సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ('సర్') పేరుతో ఓట్లను తొలగించేందుకు పెద్ద కుట్ర చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం కర్నూలులోని టిజిఆర్ ఫంక్షన్ హాలులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ వల్ల లక్షలాది మంది అర్హులైన వారు తమ ఓటును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఫారాలు కూడా సరిగ్గా పూర్తి చేయలేని బిఎల్ఒలను నియమించడం దారుణమన్నారు. ఓటర్ల నమోదు, సవరణకు మూడు నెలలు పొడిగించాలని డిమాండ్ చేశారు. గత 12 ఏళ్ల బిజెపి పాలనలో టెట్, నీట్ వంటి దాదాపు 80 రకాల పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని, ముఖ్యంగా బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఇవి జరగడం సిగ్గుచేటని విమర్శించారు. యుద్ధాల సాకుతో గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలను ఇష్టానుసారంగా పెంచి మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆగస్టు ఆరు నుండి సిపిఐ దేశవ్యాప్త పాదయాత్రలు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు ఈశ్వరయ్య ప్రకటించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.మునెప్ప, ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి యుగందర్, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)