మధ్యవర్తుల ద్వారా అధికారుల స్థాయిలో సంప్రదింపులు
ఒప్పందం అమలు...ఆస్తుల విడుదలే ప్రధాన ఎజెండా
దోహా : అమెరికా, ఇరాన్ అధికారులు బుధవారం ఖతార్, పాకిస్తాన్ మధ్యవర్తుల ద్వారా అధికారుల స్థాయిలో పరోక్ష చర్చలు జరిపారు. ఈ చర్చలలో అమెరికా ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్ భాగస్వాములు కాలేదు. వీరిద్దరూ మంగళవారం నాడు ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్-థానీతో సమావేశమై పరోక్ష చర్చలకు పునాది వేశారు. అటు ఇరాన్ అధికారులు కూడా ఖతార్ మధ్యవర్తులను కలిశారు. అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందాలు( ఎంఒయు) అమలు, విదేశాలలో అమెరికా స్తంభింపజేసిన ఆస్తుల విడుదల గురించి తమ అధికారులు చర్చించారని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై చెప్పారు. రాబోయే రోజులలో అమెరికా ప్రతినిధులను కలిసే ఆలోచన ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు. స్తంభింపజేసిన ఆరు బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను ఇంకా బదిలీ చేయలేదని అంటూ చర్చలలో పురోగతిని బట్టి ఆ పని జరుగుతుందని చెప్పారు.
చర్చలపై ఖతార్ ఏమంది?
అమెరికా నేతలతో జరిగిన సమావేశం తాజా పరిణామాలను సమీక్షించిందని ఖతార్ విదేశాంగ శాఖ తెలిపింది. ‘అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఎంఒయు అమలు కోసం జరుగుతున్న చర్చలు ఎలా సాగుతున్నాయనే దానిపై సమీక్ష జరిగింది. చర్చలు, దౌత్యం ద్వారా మధ్యప్రాచ్యంలో భద్రతను, సుస్థిరతను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించారు’ అని వివరించింది. లెబనాన్‌లో కాల్పుల విరమణ అమలు జరుగుతున్న తీరును కూడా ఈ సమావేశం సమీక్షించింది. లెబనాన్ ఐక్యత, సార్వభౌమత్వం, సుస్థిరతలను పరిరక్షించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పింది. కాగా ఇరాన్, అమెరికా మధ్య సాంకేతిక చర్చలు కొనసాగుతాయని, అయితే ప్రస్తుతానికి ఇరు పక్షాల మధ్య ఉన్నత స్థాయిలో సంప్రదింపులు ఏవీ జరగబోవని ఖతార్ చెప్పింది.
కీలక అంశాలపై కానరాని పురోగతి
రెండు వారాల క్రితం అమెరికాతో కుదుర్చుకున్న కాల్పుల విరమణ ఒప్పందం అమలుకు సంబంధించిన నియమ నిబంధనలను ముందుగా రూపొందించుకోవాల్సి ఉన్నదని, ఆ తర్వాతే కీలక అంశాలపై చర్చ జరుగుతుందని ఇరాన్ అధికారులు తెలిపారు. కాగా ఎంఒయులోని కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య నెలకొన్న దూరం అలాగే ఉన్నదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఎంఒయు ప్రకారం...అమెరికా అందించే ఆర్థిక ప్రోత్సాహకాలకు బదులుగా హర్మూజ్ జలసంధిపై పట్టును ఇరాన్ సడలించాల్సి ఉంటుంది. అలాగే శాశ్వత శాంతి ఒప్పందం కోసం 60 రోజుల పాటు సంప్రదింపులు జరపాలి. అయితే ఈ పనులేవీ ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు.
దాడులపై ట్రంప్ సమాలోచనలు
ప్రతిష్టంభనను తొలగించేందుకు ఏం చేయాలనే దానిపై ఒక వైపు ఆలోచనలు చేస్తూనే మరోవైపు ఇరాన్‌పై పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్లే విషయాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక తెలియజేసింది. దాడులపై ఆయన రక్షణ మంత్రి పీట్ హెగ్‌సేథ్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్‌లతో మంతనాలు సాగిస్తున్నారని చెప్పింది. ఎంఒయును అమలు చేయకపోతే ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తామని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. అయితే దౌత్య యత్నాలకు మరింత సమయం ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారని ఆ పత్రిక తెలియజేసింది. అలాగే ఇరాన్‌ను గట్టిగా దెబ్బతీసామని, ఆ దేశం వద్ద అణ్వాయుధం ఉండకూడదని, సమావేశాలు చాలా మంచిగా జరిగాయంటూ బుధవారం వాషింగ్టన్, డిసి సమీపంలోని జాయింట్ బేస్ ఆండ్రూస్ వద్ద విలేకరులతో ట్రంప్ తెలిపారు.
ఎంఒయును అమలు చేయండి : చైనా
తదుపరి విడత చర్చల కోసం కుదుర్చుకున్న ఎంఒయును అమలు చేయాలని ఇరాన్, అమెరికా దేశాలకు చైనా సూచించింది. తాత్కాలిక ఒప్పందం అమలుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అన్నారు. ముందుగా ఎంఓయూను అమలు చేసి, ఆ తర్వాత దీర్ఘకాలిక పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన కోరారు. పశ్చిమాసియా దేశాలతో పాటు అంతర్జాతీయ సమాజం కూడా దీనినే కోరుకున్నదని గుర్తు చేశారు.








కామెంట్‌లు (0)