- కీలక స్థావరాలపై అమెరికా వైమానిక దాడి
- ఇరాన్ లేకుండా చేస్తాం : ట్రంప్
- యుద్ధ నేరాలను విచారించాలి : ఖమేనీ
టెహ్రాన్ : పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా రెండో రోజు ఇరాన్‌పై దాడులను కొనసాగించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో, హర్మూజ్ జలసంధి సమీపంలోని ఖేష్మ్ ద్వీపంతో పాటు సిరిక్, బదర్ ఎ వంటి నగరాలను లక్ష్యంగా చేసుకుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన సైనిక నిఘా మౌలిక సదుపాయాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వాయు రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ గిడ్డంగులు, సముద్రంలో మైన్లు ఏర్పాటు చేసే సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఇరాన్ దక్షిణంలోని సిరిక్ నగర పరిసరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు ప్రభుత్వ మీడియా ఐఆర్ఐబి తెలిపింది. పలువురు ప్రత్యక్ష సాక్షుల సమాచారం ప్రకారం, అనేక క్షిపణులు ఒక టెలికమ్యూనికేషన్ టవర్‌ను తాకినట్లు వెల్లడైంది. అయితే అమెరికా దాడులకు ప్రతిగా కువైట్, బహ్రెయిన్ సహా పొరుగు దేశాలలోని అమెరికా సైనిక కేంద్రాలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తే ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియలన్నీ నిలిచిపోతాయని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు లెబనాన్‌లో కూడా ఇజ్రాయిల్, హిజ్బల్లా మధ్య పోరు కొనసాగుతోంది.
అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ నేరాలను విచారించాలి : ఖమేని
యుద్ధ నేరాలకు పాల్పడినందుకు అమెరికా-ఇజ్రాయెల్ నాయకులపై విచారణ జరపాలని ఇరాన్ సర్వోన్నత నాయకుడు మొజ్తాబా ఖమేనీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ జాతిని ప్రభావితం చేసిన అత్యంత ముఖ్యమైన విషయమని, అంతర్జాతీయ నేరగాళ్లు, ప్రపంచ అహంకార శక్తులు, దురాక్రమణదారులు అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రజలపై యుద్ధాన్ని రుద్దారని ఖమేనీ తెలిపారు. అత్యంత అమానవీయంగా హాస్పటల్స్‌పై, పసి పిల్లలు చదువుకుంటున్న మినాబ్ స్కూల్‌పై దాడిని ఆయన ప్రస్తావించారు. అలాగే తన తండ్రి అయతొల్లా అలీ ఖమేనీ హత్యను కూడా గుర్తుచేశారు. ఈ నేరాలను అంతర్జాతీయ న్యాయస్థానాలు విచారణ జరపాలని ఆయన కోరారు. ఈ నేరస్థుల మెడ పట్టుకుని, న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
సైనిక చర్య జరిపితే ఇరాన్ అనేదే ఉండదు : ట్రంప్
ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. తాజా దాడులతో తామే పైచేయి సాధించామని చెప్పారు. 'మేము ఇకపై సంయమనంతో వ్యవహరించే పరిస్థితి రాకపోవచ్చు. అప్పుడు మేము ఎంతో విజయవంతంగా ప్రారంభించిన పనిని సైనిక చర్య ద్వారా పూర్తి చేయాల్సిన అనివార్యత ఏర్పడవచ్చు' అని అన్నారు. ఒకవేళ అదే జరిగితే ఇరాన్ లేకుండా పోతుందన్నారు. ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ఈ మేరకు పోస్ట్ పెట్టిన గంట తర్వాత ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఎదుర్కొంటున్నాయని కువైట్ సైన్యం ప్రకటించింది.
హిజ్బుల్లాపై దాడులు చేయండి : సిరియాకు ట్రంప్ సూచన
ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న హిజ్బల్లాపై దాడులు చేయాలంటూ సిరియాను ట్రంప్ రెచ్చగొట్టారు.. లెబనాన్‌పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం విషయంలో అధ్యక్షభవనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్య చేశారు. సిరియా నియంతృత్వ అధ్యక్షుడు బషర్ అసద్‌ను పదవీచ్యుతుడిని చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తిరుగుబాటుదారులే హిజ్బల్లా భరతం పట్టగలరని, ఇజ్రాయిల్ సేనల కంటే వారు దృఢంగా పోరాడగలరని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరా మాత్రం తాము ఆ పని చేయబోమని తేల్చి చెప్పారు. కాగా ట్రంప్ ప్రకటన ఇజ్రాయిల్‌లో కూడా ఆందోళన రేపుతోంది.
హర్మూజ్‌లో అమెరికా జోక్యమే ఉద్రిక్తతలకు కారణం : అరాగ్చీ
అమెరికా దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్పష్టంగా ఉల్లంఘిస్తున్నాయని ఇరాన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. దౌత్య ప్రక్రియలన్నీ పూర్తిగా నిలిచిపోయాయని, అందుకే దాడులు జరుగుతున్నాయని ఐఆర్జిసి తెలిపింది. హర్మూజ్ సమీపంలో అమెరికా జరుపుతున్న దాడులకు స్పందనగా పొరుగు దేశాలలోని వాషింగ్టన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోందని వివరించింది. కీలక హర్మూజ్ జలసంధి నిర్వహణలో అమెరికా జోక్యం చేసుకోవడమే ప్రస్తుత ఉద్రిక్తతలకు కారణమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తెలిపారు. అవరోధాలు తొలగిపోతే ఇరాన్ నిర్వహణ కింద హర్మూజ్‌ను 30 రోజులలోనే యుద్ధానికి ముందున్న స్థితికి తీసుకొస్తామని చెప్పారు. లెబనాన్‌లో సహా అన్ని ప్రాంతాలలోనూ పోరు ఆగిపోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. లెబనాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడులను ఆపి కాల్పుల విరమణను అమలు చేయాల్సిన బాధ్యత అమెరికాదేనని అన్నారు. ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్ సేనలు వైదొలిగేలా చూడాల్సింది కూడా అమెరికాయేనని తెలిపారు. అయితే, తమపై ఇరాన్ జరుపుతున్న దాడులను బహ్రెయిన్, కువైట్ సహా ప్రాంతీయ దేశాలు ఖండించాయి.









కామెంట్లు (0)