వాణిజ్య, 5 కేజీల గ్యాస్, ఎటిఎఫ్
పెట్రో ధరలను తగ్గించిన నయారా ఎనర్జీ
న్యూఢిల్లీ : వాణిజ్య ఎల్‌పిజి, ఐదు కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పిజి సిలిండర్ల ధరలను ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు బుధవారం నుంచి స్వల్పంగా తగ్గించాయి. పశ్చిమ ఆసియాలో కొన్ని నెలలకు పైగా కొనసాగుతున్న ఉద్రికత్త పరిస్థితులు తగ్గుముఖం పడుతుండటం, ముడి చమురు సరఫరా పరిస్థితి మెరుగు పడుతుండటం వంటి అంశాల నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్ల ధరల్లో ఎలాంటి తగ్గింపును చేయలేదు. వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ల ధరలను సిలిండర్‌కు రూ. 180, ఐదు కేజీల ఫ్రీ ట్రేడ్ సిలిండర్ల ధరలను సిలిండర్‌కు సుమారుగా రూ.13 తగ్గించాయి. అలాగే, దేశీయ షెడ్యూల్డ్ విమానయాన సంస్థల కోసం ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధరలను లీటరుకు రూ. 5 తగ్గించారు. మరోవైపు.. ప్రైవేట్ యాజమాన్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నయారా ఎనర్జీ తమ పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు వరుసగా రూ.5, రూ. 3 చొప్పున తగ్గించింది. ఈ నయారా ఎనర్జీకి దేశవ్యాప్తంగా 7 వేలకు పైగా పెట్రోల్ పంపులు ఉన్నాయి. కాగా, ఈ ఏడాది మార్చి నుంచి నాలుగు సార్లు పెంపుతో వాణిజ్య ఎల్‌పిజి ధర సిలిండరుకు మొత్తం రూ. 1,345 పెంచారు. బుధవారం తాజా తగ్గింపుతో ఢిల్లీలోని 19 కేజీల వాణిజ్య ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 2,930కి చేరింది. అలాగే, ఐదు కేజీల ఫ్రీ ట్రేడ్ ఎల్‌పిజి సిలిండర్ రీఫిల్ ధర తాజా తగ్గింపుతో రూ. 808.5గా ఉంది.








కామెంట్‌లు (0)