కొత్తగా బడిలో చేరే చిన్నారులు, చిన్న తరగతులు చదివే పిల్లలు కొత్త వాతావరణానికి అలవాటు పడే క్రమంలో కొంత మారాం చేస్తుంటారు. స్కూలుకు వెళ్లటానికీ, భోజనం చేయటానికీ ఇబ్బంది పెడుతుంటారు. ఇది చాలా వరకు సహజమైన విషయమే. వాళ్లను కాస్త సముదాయించి మానసికంగా సిద్ధం చేస్తే ఎంచక్కా స్కూలుకు వెళ్తారు. సమయానికి భోజనం చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. వారితో ప్రేమగా, ఓపికగా మాట్లాడితే త్వరగా కలిసిపోతారు. ప్రతి విషయాన్ని నాన్నా, కన్నా, బుజ్జి అంటూ ఆప్యాయంగా చెబుతూ దారిలో పెట్టాలి.
పిల్లలకు సరదా దినచర్య అంటే ఇష్టం. స్కూల్‌కి వెళ్లే ముందు ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే వారు ఉత్సాహంగా తయారవుతారు. స్కూల్‌కి టైమవుతుంది, బ్రష్ చేసుకో, స్నానం చేయ్, టిఫెన్ చేయ్ అంటూ హడావుడి చేయకుండా సరదాగా సిద్ధం చేయాలి. ఉదయం పూట కొంతసేపు ఆట, వినోదానికి అవకాశం కల్పించండి. ఉదాహరణకు పిల్లలు లేవగానే ఓ పది నిమిషాలు వారికి ఇష్టమైన ఆటలు ఆడనివ్వండి. లేదా ఇష్టమైన పనులు చేయనివ్వండి. ఇలా చేయడం వల్ల వారి మనసు ఆహ్లాదంగా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో వారికి ఇష్టమైన వాటిని చేసి పెట్టాలి. దీంతో వారు ఆనందంగా స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతారు.
మారాం చేసే పిల్లలను బడికి సిద్ధం చేయడం తల్లిదండ్రులకు కొంత సవాలుగా అనిపించవచ్చు. కొందరు పిల్లల్లో స్కూల్ గురించి సందేహాలు, సంకోచం ఉంటాయి. స్కూల్ గురించి విన్న కొన్ని అపోహల వల్ల కూడా అలాంటి భావన ఏర్పడుతుంది. అందుకే పిల్లల ముందు స్కూల్ గురించి ఎప్పుడూ సానుకూలంగా మాట్లాడండి. స్కూల్‌కి వెళితే కొత్త స్నేహితులతో సరదాగా ఆడుకోవచ్చని, కొత్త విషయాలు నేర్చుకోవచ్చని వారికి ఉత్సాహం ఇవ్వండి. టీచర్లు కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారని, అవసరమైన సహాయం అందిస్తారని చెప్పండి. మీ చిన్నతనంలో స్కూల్‌లో జరిగిన సరదా సంఘటనలను కథలుగా చెప్పండి. దీంతో పిల్లలు స్కూల్‌ను ఆనందంగా గడిపే ప్రదేశంగా భావిస్తారు. రోజూ స్కూల్‌కి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు.
ప్రోత్సాహం : స్కూల్ నుంచి వచ్చిన తర్వాత "ఈ రోజు ఏ పాఠాలు చెప్పారు? బాగా చదువుతున్నావా?" అని అడిగే బదులు, "ఈ రోజు ఏ ఆటలు ఆడుకున్నావు? మీ స్నేహితులతో ఎలా గడిపావు? ఈ రోజు కొత్తగా ఏమి నేర్చుకున్నావు?" అని అడగండి. వాళ్ల మాటలను ఆసక్తిగా వినండి. అలాగే స్కూల్ బ్యాగ్ సర్దడం, టిఫెన్ బాక్స్ సిద్ధం చేసుకోవడం వంటి పనుల్లో పిల్లలను భాగస్వాములను చేయండి. దీనివల్ల వారిలో బాధ్యత పెరుగుతుంది. స్కూల్‌లో జరిగే వివిధ కార్యక్రమాలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యాక్టివిటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించండి. చదువుతో పాటు ఆటలు, స్నేహాలు, సృజనాత్మక కార్యక్రమాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వండి.

స్నేహభావం : పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు స్కూలుకు వెళ్లి తరగతి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, ఇతర స్కూలు సిబ్బందితో స్నేహంగా మెలగాలి. దీనివల్ల పిల్లలకు స్కూలు వాతావరణం సుపరిచితంగా అనిపిస్తుంది. వీలు చిక్కినప్పుడల్లా నవ్వు తెప్పించే కథలు, సరదా సంఘటనలు చెబుతూ స్కూల్‌పై ఆసక్తిని పెంచాలి.
బుజ్జగించాలి : పిల్లలు స్కూలుకు వెళ్లనని మారాం చేసినప్పుడు ప్రశాంతంగా మాట్లాడాలి. వారి మనసులో ఏముందో తెలుసుకోవాలి. స్కూల్‌కు వెళ్లాలనిపించకపోవడానికి గల కారణాన్ని ఓపికగా వినాలి. కారణాన్ని బట్టి వారికి అర్థమయ్యేలా వివరించి, స్కూలుకు వెళ్లాలనే ఆసక్తి కలిగేలా చేయాలి. వారి ఆత్మస్థైర్యాన్ని పెంచాలి.
మాటామంతి : పిల్లలు తరచూ స్కూల్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోతే క్లాసు టీచర్‌తో మాట్లాడండి. పిల్లలు స్కూల్‌లో ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమిటో తెలుసుకోండి. క్లాస్‌మేట్‌తో చిన్న గొడవ, పాఠాలు అర్థం కాకపోవడం, ఒంటరిగా అనిపించడం వంటి కారణాలు కూడా ఉండొచ్చు. వాటిని ఉపాధ్యాయుల సహకారంతో పరిష్కరిస్తే పిల్లలు మళ్లీ ఉత్సాహంగా స్కూల్‌కి వెళ్లడం ప్రారంభిస్తారు. పిల్లలను వీలైనంత వరకు స్కూలులో దింపడం, స్కూలు అయిపోయాక తీసుకురావడం చేయాలి. స్కూల్లో తమ పిల్లలు ఎలా ఉంటున్నారో ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుంటూ ఉండాలి. వారు చెప్పిన సలహాలు, సూచనలు పాటించాలి.
ఓపిక : ప్రతి చిన్నారి తనదైన వేగంతో కొత్త వాతావరణానికి అలవాటు పడతాడు. అందుకే తల్లిదండ్రులు ప్రేమతో, ఓర్పుతో వ్యవహరించాలి. ఎల్లప్పుడూ వారికి అండగా ఉన్నామనే భరోసా కల్పించాలి. చిన్న చిన్న మంచి పనులను కూడా మెచ్చుకోవాలి. "నా చిన్ను త్వరగా రెడీగా అయిందే", "నా బంగారం వెరీ గుడ్ బాయ్" అంటూ ప్రోత్సహిస్తే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. స్కూల్‌పై మంచి అభిప్రాయం ఏర్పడి, ఆనందంగా బడికి వెళ్తారు.
- ఎస్‌పి మనోహర్,
యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి







కామెంట్‌లు (0)