సాధారణ ఇంధనం కన్నా వ్యయమెక్కువ
ప్రస్తుత వినియోగం 0.04 శాతమే
కాకినాడకు అనుమతితో విస్తృత చర్చ
ప్రజాశక్తి - ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : సుస్థిర విమాన ఇంధన వినియోగంపై ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. విమానాల్లో ఇప్పుడు ఉపయోగిస్తున్న సాధారణ ఇంధనానికి బదులుగా భవిషత్తులో వ్యర్థాల నుంచి తయారు చేసే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ (సాఫ్) వినియోగించాలని భావిస్తున్నారు. తాజాగా కాకినాడలో ఈ ఇంధన తయారీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతోపాటు 45 ఎకరాల భూమిని కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఈ తరహా ఇంధన వినియోగం, దాని లాభనష్టాలపై చర్చ కూడా ప్రారంభమైంది. సుస్థిర విమాన ఇంధనం అన్నది సాధారణ ఇంధనాలకు పునరుత్పాదక ప్రత్యామ్నాయంగా భావిస్తారు. ఈ ఇంధనాన్ని అప్పటికే వినియోగించిన వంట నూనె, జంతువుల కొవ్వు వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు, గాలి నుండి సేకరించిన కార్బన్ వంటి వాటి ద్వారా తయారు చేస్తారు. ఈ ఇంధనాన్ని సంప్రదాయ జెట్ ఇంధనంతో కలిపి ఇంజిన్‌లకు ఉపయోగిస్తారు.
ప్రపంచంలో కొన్నిచోట్ల ఇప్పటికే ఈ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇంధన వినియోగంలో సాఫ్ వాటా కేవలం 0.4 శాతంగా ఉండడం విశేషం. సాధారణ ఇంధనం కన్నా సుస్థిర విమాన ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని వారంటున్నారు.
వ్యయ భారమే సమస్య...
సాఫ్‌ను విస్తృతంగా ఉపయోగించకపోవడానికి దాని అధిక ధరే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అలాగే ఇది ఎక్కువగా ఉత్పత్తి కాకపోడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. సాఫ్ ఇంధనం సాధారణ జెట్ ఇంధనం కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ఖరీదైనదిగా చెబుతున్నారు. విమానయాన సంస్థలకు ఇంధనమే అతిపెద్ద వ్యయము కావడం వల్ల కూడా సాఫ్ వినియోగంపై సంస్థలు వెనుకంజ వేస్తున్నట్టు భావిస్తున్నారు.
ప్రయాణికులపై భారం కూడా...
సుస్థిర విమాన ఇంధనం వాడడం వల్ల నిర్వహణ ఖర్చులు పెరుగుతాయని, దీనివల్ల టికెట్ ధరలు కూడా గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంటుందని భావిస్తున్నారు. టికెట్ ధరల నియంత్రణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో లేకపోవడంతో ప్రైవేట్ విమానయాన సంస్థలు ఇష్టానుసారంగా ధరలను పెంచుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.







కామెంట్‌లు (0)