బుధవారం, 01 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionకనీస వేతనాల పెంపునకు సమరశంఖం

1 గంట క్రితం

prss meet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 01, 2026, 10:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ​30, 31న కలెక్టరేట్ల ముట్టడి : నర్సింగరావు

ప్రజాశక్తి-నెల్లూరు : ​ కార్మికుల కనీస వేతనాల పెంపు కోసం సిఐటియు రాష్ట్ర ఉద్యమ కార్యక్రమం చేపట్టిందని ఆ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్. నర్సింగరావు తెలిపారు. ఆయన నేతృత్వంలో ఈ నెల అంతా విస్తృతంగా ప్రచారం నిర్వహించి, ఈ నెల 30, 31న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. బుధవారం నెల్లూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లకోసారి పెరగాల్సిన వేతనాలను దాదాపు15 ఏళ్లుగా ప్రభుత్వం పెంచడం లేదన్నారు. నిత్యావసర ధరల పెరుగుదలతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. పనిగంటలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దారుణమన్నారు. కార్మిక రంగంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిని కమిటీ చైర్మన్‌‌గా నియమించడం విడ్డూరంగా ఉందన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.అజయ్ కుమార్ మాట్లాడుతూ... గడిచిన 15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి కార్మికులను మోసం చేస్తుందన్నారు. పెరిగిన ధరలకు, కార్మికులకు ఇస్తున్న వేతనాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదన్నారు. ధరలు మాత్రం 134 శాతం పెరిగాయని, ప్రభుత్వంలో ఉన్న శాసనసభ్యులు, మంత్రులు వేతనాలు పెంచుకున్నారే తప్ప సంపద సృష్టికర్తలైన కార్మికుల వేతనాలు పెంచేందుకు మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఈ నెల 30,31న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ఆందోళన కార్యక్రమంలో కార్మికులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ... ఆక్వా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని తెలిపారు. కనీస వేతనం అమలు చేయకుండా పీస్ రేటు (కేజీ సరుకు కు) అమలు చేస్తు కార్మిక శ్రమను యాజమాన్యం దోచుకుంటుందని విమర్శించారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు టి.వి.వి.ప్రసాద్, నాయకులు జి. నాగేశ్వరరావు, ఎస్ కె రెహనాబేగం పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్