జూన్ 13న, కర్ణాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆర్.ఎస్.ఎస్ అధినేత మోహన్ భగవత్‌కు ఒక లేఖ రాశారు. అందులో ఆ సంస్థ 'చట్టపరమైన హోదా, నమోదు వివరాలు, కార్యవర్గ సభ్యులు, నిధులు, ఖర్చులు, పన్నుల చెల్లింపు, బహిరంగ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన అనుమతుల' గురించి వెల్లడించాలని కోరారు. దీనికి రెండు విచిత్రమైన స్పందనలు వచ్చాయి. అందులో ఒకటి స్వయంగా భగవత్ నుండే వచ్చింది. ఆ లేఖకు స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నప్పటికీ, 'హిందూ ధర్మం నమోదు చేయబడలేదు. అనేక విషయాలు రిజిస్ట్రేషన్ చేయబడవు', అయినా సంఘ్ ఉనికిలో ఉందనే విషయం ప్రభుత్వానికి తెలుసని ఆయన ప్రకటించారు. ప్రభుత్వం నుండి నిధులు ఆశించే సంస్థలకే రిజిస్ట్రేషన్ అవసరమని చెప్పడం ద్వారా ఆయన విషయాన్ని పక్కదారి పట్టించే యత్నం చేశారు. భగవత్ దష్టిలో ఆర్.ఎస్.ఎస్ అంటే హిందూ సమాజమే, అలాగే హిందువులకు తమ సంస్థే ఏకైక ప్రతినిధి అని ఆయన భావిస్తారు. కానీ, సంస్థ ఆదాయ-వ్యయ వివరాలు, చట్టపరమైన హోదా లేదా దాని పని తీరును వెల్లడించడానికి ఈ భావనకు సంబంధం ఏమిటి?
దీని గురించి మనం తర్వాత మరింత వివరంగా చర్చించుకుందాం, కానీ ముందుగా కర్ణాటక లోని బిజాపూర్ నుండి ఏడుసార్లు బిజెపి ఎంపీగా ఎన్నికైన రమేష్ చందప్ప జిగాజినగి నుండి వచ్చిన మరో విచిత్రమైన స్పందనను పరిశీలిద్దాం. ఒక కార్యక్రమంలో విలేకరులు ఖర్గే లేఖ గురించి అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు: 'ఒక దళిత వ్యక్తికి ఆర్.ఎస్.ఎస్ తో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నా ప్రశ్న అదే సోదరా. ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఉంటే చాలు కదా...'. ఖర్గే దళితుడు, జిగాజినగి కూడా దళితుడే. దీనిపై వివరణ అడిగినప్పుడు జిగాజినగి ఇలా అన్నారు: 'నేను చెప్పేది వినండి. కాంగ్రెస్ పార్టీలో ఆయన (ఖర్గే) తండ్రి కష్టపడి పనిచేశారు కాబట్టి, పార్టీ ఆయనకు తగిన ఏర్పాట్లు చేసింది. ప్రజల కోసం పనిచేసి ఆయన మంచి పేరు సంపాదించుకోవాలి. ఆర్.ఎస్.ఎస్ తో గొడవ పెట్టుకునే ఎవరూ నిలబడలేరు.'' ''ధన్యవాదాలు.''
జిగజినిగి గతంలో ఆర్.ఎస్.ఎస్/బిజెపి ల వైఖరి దళిత వ్యతిరేకమని విమర్శించినట్లు సమాచారం. తాను దళితుడైనందున ఆర్.ఎస్.ఎస్/బిజెపి లతో తలపడటం వల్ల హానికరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే వాటిని ఎదిరించవద్దని జిగజినగి ఖర్గేను హెచ్చరించినట్లు స్పష్టమవుతోంది. ఖర్గే రాసిన లేఖ ఆర్.ఎస్.ఎస్/బిజెపి ల అంతర్గత విభేదాలను ఊహించని విధంగా బయటపెట్టింది. దీనిని ఒక అనుభవజ్ఞుడైన బిజెపి నాయకుడు కూడా ధ్రువీకరించారు.
ఆర్.ఎస్.ఎస్ అంతర్గత కార్యకలాపాలు, దాని నిధుల వనరులు, అసలు లక్ష్యాల గురించి ప్రశ్నలు తలెత్తడం కొత్తేమీ కాదు. మహాత్మా గాంధీ హత్య జరిగినప్పటి నుంచే, ప్రజలు, ప్రభుత్వాలు దీనిని ఒక అస్పష్టమైన, రహస్య సంస్థగా గుర్తించాయి. దీనికి కారణాలు: పాక్షిక-సైనిక (పారా-మిలిటరీ) తరహా కవాతులు; కవాతు ప్రదర్శనలు, ఎన్నికల ద్వారా కాకుండా, సాధారణంగా పదవీ విరమణ చేసే అధిపతి (సర్ సంఘచాలక్) నామినేట్ చేసే వ్యక్తి నాయకత్వాన్ని చేపట్టే విధానం, హింసతో సహా అనేక రకాల హిందూ మతోన్మాద కార్యకలాపాల్లో తెర వెనుక పాత్ర పోషించడం.
1978లో సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సి.బి.డి.టి) జారీ చేసిన ఆదేశాల మేరకు దీనికి ఆదాయపు పన్ను నుండి మినహాయింపు లభించింది. దీనిని సవాల్ చేస్తూ బొంబాయి, పాట్నాలలో ఆదాయపు పన్ను ట్రిబ్యునళ్ల ముందుకు అనేక కేసులొచ్చాయి. ఆర్.ఎస్.ఎస్ పై ఆదాయపు పన్ను చెల్లింపు బాధ్యతను మోపడానికి నిరాకరించాయి. దీనికి సంబంధించి ఆర్.ఎస్.ఎస్ విచిత్రమైన వాదన చేసింది. తమ నిధులు 'గురు దక్షిణ' (గురువుకు సమర్పించే కానుక) అని, పరస్పర సహకార సూత్రం ప్రకారం అవి పన్ను పరిధిలోకి రావని బుకాయించింది.
అయితే, ప్రధాన స్రవంతికి ఆర్.ఎస్.ఎస్ దూరంగా ఉన్న ఆ నాటి పరిస్థితులు ఇప్పుడు మారిపోయాయి. అవి ఎలా మారాయో చూద్దాం.
రాజకీయాలకు అతీతమైన సాంస్కృతిక సంస్థనా?
ఆర్.ఎస్.ఎస్ గురించి అత్యంత విస్తృతంగా ప్రచారంలో ఉన్న అపోహలలో ఒకటి-అది రాజకీయాలకు అతీతమైన ఒక సాంస్కృతిక సంస్థ అనేది. మహాత్మా గాంధీ హత్యతో ప్రమేయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఆర్.ఎస్.ఎస్ పై నిషేధం విధించిన తర్వాత, సర్దార్ పటేల్ పట్టుబట్టడం వల్ల ఆమోదించబడిన ఆర్.ఎస్.ఎస్ రాజ్యాంగం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. ఆర్.ఎస్.ఎస్ నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చు, కానీ రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదు. రాజకీయ లక్ష్యాలు, ఆశయాలను అంతర్లీనంగా కలిగి ఉన్న ఒక భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఆర్.ఎస్.ఎస్, దాని అనేక అనుబంధ సంస్థలు వివిధ రకాల కార్యకలాపాలు చేపడతాయి. మనుస్మృతి వంటి హిందూ మత గ్రంథాల (తిరోగమన భావనలతో కూడినవి) ఆధారంగా పాలించబడే 'హిందూ రాష్ట్రాన్ని' నిర్మించాలని ఆరెస్సెస్ కోరుకుంటోంది. బ్రాహ్మణీయ సూత్రాలపై ఆధారపడిన హిందూత్వ సంకుచిత, ప్రతీకారపూరిత వ్యాఖ్యానాన్ని అంగీకరించేందుకు నిరాకరించినవారిపై అది విషం గక్కుతుంది. ముఖ్యంగా, ఇస్లాం, క్రైస్తవ మతాల పట్ల శత్రుత్వాన్ని, విద్వేష భావాలను ప్రచారం చేస్తుంది (అయితే తరచూ దీనిని పరోక్ష భాషలో వ్యక్తం చేస్తుంది). ఇవి, ఇలాంటి అనేక ఇతర భావనలను అది ఏ మార్గాల ద్వారా సాకారం చేయాలనుకుంటోంది? ప్రజలలో 'శీల నిర్మాణం' (క్యారెక్టర్ బిల్డింగ్) ద్వారా అని ఆర్.ఎస్.ఎస్ పేర్కొంటుంది. కానీ అది ఒక శతాబ్ద కాలంగా ఆ పని చేస్తూనే ఉన్నప్పటికీ, చెప్పుకోదగ్గ ఫలితాలు కనిపించలేదు. చెప్పబడని మరో మార్గం రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడం. రాజకీయ రంగంలో తన కార్యకలాపాలను నిర్వహించడానికి మొదట 1950లో 'భారతీయ జనసంఘ్'ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత, 1980లో జనసంఘ్ 'బిజెపి'గా రూపాంతరం చెందింది. ఈ బహిరంగ రాజకీయ సాధనాలతో పాటు, రాజకీయ అధికారాన్ని సాధించడానికి మతాన్ని ఒక ఆయుధంగా మార్చుకుంది. ఇందుకోసం వివిధ రకాల మతోన్మాద, కుహనా జాతీయవాద నినాదాలను లేదా అంశాలను ఉపయోగించుకుంది.
మోడీ అధికారంలోకి రావడంతో, ఆర్.ఎస్.ఎస్ పని పరిస్థితులలో ఒక గుణాత్మక మార్పు వచ్చింది. దాని ప్రచారకులు (ప్రధాన పూర్తికాల కార్యకర్తలు), అంకితభావం కలిగిన సభ్యులు అత్యున్నత పదవులను అధిష్టించారు. స్వయంగా ప్రధానమంత్రే ఒక ప్రచారక్, ఆయన మంత్రివర్గ సహచరుల్లో డజన్ల కొద్దీ సభ్యులు ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవారే. బిజెపి పాలనలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ, ఆర్.ఎస్.ఎస్ ఎంపిక చేసిన కార్యకర్తలే ముఖ్యమంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
ఆర్థిక, విద్యా తదితర విభాగాల (సమూహాల) ద్వారా ప్రభుత్వంతో సమన్వయం కోసం ఆర్.ఎస్.ఎస్ ప్రత్యేక యంత్రాంగాలను ఏర్పాటు చేసుకుంది. అనుబంధ సంస్థలలో పనిచేయడానికి నియమించబడిన ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ విధానాలకు సంబంధించి సలహాలు ఇవ్వడంలో, మార్గనిర్దేశం చేయడంలో, వాటిని అమలు చేయడంలో చురుకుగా పాల్గొంటున్నారు.
దీనికి ప్రతిఫలంగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంస్థల కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయి. ఈ అంశాల గురించి 'పీపుల్స్ డెమోక్రసీ' లోని గత వ్యాసాలలో చర్చించడం జరిగింది. తాము రాజకీయాలకు అతీతమని ఆర్.ఎస్.ఎస్ చెప్పుకోవడం ఒక అబద్ధం, ఆ వాదనకు కాలం చెల్లిపోయింది. ఒకవేళ అది బహిరంగ రాజకీయ వ్యవహారాల్లో భాగమైతే, దాని అంతర్గత పనితీరు, ప్రజాస్వామ్య ప్రక్రియలు, భారీ మొత్తంలో నిధుల సేకరణ, ఖర్చులు, అలాగే అది భారత రాజ్యాంగం, దేశ చట్టాలకు అనుగుణంగా పని చేస్తోందా లేదా అనే విషయాలపై సమీక్ష ఎందుకు జరగకూడదు?
వివిధ వ్యవస్థల్లోకి చొరబాటు
ఆర్.ఎస్.ఎస్ కార్యకలాపాలకు సంబంధించి అంతగా చర్చకురాని ఒక అంశం ఏమిటంటే, ప్రభుత్వ, సామాజిక వ్యవస్థలన్నిటిలోనూ, ఆ సంస్థ క్రమంగా, రహస్యంగా తన పట్టును పెంచుకోవడం. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్.ఎస్.ఎస్ లో సభ్యులుగా ఉండటంపై ఉన్న నిషేధాన్ని మోడీ ప్రభుత్వం తొలగించింది. దాంతో, ఇప్పుడు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు బహిరంగంగానే ఆ సంస్థతో తమ అనుబంధాన్ని వెల్లడిస్తున్నారు. అయితే, కేవలం వీళ్లు మాత్రమే కాదు; న్యాయాధికారుల నుండి విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ల వరకు, పారిశ్రామిక దిగ్గజాల నుండి సాయుధ దళాల వరకు అనేకమంది తాము చాలా కాలంగా ఆర్.ఎస్.ఎస్ సభ్యులుగా లేదా మద్దతుదారులుగా ఉన్నామని చెప్పుకుంటున్నారు. మరికొందరు బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ, వారి చర్యలు, వ్యాఖ్యలు వారిని ఆ కోవ కిందికే తెస్తాయి.
మోడీ హయాంలో ఈ ప్రక్రియ మరింత దూకుడుగా సాగుతోంది. దాదాపు ప్రతి ప్రభుత్వ సంస్థ లేదా ఇతర వ్యవస్థ ఇప్పుడు ఆర్.ఎస్.ఎస్ సభ్యులతో నిండిపోతోంది. వీరంతా కలిసి ప్రజల ఆలోచనా విధానాన్ని మలచడంలోనూ, విధాన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఊహించలేనంతటి అధికారాన్ని, ప్రభావాన్ని కలిగి ఉన్నారు. ప్రస్తుతం వారు ఆర్.ఎస్.ఎస్ భావజాలాన్ని విస్తరించడంలోనూ, దాని రాజకీయ శక్తిని బలోపేతం చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఆర్.ఎస్.ఎస్ నడుపుతున్న సంస్థలు వేలాది పాఠశాలలు, కళాశాలలను (సాయుధ దళాల్లో ప్రవేశానికి శిక్షణ ఇచ్చే సైనిక్ పాఠశాలలతో సహా) నడుపుతున్నాయి. లక్షలాది మందికి చేరే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసే సామాజిక సేవా సంస్థలను అవి నడుపుతున్నాయి.
దేవాలయాలు, తీర్థయాత్రల వంటి ఇతర మతపరమైన కార్యకలాపాలను నిర్వహించే బాధ్యత గల మతపరమైన ట్రస్టులను అవి నియంత్రిస్తున్నాయి. వీటన్నిటిని నియంత్రిస్తున్న సంస్థ తప్పనిసరిగా బహిరంగ పరిశీలనకు గురికావాలి, జవాబుదారీతనం, పారదర్శకత కోసం దానిని పరీక్షించాలి. అయోధ్యలోని రామ మందిరంలో ప్రతి రోజూ భక్తులు సమర్పించే కరెన్సీ, ఇతర విలువైన లోహ కానుకలను లెక్కించే పనిలో ఉన్న వ్యక్తులు రూ.200 కోట్ల మేర స్వాహా చేశారు. ఇదో పెద్ద కుంభకోణం. యాదృచ్ఛికంగా, ఆ మందిరాన్ని నిర్వహించే ట్రస్ట్ సంఘ్ పరివార్‌కు చెందిన వ్యక్తులతో నిండిపోయి ఉంది. అందుకే ఈ వార్త రాసే సమయానికి ఈ కేసులో ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదయిన దాఖలాలు లేవు.
ప్రజల అప్రమత్తత అవసరం
చివరికి, గతంలో జరిగిన ఇతర యత్నాల మాదిరిగానే ఖర్గే లేఖను కూడా ఆర్.ఎస్.ఎస్ విస్మరించే అవకాశం ఉంది. భారతదేశాన్ని రహస్యంగా తమ గుప్పెట్లోకి తెచ్చుకోవడానికి ఆర్.ఎస్.ఎస్ చేస్తున్న యత్నాలను అడ్డుకునే అసలైన రక్షణ కవచం ప్రజల అప్రమత్తత, వారి ఒత్తిడే. ఆర్.ఎస్.ఎస్ ను ఒక 'డీప్ స్టేట్' (అధికారిక వ్యవస్థకు సమాంతరంగా తెరవెనుక ఉండి పనిచేసే శక్తి)గా అభివర్ణిస్తుంటారు; ఇది తెర వెనుక ఉంటూ దేశాన్ని, నాయకులను కీలుబొమ్మల్లా ఆడిస్తుంటుంది. మధ్యయుగాల నాటి భావజాలంతో కూడిన 'హిందూ రాష్ట్ర' కోసం ప్రజల నుంచి ఆమోదాన్ని కోరే ధైర్యం దానికి ఇంకా లేదు. సరైన సమయం కోసం వేచి చూస్తూ, అది బిజెపి వంటి సంస్థల ముసుగులో దాక్కుంటుంది. దాని కార్యకలాపాలు, అనుబంధ సంస్థలు, అలాగే ప్రభుత్వ, సామాజిక జీవనంలో అవి చొరబడుతున్న తీరుపై వెలుగు ప్రసరింపజేయకపోతే, దాని ప్రభావం మరింత విస్తరిస్తూనే ఉంటుంది.







కామెంట్‌లు (0)