45 శాతం ఇళ్లలో విద్యుత్ సమస్య
ఎఇఇఇ- కాజమ్ రిపోర్ట్
న్యూఢిల్లీ : భారతదేశంలో విద్యుత్ వాహనాల (ఇవి) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వాలు పదేపదే పేర్కొంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కొరత పెద్ద అడ్డంకిగా మారింది. అలయన్స్ ఫర్ యాన్ ఎనర్జీ ఎఫిషియంట్ ఎకానమీ (ఎఇఇఇ), కాజమ్ సంస్థల తాజా అధ్యయనం ప్రకారం.. దేశవ్యాప్తంగా దాదాపు 45 శాతం గృహాలు తమ ఇళ్లలో సురక్షితంగా ఇవిలను ఛార్జ్ చేసుకోవాలంటే విద్యుత్ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తేలింది. టైర్-1, టైర్-2 మరియు టైర్-3 నగరాల్లోని 80,000కు పైగా నివాసాలను పరిశీలించినట్లు తెలిపింది. ప్రస్తుతం ఉన్న గృహ విద్యుత్ వ్యవస్థలు ఇవి ఛార్జింగ్ వల్ల అదనంగా వచ్చే లోడ్‌ను తట్టుకునేలా లేవని.. దీనివల్ల వోల్టేజ్ హెచ్చుతగ్గులు, ట్రాన్స్‌ఫార్మర్ల విఫలం, విద్యుత్ అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.
ఢిల్లీ వంటి నగరాల్లో రాబోయే కొన్నేళ్లలో పెట్రోల్, సిఎన్‌జి వాహనాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ప్రభుత్వాలు నిర్ణయించినప్పటికీ.. నివాస ప్రాంతాల్లో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా రద్దీగా ఉండే పట్టణాల్లో సొంత పార్కింగ్ స్థలాలు లేకపోవడం, పాత భవనాల కోసం స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం, అగ్ని ప్రమాదాల భయం, విద్యుత్ వ్యవస్థను మార్చడానికి అయ్యే అధిక ఖర్చు వంటివి ఇవి వినియోగదారులను వెనక్కి తగ్గేలా చేస్తున్నాయి. అదే విధంగా ఇవి బ్యాటరీల పరిమిత జీవితకాలం కారణంగా వాహన కాలపరిమితిలో ఒకసారైనా బ్యాటరీని మార్చాల్సి రావడం వినియోగదారులపై ఆర్థిక భారాన్ని పెంచుతోందని ఈ నివేదిక పేర్కొంది. ఈ సవాళ్లను అధిగమించి భారతదేశ ఇ-మొబిలిటీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం వాహనాల ప్రోత్సాహకాలపైనే కాకుండా.. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.








కామెంట్‌లు (0)