సిఐడికి హైకోర్టు ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి: మద్యం రవాణా టెండర్ల వ్యవహారంలో ప్రభుత్వ మాజీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై నమోదైన కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని సిఐడిని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో నాలుగో నిందితుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు అయిన కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మద్యం రవాణా టెండర్ల వ్యవహారంలో సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేసిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యం తేలే వరకు తనపై అరెస్టు సహా ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు. మద్యం రవాణా టెండర్ల కేసు ఇప్పటికే నమోదైన మద్యం అక్రమ వ్యవహారానికి సంబంధించిన కేసులో భాగమేనని, దానిని ప్రత్యేక కేసుగా పరిగణించరాదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒకే ఘటనకు సంబంధించి వరుసగా అనేక నేర నివేదికలు నమోదు చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి, వ్యక్తిగత స్వేచ్ఛకు విరుద్ధమని వాదించారు. ఒకే లావాదేవీకి సంబంధించిన అంశాలను విడదీసి వరుసగా కేసులు నమోదు చేస్తూ దర్యాప్తు చేపట్టేందుకు చట్టం అవకాశం కల్పించదని పిటిషన్‌లో రాజశేఖర్‌రెడ్డి వివరించారు. దీంతో హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.







కామెంట్‌లు (0)