మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై మంత్రి సవిత
ప్రజాశక్తి-పెనుకొండ : జగన్ పది జన్మలెత్తినా అమరావతి నిర్మాణాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడ్డుకోలేరని రాష్ట్ర మంత్రి ఎస్ సవిత అన్నారు. రాజధాని అంశంపై రోజుకో పిల్లిమొగ్గ వేస్తున్న ఆయనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2019 ఎన్నికల్లో అమరావతికి జైకొట్టి, సిఎం కుర్చీ ఎక్కగానే మూడు రాజధానులు అంటూ డ్రామాకు తెరతీశారన్నారు. 2024 ఎన్నికల్లో మూడు రాజధానులు అంటూ హడావుడి చేసిన జగన్‌కు రాష్ట్ర ప్రజలు సరైన గుణపాఠం చెప్పారన్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. ఇప్పుడు మావిగన్ అంటూ మరో డ్రామాకు తెరతీశారన్నారు. జగన్ నోటా శాంతిభద్రతలు మాట రావడం విడ్డూరంగా ఉందన్నారు. వైసిపి హయాంలో ప్రతిపక్షాలపైనా, ప్రజలపైనా అక్రమ కేసులు బనాయించి నిర్బంధించారన్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఏరోజు కూడా రైతులను, వ్యవసాయ రంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. జగన్ ఇలాగే వ్యవహరిస్తే రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ప్రజలు గెలవనివ్వరని హెచ్చరించారు. హోంమంత్రి అనిత కట్టుబొట్టుపై వైసిపి నాయకుడు అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు.








కామెంట్‌లు (0)