న్యూఢిల్లీ : అయోధ్యలోని రామ మందిర విరాళాల్లో జరిగిన ఆర్థిక అవకతవకలు, గల్లంతైన నిధులపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు సోమవారం అత్యవసర విచారణకు తిరస్కరించింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ శీల్ నాగులతో కూడిన వెకేషన్ బెంచ్ పిటిషన్ విచారణ చేపట్టేందుకు నిరాకరించింది. వేసవి సెలవుల సమయంలో అత్యవసర విచారణ చేపట్టాలని కోరడం ఇది రెండవసారి కావడం గమనార్హం. రాబోయే రోజుల్లో సిసిటివి ఫుటేజీ వంటి ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు నిశ్శబ్దంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని పిటిషనర్లలో ఒకరైన న్యాయవాది ఎన్.కె.గోస్వామి వాదన వినిపించారు. ‘‘ ఎలక్ట్రానిక్ సాక్ష్యం శిలాశాసనం కాదు. సిసిటివి వ్యవస్థ కోర్టు సెలవుల కోసం వేచి ఉండదు. డివిఆర్ విచారణ షెడ్యూల్‌ను పాటించదు. డిజిటల్ చెల్లింపుల లాగ్‌లు, యాక్సెర్ రికార్డులను మార్చవచ్చు, తరలించవచ్చు లేదా తొలగించవచ్చు. సాక్ష్యాధారాల పరిరక్షణ ముఖ్యమైనప్పుడు, కేసు వాయిదా వేయడమంటే న్యాయనిరాకరణ కావచ్చు’’ అని ఎన్.కె.గోస్వామి పేర్కొన్నారు. జులై 12న వేసవి సెలవులు ముగిసిన అనంతరమే పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తామని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తనకు తెలిపిందని న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను భద్రపరిచే ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్‌లు దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, యుపి ప్రభుత్వం, కేంద్రప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. రామ మందిర నిర్మాణం కోసం ఉద్దేశించిన ప్రజా విరాళాలను అక్రమంగా దుర్వినియోగం చేయడం, దారి మళ్లించడం, అపహరించడం వంటి ఆరోపణలపై ఒక సాధారణ కేసు నమోదు చేసి, స్వతంత్రంగా, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని పిటిషన్‌లో కోరారు. యుపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే ఈ ఆరోపణలపై విచారణ చేపడుతోందని, అయితే సంక్లిష్టమైన ఆర్థిక విచారణకు అవసరమైన ఫోరెన్సిక్ దర్యాప్తు, మౌలిక సదుపాయాలు సిట్ వద్ద లేవని పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండానే విచారణ ప్రారంభించిందని, దీంతో సాక్ష్యాధారాల భద్రత సవాలుకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది.









కామెంట్‌లు (0)