@ముఖ్యమంత్రికి వి. శ్రీనివాసరావు లేఖ
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పార్వతీపురం మన్యం జిల్లా పూర్ణపాడు-లాభేసు వంతెనను పూర్తి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గురువారం ముఖ్యమంత్రికి ఆయన లేఖ రాశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలానికి సంబంధించి తొమ్మిది పంచాయతీలు 40 గ్రామాలతో పాటు కురుపాం మండలం, గుమ్మలక్ష్మిపురం, జి.ఎం.వలస, గరువుబిల్లి మండలాల ప్రజల రాకపోకలకు అవసరమైన పూర్ణపాడు - లాభేసు బ్రిడ్జి దాదాపు 30 సంవత్సరాలుగా పెండింగులో ఉందని తెలిపారు. లాబేసు, తిక్కవరం, పొరుగుపాకు గ్రామాల ప్రజలు కొమరాడ మండల కేంద్రానికి రావడానికి ఈ వంతెన పూర్తి అయితే ఐదు కిలోమీటర్లలోపు దూరానికి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం నాగావళి ఏరువస్తే కురుపాం మీదుగా 70 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొమరాడ మండల కేంద్రానికి రావలసి వస్తుందని తెలిపారు. 1995 సంవత్సరంలో అటు ఒరిస్సా ఇటు ఆంధ్ర సరిహద్దు వనిజ గ్రామం వద్ద నాగావళి నదిలో నాటు పడవ ప్రమాదంలో 32 మంది గిరిజనులు చనిపోయారని తెలిపారు. అప్పటి మంత్రి దేవేందర్‌గౌడ్ పూర్ణపాడు లాభేసు గ్రామాల మధ్య వంతెన నిర్మిస్తానని హామీ ఇచ్చారని, అమలు కాలేదని, తిరిగి 2006వ సంవత్సరంలో సిపిఎం ఎమ్మెల్యే కోలక లక్ష్మణ మూర్తి అసెంబ్లీలో గట్టిగా పట్టుబట్టడం వల్ల ఆ సంవత్సరం పనులు ప్రారంభించారని తెలిపారు. ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తి అయ్యాయని, నాగావళి నదిలో మరొక మూడు పిల్లర్లు వేస్తే పని పూర్తి అవుతుందని పేర్కొన్నారు. దీనివలన 40 గ్రామాలు, నాలుగు మండలాలు గిరిజన ప్రజలకు ప్రయాణం సౌలభ్యంగా ఉంటుందని వివరించారు. ఇప్పటికే బ్రిడ్జి పని ఆరంభమై 20 సంవత్సరాలు పూర్తవుతున్నా ఈ వంతెన మూడు పిల్లర్లు కట్టడం పూర్తికాకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. 2024 ప్రపంచ ఆదివాసి దినోత్సవం రోజు పూర్ణపాడు -లాబేసు వంతెన పూర్తి చేస్తామని సిఎంగా వాగ్దానం చేశారని, రూ.20 కోట్లు కేటాయిస్తే ఈ వంతెన పూర్తి చేయవచ్చని తెలిపారు. 40 గిరిజన గ్రామాల ప్రజలకు విద్యా, వైద్యం అందుబాటులోకి వస్తుందని, దీనిపై వెంటనే జోక్యం చేసుకొని నిధులు కేటాయించి ఈ వంతెన పెండింగ్ పనులు పూర్తి చేయాలని శ్రీనివాసరావు కోరారు.







కామెంట్‌లు (0)