- ప్రయాణికులపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్
- కఠిన చర్యలు తీసుకోవాలంటున్న ప్రయాణికులు, స్థానికులు
ప్రజాశక్తి-నాయుడుపేట: నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్ కండక్టర్ నిర్లక్ష్య కారణంగా బుధవారం చోటుచేసుకున్న ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై ప్రయాణికులు, స్థానికులు మండిపడుతున్నారు. బుధవారం రాత్రి నాయుడుపేట ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీకాళహస్తికి వెళ్లేందుకు ఇద్దరు పిల్లలతో కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న గుణపాటి హైమావతి (55)అనే మహిళ కండక్టర్ దౌర్జన్యం కారణంగా బస్సు కింద పడి ప్రాణాపాస్థితికి చేరుకుంది కండక్టర్ ప్రయాణికులపై చేసిన దౌర్జన్యం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉందని సాకుతో కండక్టర్ ఆమెను బలంగా తోసేయడంతో అదుపుతప్పి బస్సు ముందు చక్రం కింద పడిపోయారు. ఈ దుర్ఘటనలో హైమావతి కుడికాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనలో కాలు నుంచి విపరీతమైన రక్తం వెలువవడంతో ఆ ప్రాంతం మొత్తం రక్తసిక్తమై ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేసింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై 108 అంబులెన్స్ ద్వారా బాధితురాలిని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వెంటనే నెల్లూరుకు తీసుకువెళ్లవలసిందిగా వైద్యులు సూచించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ప్రమాదానికి డ్రైవర్, కండక్టర్ నిర్లక్ష్యం కారణమా లేక వారు అంత దౌర్జన్యంగా వ్యవహరించేంత స్వేచ్ఛనిస్తున్న ఆర్టీసీ అధికారుల విధి విధానాలు కారణమా అని ప్రజలు మంచి ఆవేశాగ్రహాలు వెలువెత్తుతున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్లలో సరిపడా బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు నిత్యం ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. బస్సు ఎక్కేందుకు సైతం యుద్ధం చేయాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సుల కొరత తీర్చాల్సిన అధికారులు, రద్దీని సాకుగా చూపి ప్రయాణికుల పట్ల అమానుషంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణికులే సంస్థకు నిధి అని బస్సులో ప్రతి చోట రాస్తున్నప్పటికీ అందులో పనిచేస్తున్న సిబ్బందికి అది కనిపించకపోవడం కనీస మానవత్వం లేకుండా తోసేయడంతో ఒక మహిళ జీవితం అంధకారమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికుల శ్రేయస్సు కోరి తగినన్ని బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు తెస్తున్న సిబ్బందిపై దృష్టి సారించి ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని పై అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.








కామెంట్‌లు (0)