నలుగుర్ని అరెస్టు చేసిన చెన్నై పోలీసులు
పరారీలో సెంథిల్ బాలాజీ సోదరుడు
చెన్నై :తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చేందుకు రూ. 35 కోట్లతో కుట్ర జరిగిందనే ఆరోపణలతో చెన్నై పోలీసులు కేసును నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగుర్ని అరెస్టు చేశారు. ఉత్తంగరై (కృష్ణగిరి జిల్లా) ఎమ్మెల్యే (టివికె) ఎన్. ఇళయరాజా చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు, అరెస్టులు జరిగాయి. టివికె పార్టీ మారాలని లేదా టివికె ప్రభుత్వాన్ని బలహీనపరిచే చర్యలకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఒక మధ్యవర్తి తనకు భారీ మొత్తంలో లంచం ఆశ చూపారని ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా ఆరోపించారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌పై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని కూడా కోరారని తెలిపారు. అలాగే, ఈ కుట్రను కరూర్‌లో పన్నారని, దీనికి ప్రధాన సూత్రధారి మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీ సోదరుడు అశోక్ కుమార్ అని, ఆయన నివాసంలో కీలక సమావేశాలు జరిగాయని ఎమ్మెల్యే ఆరోపించారు. విజయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కనీసం 15 మంది టివికె ఎమ్మెల్యేలతో ఏకాకాలంలో రాజీనామా చేయించేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. ఎమ్మెల్యేల రాజీనామాతో అధికార కూటమి సంఖ్యాబలం భారీగా తగ్గి, రాజ్యాంగ సంక్షోభానికి దారితీయాలన్నదే వారి కుట్ర అని ఎమ్మెల్యే తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో 'ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్' (ఐపిడిఎస్) ప్రతినిధి, సర్వేయర్ సి. తిరునావుక్కరసు, కరూర్ నగరానికి చెందిన వ్యాపారవేత్త, రెస్టారెంట్ యజమాని నరేష్ ('రమేష్' అని కూడా పిలుస్తారు) ఉన్నారు. థియాగరాజన్, కార్తీక్ అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. వీరిలో ముగ్గురిని ఇప్పటికే కోర్టు ముందు హాజరుపర్చి 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కాగా, నరేష్ మాజీ మంత్రి వి. సెంథిల్ బాలాజీకి సన్నిహితుడని చెబుతున్నారు. అశోక్ కుమార్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అశోక్ కుమార్ పాత్రపై పూర్తి దర్యాప్తు జరుగుతోందని, అలాగే, ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అశోక్ కుమార్ నివాసం, కార్యాలయాలపై జరిపిన సోదాల్లో కుట్రకు సంబంధించిన కొన్ని "ముఖ్యమైన పత్రాలు" లభించినట్లు సమాచారం. ఈ భారీ కుట్రను భగ్నం చేయడంలో తమిళనాడు ఇంటెలిజెన్స్ విభాగం కీలక పాత్ర పోషించిందని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అలాగే, మరిన్ని అరెస్టులు లేదా సోదాలు జరిగే అవకాశాన్ని పోలీసులు తోసిపుచ్చలేదు.








కామెంట్‌లు (0)