శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఏకపక్ష వైఖరి​

2 గంటల క్రితం

upadi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

దేశ వ్యాప్తంగా వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి–ఆజీవికా మిషన్ (విబి గ్రామ్‌‌జి)ని అమలులోకి తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష, నిరంకుశ వైఖరికి నిదర్శనం. రాష్ట్రాలతో, రాజకీయ పార్టీలతో, కార్మిక సంఘాలతో, పంచాయతీరాజ్ సంస్థలతో ఎటువంటి సంప్రదింపులు లేకుండానే చట్టాన్ని మార్చేసిన కేంద్ర ప్రభుత్వం అమలులో సైతం అటువంటి ఒంటెత్తు పోకడలనే పోతోంది. నిజానికి గ్రామీణ పేదలకు ఉపాధిని చట్టబద్ధ హక్కుగా గుర్తించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం దేశ సామాజిక భద్రతా వ్యవస్థలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. 2005లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం కోట్లాది గ్రామీణ కుటుంబాలకు కష్టకాలంలో ఆసరాగా నిలిచింది. కరోనా మహమ్మారి సమయంలోనూ, కరువు, ఆర్థిక మాంద్యం వంటి సంక్షోభాల్లోనూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది. అటువంటి చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం దానికి భిన్నంగా కక్ష పూరితంగా వ్యవహరిస్తుండటం విచారకరం. నిజానికి పాత ఉపాధి హామీ చట్టం కేవలం ఒక పథకం కాదు. అది పార్లమెంటు ఆమోదించి, దేశ ప్రజలకు ఇచ్చిన ఒక చట్ట బద్ద హక్కు! తాజా గ్రామ్‌ ‌జి పథకంతో ఆ హక్కును రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం తిమ్మిని బమ్మి చేసే అవాస్తవ ప్రచారానికి దిగింది.

విబి గ్రామ్‌జి ని ప్రతిపక్ష పార్టీలే గాక, ఎన్‌‌డిఎ, బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యతిరేకిస్తుండటం గమనార్హం. సమాచార హక్కు చట్టం కింద వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం 13 రాష్ట్రాలు కేంద్రానికి లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేశాయి. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ ‌వంటి రాష్ట్రాలు కొత్త పథకం అమలులో భాగంగా తమపై పడనున్న ఆర్థిక భారంపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. పాత చట్టంలో ఉపాధి అమలుకోసం అయ్యే 90 శాతం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించేది. రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం బడ్జెట్‌‌లో సుమారు పది శాతం సమకూర్చేవి. కానీ, కొత్త పథకంలో 40 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి వస్తోంది. ఇది అనేక రాష్ట్రాలకు తలకు మించిన భారంగా మారుతోంది. ఒకవైపు బిజెపి పాలిత రాష్ట్రాలే అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. కొత్త పథకం అమలుకోసం కేంద్రం రూపొందించిన నిబంధనలతో నిధుల కేటాయింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలుగుతోందన్న ఆందోళనలు వ్యక్తమైనా పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమలుకు సిద్ధమైపోవడం దారుణం. రాష్ట్రంపై పడే ఆర్థికభారం విషయమై కేంద్రాన్ని నిలదీసి, నిధులు సాధించుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదు. పైపెచ్చు దేశ వ్యాప్తంగా విబి గ్రామ్‌‌జి అమలు ప్రారంభానికి తిరుపతి జిల్లా మంగంపుట వేదిక కావడం విచారకరం. అధికారంలోని కూటమి నేతలు రాష్ట్ర ప్రయోజనాల కన్నా కేంద్ర పాలకుల అడుగులకు మడుగులొత్తడానికే ప్రాధాన్యత ఇస్తుండగా, ప్రశ్నించి రాష్ట్ర ప్రయోజనాలకు దన్నుగా నిలవాల్సిన ప్రధాన ప్రతిపక్షం కూడా ఆ తానులోని ముక్క మాదిరే వ్యవహరిస్తుండటం గమనార్హం!​

మరోవైపు దేశ వ్యాప్తంగా వామపక్షాలతో పాటు, వివిధ ప్రతిపక్ష పార్టీలు, వివిధ ప్రజా, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తున్నాయి. 2005 నాటి ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని, అదే సమయంలో పనిదినాలను పెంచాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కేంద్రం తన వైఖరిని మార్చుకోవడానికి సిద్ధంకాలేదు. వ్యవసాయ చట్టాలు, విద్యా విధానం, క్రిమినల్ చట్టాలు, ఇప్పుడు ఉపాధి హామీ విషయంలోనూ కేంద్రం ఏకపక్ష వైఖరినే అనుసరిస్తోంది. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధ హక్కులను పాలకుల ఇష్టానుసారం మార్చలేరు. విస్తృత చర్చ, సంప్రదింపులు, రాష్ట్రాల అంగీకారంతోనే ప్రజాస్వామ్య రథం ముందుకుసాగుతుంది. దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా కేంద్రం మొండి వైఖరిని వీడాలి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి, మరింత బలోపేతం చేయాలి. తగిన నిధులు కేటాయించడం, వేతన బకాయిలు వెంటనే చెల్లించడం, పనిదినాలను అవసరానికి అనుగుణంగా పెంచడం, గ్రామసభల అధికారాలను పటిష్టం చేయడం ద్వారా మాత్రమే గ్రామీణ భారతానికి భరోసా లభిస్తుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్