ఎపిసియు తొలి స్నాతకోత్సవంలో రాష్ర్టపతి ద్రౌపది ముర్ము
ప్రజాశక్తి అనంతపురం ప్రతినిధి : ‘భిన్నమైన భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలకు చెందిన విద్యార్థులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చి విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నారు. వీరందరూ భిన్నత్వంలో ఏకత్వం’ అనే భారతీయ భావనను ప్రతి రోజూ ప్రత్యక్షంగా అనుభవించే విద్యా వాతావరణం ఈ విశ్వవిద్యాలయం కల్పిస్తోంది.’ అని రాష్ర్టపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసమ్రుదం మండలం జంతలూరు వద్దనున్న కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం బుధవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ర్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, రాష్ర్ట విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2020 నుంచి 2026లోపు కేంద్రీయ విద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన 1268 మంది విద్యార్థులకు రాష్ర్టపతి చేతులమీదుగా పట్టాలను ప్రదానం చేశారు. వివిధ అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన 56 మందికి బంగారు పతకాలు అందించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి రాష్ర్టపతి మాట్లాడుతూ... అనంతపురం జిల్లాకు వచ్చిన సందర్భంలో ఇద్దరు మాజీ రాష్ర్టపతులు గుర్తుకొచ్చారని తెలిపారు. సర్వేపల్లి రాధాకృష్ణ ఇక్కడ ఆధ్యాపకుడిగా పనిచేస్తూ రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. ఈ ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి రాష్ర్టపతి పదవిని అధిరోహించిన వారిలోనున్నారని గుర్తు చేశారు. యూనివర్సిటీ నుంచి విద్యను పూర్తి చేసుకుని పట్టా తీసుకున్న ఆత్మవిశ్యాసంతో బయటకు వెళ్తున్న విద్యార్థులు వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. విద్య పూర్తవడంతోనే సరిపోదని, సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని మార్చివేస్తోందన్నారు. దీన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకునే విధంగా తయారవ్వాల్సిన అవసరముందని సూచించారు. నేర్చుకోవాలనే తపన, పట్టుదల, నూతన ఆవిష్కరణలు చేసే యువత మన అమూల్యమైన జాతిసంపదని చెప్పారు. వారి శక్తి, ప్రతిభ, నిబద్ధత ద్వారా మాత్రమే వికత భారత్ దార్శనికతను సాకారం చేసుకోవడానికి వీలుకలుగుతందన్నారు. రాష్ర్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రజల మనసుల్లో ఒక ప్రత్యేకమైన స్థానముందని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు అనంతపురంలో ఏర్పాటు చేశారని తెలిపారు. అనంతపురం జిల్లా విద్యా కేంద్రంగానూ మారుతోందని చెప్పారు. ఇక్కడ శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం జెఎన్‌టియు, సత్యసాయి విద్యా సంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయంతో పాటు అనేక ఇంజనీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాల ఉన్నాయన్నారు. అనేక విద్యా సంస్థల నిలయంగా అనంతపురం ఉండడం శుభపరిణామం అన్నారు. ఈ ప్రాంతంలో ఎంతో విలువైన ఖనిజ సంపద కూడా ఉందని తెలిపారు. ఈ ప్రాంతాభివృద్ధికి కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా దోహదపడుతుందని చెప్పారు. విద్యార్థులు విద్యాభాస్యం పూర్తయితే అయిపోనట్టు కాదని, ఇప్పటి నుంచే అసలు జీవితం ఆరంభమవుతుందని వివరించారు. రాష్ర్ట విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... రాష్ర్టపతి ముర్ము జీవిత ప్రయాణం విద్యార్థులకు ఒక ప్రేరణ కావాలని చెప్పారు. ఎక్కడో గిరిజన గ్రామంలో పుట్టి విద్యను అభ్యసించి, ఉపాధ్యాయురాలిగా, శాసన సభ్యురాలిగా, గవర్నర్‌గా, ఇప్పుడు భారత ప్రథమ మహిళగా మనందరి ముందుకొచ్చారని తెలిపారు. మారుతున్న సాంకేతికతను అందింపుచ్చుకుని ఉపాధి పొందేవారిలాగా కాకుండా ఉపాధినిచ్చేవారిలాగా ఎదగాలని సూచించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తొలి స్నాతకోత్సవం చరిత్రలో ఎప్పుడు గుర్తుండిపోయే అంశమని చెప్పారు. ఈ విశ్వవిద్యాలయానికి మంచి పేరు సాధించే విధంగా మీరందరూ కృషి చేయాలని సూచించారు. స్నాతకోత్సవం సందర్భంగా విశ్వవిద్యాలయం ప్రగతిని వైస్ ఛాన్స్‌లర్ ఎస్‌ఎ.కోరి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో పాటు కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)