షెడ్యూల్ 9, 10 సంస్థలపై ప్రభుత్వ నిర్ణయం
రిటైర్ అయినవాళ్లు మళ్ళీ విధుల్లోకి
తాజాగా ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ఆర్ధికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు 62 సంవత్సరాల పదవి విరమణ విధానం అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని షెడ్యూల్ 9, 10 పరిధిలోనున్న ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును కూడా 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం 2022 జనవరి ఒకటి నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.
ఇంతకుముందు ఈ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మాత్రం 2022లో 60 నుంచి 62 ఏళ్లకు పెంచింది. తమకు కూడా అదే ప్రయోజనాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వ రంగ సంస్థలనుంచి వినతులు వచ్చాయి. ఇదే సమయంలో అప్పట్లోనే 60 ఏళ్ల వయస్సుకి పదవీ విరమణ చేసిన కొంతమంది ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించగా, కొన్ని కేసుల్లో 62 ఏళ్ల వరకు విధుల్లో కొనసాగించేందుకు మధ్యంతర ఉత్తర్వులు లభించాయి. ఈ నేపథ్యంలోనే చట్టపరమైన అంశాలు, రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం, పరిపాలనా అవసరాలను పరిశీలించిన ప్రభుత్వం పదవీ విరమణ వయస్సు పెంపునకు ఆమోదం తెలిపింది.
మళ్ళీ విధుల్లోకి
తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేసిన ఉద్యోగులను అవసరమైతే తిరిగి విధుల్లోకి తీసుకుని 62 ఏళ్ల వరకు కొనసాగించాలని నిర్ణయించారు. కోర్టు ఉత్తర్వుల ఆధారంగా ఇప్పటికే 62 ఏళ్ల వరకు విధులు నిర్వహించిన ఉద్యోగుల సేవలను రెగ్యులర్ సేవగా పరిగణించి అన్ని సాధారణ ప్రయోజనాలు కల్పించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే పదవి విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకుంటే వారి పదవీ విరమణ సమయం నుంచి నుంచి పునర్నియామకం వరకు ఉన్న కాలాన్ని ఉద్యోగంలో లేని కాలంగా పరిగణిస్తారు. ఆ కాలానికి ఇరువంటి జీతభత్యాలు చెల్లించరు. అలాగే వార్షిక వేతన పెరుగుదలను నోటిషనల్‌గా మంజూరు చేసి, పునర్నియామకం తేదీ నుంచి మాత్రమే ఆర్థిక ప్రయోజనం అందజేస్తారు. ఆ కాలాన్ని సీనియారిటీ, పదోన్నతులు తదితర అంశాలకు పరిగణనలోకి తీసుకుంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా 60 ఏళ్లకే పదవీ విరమణ చేయాలని భావించే ఉద్యోగులకు ప్రస్తుత నిబంధనల ప్రకారం ఆ అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించారు. అలాగే తాజా ఉత్తర్వులకు విరుద్ధంగా గతంలో జారీ చేసిన ఇతర పరిపాలనా ఉత్తర్వులు అవసరమైన మేరకు సవరించినట్లుగా లేదా రద్దయినట్లుగా పరిగణిస్తామని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.







కామెంట్‌లు (0)