ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 134 సినిమాల పాటల యాజమాన్య హక్కులకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో . ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు యథాతథంగా కొనసాగనున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో గతంలో జారీ చేసిన మధ్యంతర నిషేధాజ్ఞను ఎత్తివేయాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు పూర్తిగా తిరస్కరించింది.
ఈ వివాదంలో ప్రముఖ సంగీత సంస్థ 'సారేగామా' రంగంలోకి దిగి, ఆ 134 చిత్రాల్లోని పాటలపై పూర్తి కాపీరైట్ హక్కులు తమకే ఉన్నాయని, తాము చట్టబద్ధంగానే వాటిని పొందామని కోర్టుకు తెలిపింది. మరోవైపు, సదరు సినిమాలకు తాను స్వరపరిచిన పాటలపై మరెవరికో హక్కులు ఉండటం ఏంటని, వాటిపై తనకు కూడా పూర్తి అధికారాలు ఉంటాయని ఇళయరాజా గట్టిగా వాదిస్తున్నారు. ఈ కాపీరైట్ అంశంపై ఇరు పక్షాల మధ్య గత కొంతకాలంగా న్యాయపోరాటం నడుస్తోంది. మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాలన్న ఇళయరాజా అప్పీల్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ఆదేశాలను ఎత్తివేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. ఈ కాపీరైట్ వివాదంపై పూర్తిస్థాయి విచారణ జరిగి, తుది తీర్పు వెలువడే వరకూ ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులే కొనసాగుతాయని వెల్లడించింది.







కామెంట్‌లు (0)