సుమిత్ సర్కార్...
ఆధునిక భారత చరిత్రను సామాన్య ప్రజల వైపు నుంచి చూసిన ప్రముఖ చరిత్రకారుడు, మార్క్సిస్టు మేధావి. 1939లో జన్మించిన ఆయన 87 ఏళ్ల వయసులో ఆగస్టు 13, 2026న ఢిల్లీలో కన్నుమూశారు. ఆయన తండ్రి సుశోభన్ చంద్ర సర్కార్ ప్రముఖ చరిత్రకారుడు. సోదరి సిప్రా సర్కార్ కూడా చరిత్రకారిణి. మేనమామ ప్రఖ్యాత గణాంక శాస్త్రవేత్త పి.సి. మహలనోబిస్. చరిత్ర, సమాజం, రాజకీయాలపై చర్చలు జరిగే కుటుంబ వాతావరణం, తండ్రి ద్వారా వచ్చిన వామపక్ష ఆలోచనలు సుమిత్ ఆలోచనా వికాసంపై ప్రభావం చూపాయి. కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజీలో చరిత్ర చదివి, కలకత్తా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తి చేసిన ఆయన తరువాత ఆక్స్‌ఫర్డ్‌లో పరిశోధనా ఫెలోగా పనిచేశారు. కలకత్తా విశ్వవిద్యాలయం, బర్ద్వాన్ విశ్వవిద్యాలయాల్లో బోధించిన తరువాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సుదీర్ఘకాలం చరిత్ర ప్రొఫెసర్‌గా పనిచేశారు.
సుమిత్ సర్కార్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది చరిత్రను చూసే ఆయన దృష్టి. ఆయనకు చరిత్ర అంటే రాజులు, యుద్ధాలు, పాలకులు, రాజకీయ నిర్ణయాల వరుస కాదు. వాటి వెనుక పనిచేసే ఆర్థిక పరిస్థితులు, వర్గ సంబంధాలు, సామాజిక శక్తులు, అధికార నిర్మాణాలు, సామాన్య ప్రజల అనుభవాలను కలిపి చూడాల్సిన ప్రక్రియ. భారత జాతీయోద్యమాన్ని గాంధీ, నెహ్రూ, తిలక్ వంటి నాయకుల చుట్టూ మాత్రమే నిర్మించిన కథనానికి భిన్నంగా రైతులు, కార్మికులు, మధ్యతరగతి, మహిళలు, గిరిజనులు, అట్టడుగు వర్గాల పాత్రను ఆయన పరిశీలించారు. 1973లో వెలువడిన ‘ది స్వదేశీ మూవ్‌మెంట్ ఇన్ బెంగాల్, 1903–1908’ ఆయనకు విశేష గుర్తింపు తెచ్చింది. తరువాత వచ్చిన ‘మోడర్న్ ఇండియా: 1885–1947’ ఆధునిక భారత చరిత్రను అధ్యయనం చేసే విద్యార్థులు, పరిశోధకులకు ముఖ్యమైన గ్రంథంగా మారింది. కనిపించని గొంతులను, ఉద్యమాల వెనుక సామాజిక శక్తులను గుర్తించడం ఆయన పరిశోధనలో ప్రధాన లక్షణం.
మార్క్సిజం ఆయన చరిత్ర దృష్టికి బలమైన పునాది. వర్గ సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, ఉత్పత్తి విధానాలు, అధికార నిర్మాణాలు చారిత్రక పరిణామాలను ఎలా ప్రభావితం చేస్తాయన్నది ఆయన రచనల్లో కనిపిస్తోంది. స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్‌ను కూడా ఆయన ఏకరూపమైన సంస్థగా చూడలేదు. పరస్పర విరుద్ధ ధోరణులు, సామాజిక ఒత్తిళ్లు, వర్గ ప్రయోజనాలు, రాజకీయ వ్యూహాలు ఢీకొనే క్షేత్రంగా, జాతీయ నాయకత్వం–ప్రజా ఉద్యమాల సంబంధాల నేపథ్యంలో ఆయన దాన్ని విశ్లేషించారు. అల్లూరి సీతారామరాజు నాయకత్వంలోని మన్యం పోరాటాన్ని కూడా ఒక వీరుడి తిరుగుబాటుగా కాకుండా గిరిజనుల జీవన పరిస్థితులు, పోడు వ్యవసాయం, అటవీ చట్టాల ఆంక్షలు, జీవనాధారాలపై వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన చూశారు. సుమిత్ జీవిత భాగస్వామి తనికా సర్కార్ కూడా ఆధునిక భారత చరిత్రలో ప్రముఖ చరిత్రకారిణి. ఇద్దరూ కలిసి వెలువరించిన ‘విమెన్ అండ్ సోషల్ రిఫార్మ్ ఇన్ మోడర్న్ ఇండియా’ మహిళా చరిత్ర అధ్యయనంలో ఎంతో కీలకంగా మారింది. ‘కాస్ట్ ఇన్ మోడర్న్ ఇండియా’ ద్వారా ఆధునిక భారత సమాజంలో కులం పాత్రను కూడా వారు పరిశీలించారు.
1980–90ల తర్వాత భారత సమాజంలో వచ్చిన మార్పులపై కూడా సుమిత్ సర్కార్ నిశిత పరిశీలన చేశారు. ఆర్థిక సంస్కరణలు, మార్కెట్ మార్పులు, సంస్కృతి, భాష, జాతీయత, మత రాజకీయాలు వంటి అంశాలు కొత్త సామాజిక వాస్తవాలను ఎలా సృష్టిస్తున్నాయన్నదానిపై ఆయన ఆసక్తి చూపారు. గతాన్ని స్థిరమైన కథగా కాకుండా వర్తమాన మార్పులతో తిరిగి పరిశీలించాల్సిన అంశంగా చూశారు. చరిత్రను గతాన్ని నమోదు చేసే శాస్త్రంగా కాక వర్తమానాన్ని అర్థం చేసుకునే సాధనంగా భావించారు. హిందూత్వ రాజకీయాల చరిత్ర వక్రీకరణలను బలంగా విమర్శించారు. అస్తిత్వవాద ధోరణుల్లోని పరిమితులను సోదాహరణంగా వివరించారు.
చరిత్రలో ఎవరి గొంతు వినిపిస్తోంది? ఒక ఉద్యమం వెనుక నిజంగా పనిచేసిన సామాజిక శక్తులేమిటి? జాతీయవాదం ఎవరిని కలుపుకుంది, ఎవరిని బయట ఉంచింది? ప్రజల అనుభవాలు ఏం చెబుతున్నాయి? ఇటువంటి ప్రశ్నలే ఆయన పరిశోధనకు దిశానిర్దేశం చేశాయి. చరిత్రను అధికార కేంద్రాల నుంచి మాత్రమే కాక ప్రజల కోణంలోంచి చూడడం, సంఘటనలను విడివిడిగా కాక వాటి వెనుక ఉన్న సామాజిక సంబంధాల కోణంలో విశ్లేషించడం సుమిత్ సర్కార్ మేధో వారసత్వం. 2025లో తనికా సర్కార్ సంకలనం చేసిన ‘అన్‌కలెక్టెడ్ రైటింగ్స్’ ఆయన సుదీర్ఘ రచనా ప్రయాణంలోని మరో ముఖ్యమైన కృషి. సుమిత్ సర్కార్ మరణంతో ఒక చరిత్రకారుడి ప్రయాణం ముగిసినా, చరిత్రను ప్రజల కళ్లతో చూడాలన్న ఆయన దృష్టి, వేసిన ప్రశ్నలు మాత్రం తరతరాల ఆలోచనలను కదిలిస్తూనే ఉంటాయి.







కామెంట్‌లు (0)