గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅధ్యాపకుల కొరత!

2 గంటల క్రితం

iiit
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 05:45 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

మన దేశ అత్యున్నత సాంకేతిక విద్యాసంస్థలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటిలు)ల్లో దాదాపు నలభై శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళనకరం. 'విశ్వగురు', 'ఆత్మనిర్భర్ భారత్', 'ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ' వంటి నినాదాలు నిరంతరం వల్లె వేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ వెలితి పట్టకపోవడం శోచనీయం. సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ కంప్యూటింగ్, అంతరిక్ష పరిశోధన, రక్షణ సాంకేతికత వంటి రంగాల్లో ప్రపంచ నాయకత్వం వహించాలని ఘనంగా ప్రకటించడంతోనే సరిపోతుందా? ఆ లక్ష్యాలన్నింటికీ పునాదిగా నిలవాల్సిన ఐఐటిలు అధ్యాపకుల కొరతతో, పరిశోధన వనరుల కొరతతో ఇబ్బందులు పడుతుంటే నినాదాల వల్ల ప్రయోజనం ఏమిటి?

స్వాతంత్య్రానంతరం దేశ నిర్మాణంలో విజ్ఞానానికే ప్రధాన ప్రాధాన్యం ఇవ్వాలన్న దూరదృష్టితో అప్పటి పాలకులు ఐఐటిల స్థాపనకు శ్రీకారం చుట్టారు. అవి కేవలం డిగ్రీలు ఇచ్చే విద్యాసంస్థలు కాదు; దేశ శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధికి పునాదులు. నేడు దేశంలో 23 ఐఐటిలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత మేధస్సుకు ప్రతీకగా నిలిచిన చరిత్ర వాటిది. అలాంటి ప్రతిష్ఠాత్మక వ్యవస్థ బలహీనపడుతోందని చెప్పడానికి ఏళ్ల తరబడి కొనసాగుతున్న అధ్యాపకుల కొరతే పెద్ద నిదర్శనం. అధికారిక గణాంకాల ప్రకారం 23 ఐఐటిల్లో మొత్తం 12,198 అధ్యాపక పోస్టులు ఉండగా, 7,558 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 4,640 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే 38.04 శాతం పోస్టులు భర్తీ కాలేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థ, అందునా అత్యున్నత శాస్త్ర, సాంకేతిక విద్యాసంస్థల నిర్వహణను నీరుగార్చి, ప్రైవేటు విద్యాసంస్థలకు, విదేశీ విశ్వవిద్యాలయాలకు, డీమ్డ్ యూనివర్సిటీలకు మేలు చేకూర్చే దుర్బుద్ధితోనే కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తుందన్న విమర్శ సత్యదూరం కాదు.

ఐఐటిలో అధ్యాపకులుగా నియామకం కావాలంటే - పిహెచ్ డితో పాటు అంతర్జాతీయ స్థాయి పరిశోధన, ప్రతిష్ఠాత్మక జర్నళ్లలో ప్రచురణలు, పోస్ట్‌డాక్టోరల్ అనుభవం వంటి అర్హతలు ఉండాలి. అలాంటి ప్రతిభావంతులైన పరిశోధకులకు విదేశీ విశ్వవిద్యాలయాలు, ప్రపంచస్థాయి పరిశోధనా సంస్థలు మరింత ఆకర్షణీయమైన అవకాశాలను కల్పిస్తున్నాయి. దేశంలో పరిశోధన నిధులు, ఆధునిక ప్రయోగశాలలు, దీర్ఘకాలిక పరిశోధనకు అవసరమైన వాతావరణం తగినంత లేకపోవటం వల్ల ఐఐటిల్లోనే పిహెచ్ డి చేసిన యువ శాస్త్రవేత్తలు కూడా విదేశాలకు వెళ్లిపోతున్నారు. ఈ మేధో వలసను అరికట్టకుండా అధ్యాపకుల కొరత సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకదు. ప్రపంచస్థాయి సాంకేతిక విద్యకు ఒక అధ్యాపకుడికి పది మంది విద్యార్థులు ఉండే నిష్పత్తిని ఆదర్శంగా పరిగణిస్తారు. కానీ ప్రస్తుతం అనేక ఐఐటిల్లో అది 1:16 నుంచి 1:18 వరకు ఉంది. అంటే ఒక అధ్యాపకుడు దాదాపు రెట్టింపు విద్యార్థులకు బోధించడమే కాకుండా, పరిశోధన, పిహెచ్ డి విద్యార్థుల పర్యవేక్షణ, పరిశ్రమలతో భాగస్వామ్యాలు, పరిపాలనా బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తోంది. అయినప్పటికీ ఐఐటిల్లో ఏటా 35 వేల నుంచి 40 వేల మంది విద్యార్థులు పట్టభద్రులవుతున్నారు. పాత ఐఐటిల్లో ప్లేస్‌మెంట్లు 80 నుంచి 95 శాతం వరకు ఉంటున్నాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా అవి గౌరవప్రదమైన స్థానాలను నిలబెట్టుకున్నాయి. ఈ విజయాల వెనుక ఉన్న అధ్యాపకులు మోస్తున్న అదనపు భారం ఎంత పెద్దదో ఈ గణాంకాలే తెలియజేస్తున్నాయి.

1990ల తర్వాత అమలైన నయా ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావం ఉన్నత విద్యపై పడింది. స్వయం సమృద్ధి పేరుతో విద్యాసంస్థలు తమ వనరులు తామే సమకూర్చుకోవాలనే ఒత్తిడి పెరిగింది. పరిశోధనను దీర్ఘకాలిక పెట్టుబడిగా కాకుండా తక్షణ ఫలితాల కోణంలో చూడడం ప్రారంభమైంది. కొత్త ఐఐటిలను ప్రారంభించినా, వాటిని నడిపించే శాశ్వత అధ్యాపక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాలకులకు చిత్తశుద్ధి లేదు. కాంట్రాక్టు, విజిటింగ్ అధ్యాపకులతో కాలం నెట్టేసే ధోరణి దీర్ఘకాలిక ప్రయోజనాలకు, విద్యా ప్రమాణాలకు విఘాతం కలిగిస్తుంది. భారతదేశం ప్రపంచ మేధోశక్తిగా ఎదగాలంటే ముందుగా తన మేధో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయాలి. శాశ్వత అధ్యాపక నియామకాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. పరిశోధనలకు నిధులు గణనీయంగా పెంచాలి. యువ శాస్త్రవేత్తలకు ప్రపంచస్థాయి పరిశోధన వాతావరణాన్ని కల్పించాలి. ఐఐటిల్లో కాంట్రాక్టు, విజిటింగ్, అడ్జంక్ట్ అధ్యాపకులపై పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయాలి. జవాబుదారీతనం, పారదర్శకత, దీర్ఘకాలిక విద్యా ప్రణాళిక లేకుండా ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలను నిర్మించడం సాధ్యం కాదు. నినాదాలతో కాదు, నిధులతో; ప్రచారంతో కాదు, పరిశోధనలతో; తాత్కాలిక నియామకాలతో కాదు, శాశ్వత అధ్యాపక వ్యవస్థతోనే ప్రపంచస్థాయి విద్యాసంస్థలు నిర్మితమవుతాయి. జ్ఞానాన్ని సృష్టించే సంస్థలను బలోపేతం చేయడమే నిజమైన దేశ నిర్మాణం. పాలకులు ఆ దిశగా సత్వర చర్యలు తీసుకోవటం చాలా అవసరం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్