- సరిగమకు అనుకూలంగా తీర్పు
- 134 చిత్రాల పాటల ప్రసారంపై ఇళయరాజాకు తాత్కాలిక నిషేధం
న్యూఢిల్లీ: సంగీత దర్శకుడు ఇళయరాజా, సరిగమ ఇండియా లిమిటెడ్ మధ్య కొనసాగుతున్న కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టు సరిగమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 1976 నుంచి విడుదలైన 134 చిత్రాలకు సంబంధించిన పాటలను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రసారం చేయడం లేదా ఇతరులకు అందుబాటులో ఉంచడాన్ని ఇళయరాజాను కోర్టు నిలువరించింది. తుషార్ రావు గెడెల నేతృత్వంలోని ధర్మాసనం, ఇళయరాజాకు తన సంగీత స్వరకల్పనలపై కాపీరైట్ హక్కులు ఉన్నప్పటికీ, సినిమాల్లో ఉపయోగించిన సౌండ్ రికార్డింగ్లపై ఆ హక్కులు వర్తించవని స్పష్టం చేసింది. ఆ సౌండ్ రికార్డింగ్‌ల కాపీరైట్ హక్కులు నిర్మాత తరఫున సరిగమ వద్దే ఉంటాయని పేర్కొంది.
కాపీరైట్ చట్టంలోని సెక్షన్ 14(ఎ) ప్రకారం ఇళయరాజాకు ఉన్న హక్కులు కేవలం సంగీత కూర్పులకు మాత్రమే పరిమితమని, వివాదంలో ఉన్న సౌండ్ రికార్డింగ్లపై అవి వర్తించవని కోర్టు అభిప్రాయపడింది. 1976 నుంచి 2001 మధ్య కాలంలో పలు చిత్రాల నిర్మాతలతో కుదుర్చుకున్న అప్పగింత ఒప్పందాల ద్వారా ఆయా చిత్రాల పాటల సౌండ్ రికార్డింగ్‌లు, వాటికి సంబంధించిన సంగీత, సాహిత్య రచనల కాపీరైట్ హక్కులను తాము పొందినట్లు సరిగమ కోర్టుకు తెలిపింది.
అలాగే అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియో సావన్ వంటి డిజిటల్ వేదికల్లో వివాదాస్పద పాటలను ఇళయరాజా అప్లోడ్ చేసి, వాటిపై యాజమాన్య హక్కులు క్లెయిమ్ చేశారని సరిగమ ఆరోపించింది. ప్రాథమికంగా కాపీరైట్ ఉల్లంఘన జరిగినట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొంటూ, దావాలో ప్రస్తావించిన 134 చిత్రాల పాటల ప్రసారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. ఈ జాబితాలో అన్నక్కిలి, 16 వయతినిలే, ముల్లుం మలరుం, నేత్రికణ్, రాజా పార్వై వంటి ప్రముఖ చిత్రాలు ఉన్నాయి.







కామెంట్లు (0)