గురువారం, 02 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

డేటా సెంటర్లపై *సందేహాలకు సమాధానమేది?

1 గంట క్రితం

WhatsApp Image
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 02, 2026, 06:45 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

డేటా సెంటర్‌ కథనం 6

  • ప్రజాభిప్రాయాన్ని బుల్‌‌డోజ్‌ ‌చేయడమే ‘కూటమి’ విధానమా?

  • సోషల్‌ ‌మీడియాలో హ్యూమన్‌‌రైట్స్‌, ఇన్‌‌ఫ్లుయన్సియర్ల పోస్టులు తొలగింపు

ప్రజాశక్తి - గ్రేటర్‌ ‌విశాఖ బ్యూరో : విశాఖపట్నం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కూటమి ప్రభుత్వం ప్రజలకు డేటా సెంటర్లపై శాస్ర్తీయమైన రీతిలో ‘డేటా’ (నీరు, విద్యుత్‌, పర్యావరణం, ఉద్యోగాల) వివరాలను ఇవ్వకుండా బుల్‌‌డోజ్‌ ‌చేసే యత్నాల్లో నిమగ్నమైంది. ‌ప్రజల చేతిలో ప్రభుత్వ అధికారిక డాక్యుమెంట్‌ ‌లేకుండా పౌరుల్లో చర్చ జరకుండా చేయడం ద్వారా ప్రభుత్వం నేల విడచి సాము చేస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా డేటా సెంటర్లలో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిస్తున్నామనే నెపంతో రాష్ర్ట ప్రభుత్వం స్థానిక ప్రజా వనరులను కొల్లగొట్టి కార్పొరేట్లకు కట్టబెట్టే విధానం కనిపిస్తుంది మినహా రాష్ట్రానికి, విశాఖకు వచ్చే లాభం ఏమిటంటే శూన్యమనే చెప్పక తప్పదు. గడచిన ఐదు రోజులుగా ప్రజాశక్తి ప్రతికలో ఈ డేటా సెంటర్ల పెట్టుబడి, భూములు, నీటి వినియోగం, విద్యుత్‌, పర్యావరణ ప్రభావాలపై వివరణాత్మక కథనాలు ప్రచురించడం జరిగింది. ఇదివరకటి నుంచే విశాఖ పౌరసమాజం అనేక ప్రశ్నలు, సందేహాలను కోరుతున్నా చంద్రబాబు సర్కారు స్పందించకుండా డేటా సెంటర్లపై ముందుకెళ్లే యత్నాల్లో నిమగ్నమైంది.

​డేటా సెంటర్లపై వీడియోలు కాదు... డాక్యుమెంట్లు కావాలి

​ డేటా సెంటర్లు ఎంత నీటిని వినియోగిస్తాయి? ఎంత విద్యుత్‌ ‌కావాలి? కాలుష్యం ఒక గిగావాట్‌ ‌డేటా సెంటర్‌‌ కు ఎంత విడుదలైతే దాన్ని ఎలా పర్యావరణంపై ప్రభావం పడకుండా చూస్తారు? ప్రజా వనరులైన భూమి ఎంత అనేది వీడియోల ద్వారా కాకుండా ప్రభుత్వం ఇంతవరకే ఎలాంటి నివేదిక (డాక్యుమెంట్‌)‌ను ప్రజల ముందు ఉంచకుండా తాత్సారం చేస్తోంది. ఎందుకంటే ఏడాదిలో 365 రోజులూ వేలాది సర్వర్‌ ‌రాక్‌‌లూ, డిజిటల్‌ ‌డేటాను భద్రపరిచే హార్డ్‌ ‌డ్రైవ్‌‌లు, నెట్‌‌వర్కింగ్‌ ‌పరికరాలు, జిపియు, లక్షల సంఖ్యలో యూపిఎస్‌‌లు పనిచేస్తుండడం వల్ల వాటిని చల్లబరచడానికి నిరంతరాయంగా నీరు అవసరమవుతుంది. డేటా సెంటర్లకు కావాల్సిన అధిక నీరు, విద్యుత్‌ ‌వంటి అంశాలపై విశాఖకు చెందిన మాజీ ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌ ‌శర్మ ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నిస్తూ లేవనెత్తిన సందేహాలకు ఇంతవరకూ ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. విశాఖకు చెందిన పౌరసమాజం ఈ డేటా సెంటర్లు ప్రజలకు ఎంత నష్టమో తెలియజేసే డాక్యుమెంట్లను హ్యుమన్‌ ‌రైట్స్‌ ‌కమిషన్‌, సోషల్‌ ‌మీడియా ఇన్‌‌ఫ్లుయన్సియర్లు ‌పోస్టులు పెట్టగా రాష్ర్ట ప్రభుత్వం వీటిని వెంటనే తొలగించేసింది. ప్రభుత్వంలో ఉన్న వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే కార్పొరేట్లకు వనరులను కట్టబెట్టే డేటా సెంటర్ల వెంట పరుగులు పెడుతున్నారు తప్ప వాతావరణంలో వచ్చే తీవ్ర మార్పులతో రాబోయే కాలంలో వచ్చే ప్రజా అవసరాలను పరిగణలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు సత్యదూరంకాదు.

​డేటా సెంటర్లపై ప్రజల్లో అవగాహన

​ డేటా సెంటర్ల రాకతోనే వాటిపై అవగాహన కూడా ప్రజల్లో పెరుగుతోంది. వాటివల్ల దుష్పరిణామాలు ఉంటాయని పౌరులు భావిస్తున్నారు. డేటా సెంటర్లతో ఎఐ ఆధారిత సెర్చ్‌‌లు పెరిగి అధిక విద్యుత్‌ ‌తీసుకుంటాయన్నది మేధావులు అభిప్రాయం. ఇటీవలే యుఎన్‌ఒకు చెందిన యూనివర్శిటీ అధ్యయన నివేదిక డేటా సెంటర్లను చల్లబర్చడానికి బిలియన్ల కొద్దీ లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు ఆవిరైపోతే ప్రజల పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నా రాష్ర్ట పాలకులకు ఇవేమీ పట్టడం లేదు. సముద్ర కేబుల్‌ ‌కనెక్షన్‌‌ల ద్వారా విశాఖ అంతర్జాతీయ స్థాయిలో కీలకమైన డిజిటల్‌ ‌గేట్‌ ‌వేగా మారబోతుందని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. డేటా సెంటర్‌ అనేది వ్యాపారాలకు అత్యంత ఆవశ్యమైన ఐటి అప్లికేషన్‌‌లు డిజిటల్‌ ‌డేటాను సురక్షితంగా నిల్వ చేయడానికి ప్రాసెస్‌ ‌చేసి పంపిణీ చేయడానికి ఉపయోగించే స్టోరేజీగా ఉంటాయి. డేటా సెంటర్ల భారీ వేడిని తగ్గించడానికి ఎయిర్‌ ‌కండిషనింగ్‌ ‌లిక్విడ్‌ ‌కూలింగ్‌ ‌వ్యవస్థలు వీటికి నిరంతరాయంగా విద్యుత్‌ ‌సరఫరా, పవర్‌ ‌బ్యాకప్‌ ‌కోసం జనరేటర్లు అత్యంత అవసరమవుతాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్