస్తూ ఆనందించే అవకాశమూ లేదు.
కనిపించని నా బీచ్ ని నేను వెతుక్కుంటూ వుంటే, నా మనవడి నుండి ఫోను వచ్చింది. ఆ తొమ్మిదేళ్ళ కుర్రాడు ''తాతా! లాస్ట్ ఇయర్ హాలీడేస్ కి నువ్వు నన్ను బీచ్ కి తీసుకెళ్ళి పిచ్చుక గూళ్ళు ఎలా కడతారో చూపించేవు. అది భలేగా ఉంది. ఇంకా గవ్వలు ఎలా ఏరాలో నేర్పేవు. కెరటాలతో ఎలా ఆటలు ఆడుకోవాలో నేర్పేవు. నేను ఈ సెలవలకి మళ్ళీ వస్తున్నాను. మళ్ళీ బీచ్ కి తీసుకెళ్ళాలి సుమా!'' అంటున్నాడు. కనిపించకుండా పోయిన నా వైజాగ్ బీచ్ గురించి వాడికి ఎలా చెప్పాలో తెలియడం లేదు.
కలలకి కాలంతో పని లేదు కదా. ఈ సారి పన్నెండేళ్ళ వయస్సులో ఉన్నప్పటి నా కూతురు వచ్చింది. ''నాన్నా! బీచ్ కి వెళ్దాం నాన్నా! మురీ మిక్స్చర్, మిరపకాయ బజ్జీలు, కారం వేసిన మామిడికాయ ముక్కలు, కాల్చిన మొక్కజొన్న పొత్తులు తినాలి నాన్నా'' అంటోంది. వాటిని అమ్మే వాళ్ళకోసం చుట్టూ చూసేను. ఒక్కళ్ళూ లేరు. వాళ్ళూ మాయం అయిపోయేరు. నాకు ఉన్నట్టుండి భయం వేసింది. గబుక్కున తెలివొచ్చింది. కల గుర్తుకొచ్చింది.
మామూలుగా మనం కనే కలలు అన్నీ నిజం కావంటారు. కాని ఇది పట్టుబట్టి, పని గట్టుకుని చంద్రబాబు నిజం చేయబోతున్న పీడకల! దీనిని గొప్పగా చెప్పుకుంటూ, ఔచిత్యాన్ని సైతం మరిచిపోయి శాసనసభ స్పీకర్ నుండి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకుంటున్న దరిద్రపు కల! ఈ పీడకల నన్ను వొదలడం లేదు.
సాయంత్రం నా సతీమణి వచ్చి ''ఏమయ్యా! ఇంట్లోనే ఉన్నావు కదా! పద! అలా బీచ్ దాకా వెళ్ళొద్దాం. ఇంట్లోనే ఉండిపోయి విసుగొచ్చేస్తోంది.'' అంది.
''ఇప్పుడు అక్కడ బీచ్ లేదుగా!'' అన్నాను. ఆమె నా ముఖంలోకి వింతగా, భయం భయంగా చూస్తోంది. ఆ చూపుని భరించడం నా వల్ల కావడం లేదు.
ప్లీజ్! మా వైజాగ్ బీచ్ ని, మా సముద్రాన్ని మాకు వెనక్కి తెచ్చివ్వరూ!
- సుబ్రమణ్యం

కామెంట్‌లు (0)