శుక్రవారం, 03 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionస్థానిక సంస్థలలో బి.సి రిజర్వేషన్లు - ఒక పరిశీలన

1 గంట క్రితం

IMage-for-epw-article
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 03, 2026, 05:30 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

స్థానిక సంస్థలలో బిసి సీట్ల రిజర్వేషన్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జోక్యం తరువాతనే రాష్ర్ట ప్రభుత్వం స్పందించింది. తదనుగుణంగా ఈ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన బిసి సంక్షేమ శాఖ ద్వారా ఒక జి.ఓ ను ప్రభుత్వం విడుదల చేస్తూ శ్రీరాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. నిజానికి ఈ కమిషన్ కు తన నివేదిక సమర్పించడానికి ఇచ్చిన గడువు 45 రోజులు. అది ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం కమిషన్ వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ వినతిపత్రాలను, సమాచారాన్ని సేకరిస్తున్నది. ఈ ప్రక్రియ ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు.

కమిషన్ వినతులను, సమాచారాన్ని అందించడానికి వీలుగా ఒక చరవాణి నంబరును, ఒక ఈ మెయిల్ ను అందుబాటులో ఉంచింది. రాష్ర్టంలో ఎవరైనా వాటి ద్వారా కమిషన్ కు సమాచారం అందించవచ్చు. మరి జిల్లాల పర్యటన ద్వారా కమిషన్ ఎలాంటి సమాచారాన్ని సేకరిస్తున్నదో వివరాలు తెలియవు. సీట్ల రిజర్వేషన్ కు సంబంధించి ముఖ్యమైన అంశం రాష్ర్టంలో ఉన్న బిసి జనాభా శాతం ఎంత? అన్నది రిజర్వేషన్ సంబంధంగా ఎస్.సి, ఎస్.టి జనాభాకు గాను వారి శాతాన్ని బట్టి స్థానిక సంస్థల్లో సీట్లను రాష్ర్టాలు రిజర్వు చేసుకోవచ్చునని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ఇంతకు మునుపే తన నిర్ణయాన్ని ప్రకటించింది. బిసి జనాభా సర్వే నిర్వహించి, వారి శాతాన్ని నిర్ధారించవలసి వుంది. ఈ విధమైన సమగ్ర సర్వే రాష్ర్ట ప్రభుత్వం తన యంత్రాంగం ద్వారా జరిపించకుండా, డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఏ విధంగా ఈ శాతాన్ని నిర్ధారించగలుగుతుంది?

ఈ విషయంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సర్వే నిర్వహించి, ఆ రాష్ర్టంలో బిసి జనాభా 56 శాతం ఉన్నదని, దాన్ని పరిగణనలోకి తీసుకుని స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే వాటి అమలు కోర్టు ప్రమేయం ద్వారా నిలిచిపోయింది.

డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు జి.ఓ లో పేర్కొన్న విధంగా కమిషన్ పరిధి సుప్రీం కోర్టు 2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్‌ యూనియన్ ఆఫ్ ఇండియా, 2021లో వికాస్ కిషన్ రావ్ గవాలి వర్సెస్‌ స్టేట్ ఆఫ్ మహారాష్ర్ట కేసుల్లో ఇచ్చిన తీర్పులకు లోబడి ఉంటుంది. ఈ పై రెండు కేసుల్లోనూ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ ట్రిపుల్ ‘టెస్ట్’ కు లోబడి ఉటుంది. ఆ అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

1. సీట్ల రిజర్వేషన్ కు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వాలు ఒక డెడికేటెడ్ కమిషన్ ను నియమించాలి.

2. బిసి జనాభా స్థితిగతులు, వెనుకబాటుతనం ఆధారంగా ఎంత శాతం మేర సీట్లను రిజర్వు చేయొచ్చుననే విషయాన్ని కమిషన్ నిర్ధారించాలి.

3. సీట్ల రిజర్వేషన్ మొత్తంగా ఎస్.సి, ఎస్.టి, బిసిలు కలిపి 50 శాతానికి దాటడానికి లేదు.

ఈ షరతులకు లోబడి బిసి కమిషన్ ఏం చేయగలుగుతుంది అన్నది ఇక్కడ చర్చ. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుతం రాష్ర్ట జనాభాలో 18.31 శాతం ఎస్.సి లు 5.86 శాతం ఎస్.టి లు ఉన్నారు. అంటే 24.17 శాతం ఈ రెండు వర్గాలకు పోను మిగిలేది కేవలం 25.83 శాతం. ఈ మాత్రం నిర్ణయించడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ అవసరమా? అన్నది ప్రశ్న.

రెండవది, డెడికేటెడ్ కమిషన్ చేయగలిగింది రాష్ట్రంలో బిసి ల స్థితిగతులు, మొత్తం జనాభాలో వారి శాతాన్ని నిర్ధారించడం. ముఖ్యంగా వెనకబాటుతనాన్ని తేల్చడం. ఈ విషయాన్ని తేల్చడానికి ఏయే కొలమానాలను ఉపయోగిస్తుందన్న విషయంగా కమిషన్ నుంచి ఏవిధమైన సమాచారంలేదు. ఈ విషయంగా ఆర్ధిక వెనుకబాటు తనం కంటే, సామాజిక వెనుకబాటుతనం ముఖ్యమైనది. దీనికి కమిషన్ సమగ్రమైన అధ్యయనం లేకుండా ఏవిధంగా నిర్ధారించగలుగుతుందని ఇక్కడ ప్రధాన అంశం. ఇప్పటికే బిసి లకు సంబంధించి, క్రీమీలేయర్, అత్యంత వెనుకబడిన తరగతుల నిర్ధారణ సమస్యాత్మకంగా ఉన్నాయి. ఈ సందర్భంలో డెడికేటెడ్ కమిషన్ ఏవిధంగా ముందుకు సాగుతుంది? అన్నది చర్చనీయాంశం. నిజానికి మండల్ కమిషన్ 1931 జనాభా ఆధారంగా పరిగణనలోనికి తీసుకొన్న లెక్కలు తప్ప, నేటి వరకు దేశం మొత్తంగా 'క్యాస్ట్ సెన్సస్` జరగలేదు. ఆ బాధ్యతను రాష్ట్రాలే తమ పరిధిలో తమకు తోచిన విధంగా నిర్వహిస్తున్నాయి. వీటి ప్రాముఖ్యత ఎప్పుడూ ప్రశ్నార్ధకమే. సామాజిక, సాంస్కృతిక అంశాలతో పాటు, రాజకీయ వెనుకబాటుతనాన్ని కూడా పరగణనలోనికి తీసుకుంటే, బిసిలకు మరింత అన్యాయం జరిగే అవకాశం ఉంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థలు (అంటే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిపి ), 13,325 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ మొత్తంలో డెడికేటెడ్ కమిషన్ ఎన్ని సీట్లను బిసిలకు రిజర్వు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది అన్నది చర్చ. కమిషన్ తన నివేదికను సమర్పించక మునుపే అధికారంలో ఉన్న ప్రభుత్వం తాము బిసిలకు స్థానిక సంస్థలలో 34 శాతం కల్పిస్తామని హామీ ఇస్తున్నట్లుగా వార్తలు. కమిషన్ పరిధి మొత్తంగా 50 శాతానికి మించని సందర్భంలో, ఈ శాతాలన్నింటికి విలువేముంటుంది? ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే గత ప్రభుత్వం నవంబరు 2023లో బిసి జనాభాకు సంబంధించి ఒక సమగ్ర సర్వేను నిర్వహింపజేసింది. అయితే, అప్పటి ప్రభుత్వం కాని, ఇప్పటి ప్రభుత్వం కాని ఆ సర్వే ఫలితాలను వెల్లడి చేయలేదు.

సదరు డెడికేటెడ్ కమిషన్ ప్రస్తుతం ఉన్న బిసి జనాభా జాబితాలో చేర్చబడిన కులాలలో మార్పులు గాని, చేర్పులుగాని పరిగణలోనికి తీసుకుంటుందా? ఈ విషయమై వారి పర్యటనలలో అనేక వినతులు కూడా ఉంటున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి కమిషన్ వైఖరి ఏమిటన్నది ముఖ్యమైన అంశం. నిజానికి ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ.నెం. 43లో ఈ అంశానికి సంబంధించి స్పష్టత లేదు. అయితే జి.ఓ ప్రకారం తన పని తీరు, విధి విధానాలను తానే నిర్ణయించుకోవచ్చు. అటువంటి సందర్భంలో ప్రస్తుత జాబితా సవరణ అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటుందా? అన్న విషయాన్ని స్పష్టం చేయాలి.

వాస్తవాలు ఈ విధంగా ఉండగా, స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ విప్లవాత్మక సూచనలు చేసే అవకాశం ఎంత మాత్రమూ లేదు. బిసి వర్గాల ఆకాంక్షలకు సంబంధించి ఇది మరొక కంటి తుడుపు చర్యగా మిగిలిపోవచ్చు.

pro viyanna rao

వ్యాసకర్త - ప్రొ. కోదాటి వియన్నారావు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ వైస్‌ ‌చాన్సలర్‌,

సెల్‌: 7093260655 /


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్