ప్రజాశక్తి - హైదరాబాద్ : భారత అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రయివేటు సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ దేశంలోనే మొదటిసారిగా ప్రయివేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 తొలి ప్రయోగాన్ని (టెస్ట్ ఫ్లైట్-1) చేపట్టేందుకు సంస్థ సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా మిషన్ ఆగమన్ పేరుతో నిర్వహించనున్న ఈ ప్రయోగానికి జులై 12 నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు లాంచ్ విండోను ఖరారు చేశారు. ఏడు అంతస్తుల ఎత్తు కలిగి పూర్తిగా కార్బన్ కాంపోజిట్ నిర్మాణంతో రూపొందించిన విక్రమ్-1, సుమారు 350 కిలోల బరువున్న ఉపగ్రహాలను 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి తీసుకెళ్లే సామర్థ్యాన్ని ఈ మిషన్ ద్వారా పరీక్షించనున్నారు. ఈ ప్రయోగం భారత ప్రయివేటు అంతరిక్ష పరిశ్రమలో కొత్త మైలురాయిని అధిగమిస్తుందని స్కైరూట్ సిఇఒ పవన్ కుమార్ చందన పేర్కొన్నారు. ప్రొపల్షన్, స్టేజ్ సెపరేషన్, వెహికల్ పనితీరుపై కీలక సమాచారాన్ని సేకరించడమే ఈ మిషన్ ప్రధాన ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. ఇన్ స్పేస్. ఇస్రో సహకారంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు 2033 నాటికి భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను 44 బిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యానికి ఎంతో కీలకం కానుందన్నారు.
Print Editionస్కైరూట్ విక్రమ్-1 ప్రయోగానికి రంగం సిద్ధం
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 02, 2026, 10:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)