ప్రజాశక్తి - బి.కొత్తకోట (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లాలో రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భాగంగా ఆర్ అండ్ బి శాఖ చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీటీఎం మండలంలోని బూర్లపల్లి–టీ. సదుం–చెన్నారాయునిపల్లె రహదారిపై కిలోమీటర్ 16/8–10 వద్ద పాపాఘ్ని నదిపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పురోగతిని కలెక్టర్ పరిశీలించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బూర్లపల్లి–టీ. సదుం–చెన్నారాయునిపల్లె రహదారిని కిలోమీటర్ 0/000 నుంచి 18/300 వరకు అభివృద్ధి చేసే పనుల్లో భాగంగా ఈ వంతెనను నిర్మిస్తున్నట్లు ఆర్ అండ్ బి అధికారులు వివరించారు.
ఈ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. వంతెన పూర్తయిన అనంతరం ఈ ప్రాంత ప్రజలకు ఏడాది పొడవునా సురక్షితమైన రాకపోకలు అందుబాటులోకి రావడంతో పాటు వర్షాకాలంలో ఏర్పడే రవాణా ఇబ్బందులు గణనీయంగా తగ్గనున్నాయని వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలు, సాంకేతిక ప్రమాణాలు, భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించి ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.నిర్మాణంలో వినియోగించే సామగ్రి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలని, ప్రతి దశలో సాంకేతిక నిపుణుల సూచనలను పాటించాలని అధికారులకు సూచించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.డిసెంబర్–2026 నాటికి హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రహదారి అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలకు మెరుగైన, సురక్షితమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అనంతరం బి.కొత్తకోట–వయా రంగసముద్రం రహదారిపై చేపడుతున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. మొత్తం రూ.5.80 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనుల్లో భాగంగా సుమారు 300 మీటర్ల మేర ఒక వైపు సి.సి రోడ్డు నిర్మాణం పూర్తై ప్రస్తుతం క్యూరింగ్ పనులు కొనసాగుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించిన కలెక్టర్, నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను పూర్తి చేయాలని అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు, ఇంజినీర్లు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)