శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

డేటా సెంటర్లకు వ్యతిరేకంగా విశాఖలో నిరసన ర్యాలీ

19 జులై, 2026

vizag 4
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 10:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ప్రజా విచారణ, పారదర్శకత, దళిత రైతులకు న్యాయం చేయాలని డిమాండ్

ప్రజాశక్తి-విశాఖపట్నం: విశాఖపట్నంలో డేటా సెంటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పర్యావరణ, పౌర హక్కుల సంఘాలు ఆదివారం భారీ నిరసన చేపట్టాయి. ప్రజాభిప్రాయం తీసుకోకుండా, పర్యావరణ, సామాజిక ప్రభావాలపై సమగ్ర అధ్యయనాలు నిర్వహించకుండా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. గ్రీన్ విశాఖ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులో నిర్వహించిన ఈ ర్యాలీకి పర్యావరణ పరిరక్షణ సంస్థలు, పౌర హక్కుల సంఘాలు, ఏఐ నియంత్రణ కూటమి మద్దతు తెలిపాయి. సింహాచలం, రాంబిల్లి, తర్లువాడ ప్రాంతాల్లో ప్రతిపాదిత డేటా సెంటర్లను వ్యతిరేకిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతినిధులతో పాటు 150 మందికి పైగా పౌరులు పాల్గొన్నారు.

ర్యాలీకి ముందు జూలై 18న విడుదలైన పౌర వాస్తవాన్వేషణ నివేదికను ప్రస్తావిస్తూ, తర్లువాడలోని దళిత రైతుల జీవనోపాధిపై ఈ ప్రాజెక్టు తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 50 మంది దళిత రైతులకు తగిన భూమి, న్యాయమైన ఆర్థిక పరిహారం అందించడంతో పాటు ప్రజా విచారణ నిర్వహించాలని కోరారు.

ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి పారదర్శకత పాటించాలని, పర్యావరణ ప్రభావ మదింపు (EIA), సామాజిక ప్రభావ మదింపు (SIA) నివేదికలను తప్పనిసరిగా రూపొందించి ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టును ప్రశ్నిస్తున్న వారిపై అణచివేత చర్యలు నిలిపివేయాలని, ప్రజలను ప్రభావితం చేసే భారీ ప్రాజెక్టుల విషయంలో ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా వ్యవహరించాలని ర్యాలీలో పాల్గొన్న వారు డిమాండ్‌ చేశారు. ప్రజాస్వామిక హక్కులను పరిరక్షిస్తూ, అధికారులను ప్రశ్నించే హక్కును పౌరులకు కల్పించాలని, ఈ డిమాండ్లు నెరవేరే వరకు డేటా సెంటర్ ప్రాజెక్టులను నిలిపివేయాలని వారు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం పర్యావరణం, తీర ప్రాంత వారసత్వ పరిరక్షణ కోసం ఈ ఉద్యమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

vizag

vizag 2

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్