ప్రజాశక్తి - పెద్దవడుగూరు (అనంతపురం జిల్లా) : పంటల కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఓ యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాఘవేంద్రప్ప కథనం ప్రకారం... పెద్దవడుగూరుకు చెందిన సావిత్రమ్మ, సాంబశివారెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు తన కుటుంబంతో బెంగుళూరులో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు అశోక్ కుమార్‌రెడ్డి (32) తన భార్యతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటూ కుటుంబ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఆయన తనకున్న 18 ఎకరాలతో పాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని పది ఎకరాల్లో మిర్చి, మిగిలిన భూమిలో పత్తి పంట సాగుచేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంతో పాటు హెచ్‌ఎల్‌సి కాలువలకు సాగునీరు సక్రమంగా సరఫరా కాక వేసిన పంటలు ఎండుదశకు చేరడమే కాకుండా పంటదిగుబడులు రాలేదు. ఎకరాకు రూ.రెండు లక్షల మేరకు ఖర్చు పెడితే కనీసం పెట్టుబడులు తిరిగి రాకపోగా తీవ్రంగా నష్టపోయారు. పంట సాగు కోసం దాదాపు రూ.16 లక్షల వరకు అప్పులు చేశారు. పంట చేతికందకపోవడంతో చేసిన అప్పులు తీర్చడం కష్టమైంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పొలం వద్దకెళ్లి పురుగుల మందు తాగారు. అటుగా వెళ్లిన వారు గుర్తించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
అప్పులబాధతో యువరైతు ఆత్మహత్య
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 30, 2026, 10:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)