- మెటాను వివరణ కోరిన కేంద్రం
న్యూఢిల్లీ: వాట్సాప్ తీసుకురానున్న ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌కు కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్ వేసింది. భద్రతా, సైబర్ నేరాల నియంత్రణ అంశాలపై ఆందోళనలు వ్యక్తం చేస్తూ ఈ ఫీచర్‌ను భారతదేశంలో అమలు చేయవద్దని మెటాకు సూచించింది. అలాగే మూడు రోజుల్లోగా పూర్తి వివరణ ఇవ్వాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను పంచుకోకుండానే యూజర్‌నేమ్ ఆధారంగా చాట్ చేసే అవకాశం కల్పించే ఈ ఫీచర్‌ను వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించింది. యూజర్లు తమకు నచ్చిన యూజర్‌నేమ్‌ను ముందుగానే రిజర్వ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించనున్నట్లు సమాచారం.
అయితే, ఈ ఫీచర్‌ను సైబర్ నేరగాళ్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఫోన్ నంబర్ల స్థానంలో యూజర్‌నేమ్‌లను ఉపయోగించడం వల్ల నకిలీ ఖాతాలు సృష్టించి ఇతరులుగా నటించే అవకాశాలు పెరుగుతాయని, దీంతో ఆర్థిక మోసాలు, సైబర్ నేరాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడం మరింత క్లిష్టమవుతుందని పేర్కొంది. అలాగే, యూజర్‌నేమ్‌లను ఎప్పుడైనా మార్చడం లేదా తొలగించే అవకాశం ఉండటంతో నేరాలకు సంబంధించిన డిజిటల్ ఆనవాళ్లను చెరిపివేసే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ అంశాలపై మెటా నుంచి సంతృప్తికరమైన వివరణ వచ్చే వరకు భారతదేశంలో వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు అనుమతి ఇవ్వబోమని కేంద్రం స్పష్టం చేసింది.







కామెంట్‌లు (0)