వారం రోజుల క్రితం వరుస భూకంపాలతో వెనిజులా దేశం చిగురుటాకులా వణికిపోయింది. కారకస్, లాగ్వేరా నగరాల్లో సంభవించిన ఆ పెను విపత్తుకు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోయారు. అయితే ఇంత బీభత్సం సృష్టించిన భూమి కంపించడం ఆగిపోగానే వెనిజులాలో మరో శక్తి ప్రభంజనంలా కదిలింది. అది.. దేశ ప్రజలు తీవ్ర విషాదంలో ఉన్నప్పుడు పరస్పర సంఘీభావమే వారికి అండగా ఉంటుందని నిరూపించిన శక్తి. ప్రజలే ఆపదలో ఉన్న తోటి వారిని కాపాడారు.

ప్రాపట్రియా మెట్రో స్టేషన్ దగ్గర కాఫీ షాపు నడుపుకునే 66 ఏళ్ల కార్లస్ గుర్రెరో ఆ రోజు తన వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చాడు. వచ్చిన కొద్దిసేపటికే భూకంపం వచ్చింది. భయంకర శబ్దాలతో, పరుగులు తీస్తున్న ప్రజల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా కంపించిపోయింది. కళ్లెదుట భవనాలు కూలిపోతుంటే కార్లస్ తన జీవితం ఇక ముగిసిపోయిందని భావించాడు. ఇంటి పైకప్పు కూలిపోయింది. గోడలు పడిపోయాయి. కంపనాలు ఆగిపోయాక కార్లస్ ఆ శిథిలాల్లో డబ్బు కోసం, వస్తువుల కోసం వెతకలేదు. ముందుగా తన చిలుక బ్రెండాను వెదికాడు. తర్వాత రెండు పెంపుడు కుక్కలు డయానా, ఫ్లాన్ కనిపించాయా అని చూశాడు. చివరికి ఉర్సులా అనే నల్ల పిల్లిని వెతికిపట్టుకున్నాకే అతనికి మనశ్శాంతి కలిగింది. వాటిని పట్టుకుని పరుగులు తీస్తున్న ఆ జనాలతోపాటే కార్లస్ కూడా పరుగెత్తాడు. అందరి చేతుల్లో వారికి చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. కార్లస్ చేతుల్లో మాత్రం ఈ మూగ జీవాలు ఉన్నాయి. 'ఇవే నాకు అత్యంత విలువైనవి' అన్నాడు కార్లస్, తనను ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్‌తో. కొన్ని గంటల తరువాత బాధితుల కోసం సిద్ధం చేసిన ఓ పార్కుకు కార్లస్ చేరుకున్నాడు. ఆ రాత్రంతా ఆ ప్రజలకు కంటిమీద కునుకు లేదు. మరుసటి రోజు కార్లస్ అక్కడే ఉన్న ఓ చిన్న రాతిబండ మీద కూర్చుని ఉన్నాడు. అతని చేతుల్లో ఉర్సులా ఉంది. తన షర్టు జేబులో భద్రంగా బ్రెండా కూర్చొని ఉంది. పక్కనే డయానా, ఫ్లాన్ ఉన్నాయి. ఈ మొత్తం దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. టిక్‌టాక్‌లో లక్షా 20 వేల మందికి పైగా ఆ వీడియోను చూశారు. ఏదైనా సాయం కావాలా అని వారు అడిగినప్పుడు కార్లస్ ఇంకా కష్టాల్లో ఉన్నవారికోసం కదలాలని తన యూజర్లకు సందేశం పంపాడు.

ప్రభంజనంలా కదిలారు..
ప్రమాద బాధితులకు అత్యవసర సేవలను అందించేందుకు వెనిజులా అధికారులు సిద్ధమయ్యారు. దేశ విదేశాల ప్రజలు వస్తురూపేణా విరాళాలు అందించారు. వీటన్నింటికంటే ముందే.. వెనిజులా ప్రజలు ఎవరికి వారే ఆపన్నులను ఆదుకోవడానికి నలుదిక్కుల నుంచి కదిలివచ్చారు. సోషల్ మీడియాలో ఫ్రాన్సౌ పేరుతో పిలవబడే ఓ యువకుడు తన మోటారు సైకిల్ వేసుకుని ప్రమాద స్థలానికి బయల్దేరాడు. బాధితులకు సాయం చేసేందుకు వచ్చే వాలంటీర్లను తన మోటారు సైకిల్‌పై ప్రమాద స్థలానికి ఉచితంగా చేరవేయాలన్నది ఆ యువకుడి లక్ష్యం. ఆ సమయంలో వెనిజులా రహదారులు పెద్ద పెద్ద వాహనాలతో నిండిపోయాయి. వాటినిండా నీళ్లు, పరుపులు, ఆహారం, ఔషధాలు ఉన్నాయి. అవన్నీ ప్రజలు స్వయంగా పంపినవి. లాగ్వేరాకు వచ్చే ఈ వాహనాలతో రోడ్లపై సాధారణ రాకపోకలు స్తంభించిపోయాయి. ఆ స్థాయిలో అక్కడి ప్రజలు బాధితులను అండగా నిలబడ్డారు.
మోటారు వాహనాలు ఒక్క అడుగు కూడా ముందుకు కదిలే పరిస్థితి లేదు. అప్పుడు కైడ్రిస్ తన వాహనం నుంచి దిగిపోయి కాలినడకన తన ప్రయాణం కొనసాగించింది. ఆమె ఒక డ్యాన్సర్. ఆ రోజు తన ప్రదర్శనలన్నీ రద్దు చేసుకుంది. బాధితులకు సాయం చేసేందుకు వాలంటీరుగా అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో ప్రశ్నించిన ఓ రిపోర్టర్‌తో ఆమె ఇలా అంది. 'శిథిలాల కింద నుంచి వస్తున్న ఆ అరుపులు ఇంకా సాయం చేసే వారి కోసం ఎదురుచూస్తున్నాయి. అందుకే నేను వెళ్తున్నా.'
‘సునామీ’ ప్రత్యేకం!
అత్యవసర సేవలు అందించిన వెనిజులా ప్రజానీకంలో పైన చెప్పుకున్న వారు కొంతమందే. అయితే ఈ సేవల్లో కీలకంగా పనిచేసిన 'సునామీ' గురించి కూడా చెప్పుకోకపోతే ఇది పరిపూర్ణం కాదు. 'సునామీ' మనిషి కాదు. శునకం. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని 300 మందికి పైగా ప్రజలను కాపాడింది. తన వయసు 9 ఏళ్లు. వీధిలో తిరిగే తనను చాలా ఏళ్ల క్రితం కొంతమంది రక్షించి రెస్క్యూ వాళ్లకు అప్పగించారు. దానికి ఇచ్చిన ఓ అవకాశం ఇప్పుడు వందల మంది ప్రాణాలను రక్షించడానికి తోడ్పడింది. సునామీతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్క రెస్క్యూ డాగ్ శిథిలాల మధ్య తిరుగుతూ చేసిన ఒక్కో అరుపు, ఒక్కో సంకేతంలా పనిచేసింది. రాళ్లపై గోళ్లతో అవి చేసిన ప్రతి సంజ్ఞ బాధితుల ప్రాణాలను మరణం నుంచి రక్షించింది.
చాలా విషాదాల్లో మరణాలు, గాయాలు, కుప్పకూలిన భవనాల సంఖ్యను లెక్కిస్తారు. అధికారిక లెక్కల్లో అరుదుగా కనిపించే మరో గణాంకం కూడా అక్కడి మనుషుల స్పందనే. కష్టాల్లో ఉన్నవారికి బాసటగా తోటి ప్రజలే కదులుతారు. తమ సమయాన్ని, శ్రమను అందిస్తారు. వెనిజులాలో ఇప్పుడు ఇలాంటి దృశ్యమే కనిపిస్తోంది.







కామెంట్‌లు (0)