పనిచేయించుకోవడమే తప్ప, గౌరవించడం తెలియదు
ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు
ప్రజాశక్తి-కడప అర్బన్ : నగరపాలక సంస్థలో 30, 40 సంవత్సరాలకు పైగా పారిశుద్ధ్య రంగంలో పనిచేసిన రెగ్యులర్ కార్మికుల పట్ల నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) జిల్లా ఉపాధ్యక్షులు కంచుపాటి తిరుపాల్, నగర అధ్యక్షులు సుంకర రవి, సహాయ కార్యదర్శి ఇత్తడి ప్రకాష్ అన్నారు. బుధవారం పాత మున్సిపల్ కార్యాలయంలోని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెగ్యులర్ కార్మికులు ఐదు మంది రిటైర్ అయితే కనీసం పూలదండ వేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందుతే ఘనంగా వీడ్కోలు ఉంటుందని, పారిశుద్ధ్య కార్మికులకు మాత్రం ఎలాంటి సన్మానాలు లేకుండా పంపించడం దుర్మార్గమని తెలిపారు. కార్మికులతో గొడ్డు చాకిరి చేయించుకోవడం తప్ప గౌరవించడం అధికారులకు తెలియదని విమర్శించారు. నగరపాలక సంస్థలో ఆప్కాస్ కార్మికులు విధులు నిర్వహిస్తూ 15 మంది మరణించారని చెప్పారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు చేయలేదని పేర్కొన్నారు. వీరి ఉద్యోగాల కోసం నిరాహార దీక్షలు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేశామని తెలిపారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే, అధికారులు, అప్పటి పాలకవర్గం ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అమలు కోసం మరో మారు ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అడిషనల్ కార్మికులు ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారని, వీరికి రూ. 12వేలు మాత్రమే వేతనమిస్తున్నారని పేర్కొన్నారు. వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం దారుణమని తెలిపారు. వీరికి రూ. 15 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డ్రైవర్ల అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ బాబు, కార్యదర్శి సుంకర కిరణ్, కమిటీ సభ్యులు రామకృష్ణ, లక్ష్మీనరసింహ పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)