mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థి సమస్యలపై సిజెపికి మద్దతుగా సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరశన

2 రోజుల క్రితం

Sonam Wangchuk joins CJP protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 02:47 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- జంతర్ మంతర్ వద్ద నీటి, పారిశుధ్య సౌకర్యాలను నిలిపివేసిన ఢిల్లీ పోలీసులు

- రైతుల గృహ నిర్బంధం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పరీక్షలలో అవకతవకలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) చేపట్టిన నిరసనకు మద్దతుగా పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆదివారం జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు ఈ నెల 20 నుంచి ప్రారంభమైన సిజెపి ఆందోళన ఆదివారం తొమ్మిదో రోజూ కొనసాగింది. తొలుత వాంగ్‌చుక్, సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే. సిజెపి ప్రతినిధులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం జంతర్ మంతర్ వద్దకు చేరుకుని రెండు నిమిషాల మౌనంతో దీక్ష ప్రారంభమైంది. వాంగ్‌చుక్ తన దీక్షను ప్రారంభించగానే, వందలాది మంది యువకులు, విద్యార్థులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు.

మద్దతుగా రైతులు...

ఆదివారం ఉదయం, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లకు చెందిన పలువురు రైతులు జంతర్ మంతర్‌కు చేరుకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. రైతులను, నాయకులను గృహ నిర్బంధం చేశారు. ఇటువంటి చర్యలు సరికాదని సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే అన్నారు. ప్రభుత్వ తీరును ఆయన విమర్శించారు. వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌తో సహా పరీక్షా విధానంలో అవకతవకలపై జవాబుదారీతనం కోసం జరుగుతున్న ఈ నిరసనలో పాల్గొని మద్దతు తెలపాలని దీప్కే రైతులకు, విద్యార్థులకు, సంఘాలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య ఒక పరీక్షకే పరిమితం కాదని, విద్యా వ్యవస్థలో పారదర్శకత, విశ్వాసంపై ఉన్న విస్తృత ఆందోళనలను ఇది ప్రతిబింబిస్తోందని అభిజీత్ దీప్కే అన్నారు. ‘‘సోనమ్ వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను ప్రకటించిన తర్వాత ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద పారిశుధ్య సౌకర్యాన్ని నిలిపివేశారు. నీటి కనెక్షన్ లేదు. పరిశుభ్రతా చర్యలు లేవు’’ అని దీప్కే పేర్కొన్నారు. ‘‘పదేపదే విజ్ఞప్తి చేసినా, వాంగ్‌చుక్ వయస్సు, ఆరోగ్య సమస్యల గురించి చెప్పినా పోలీసులు సహకరించడం లేదు. ఇలాంటి ఇతర ప్రాథమిక సౌకర్యాలను కూడా నిలిపివేస్తారని అనుమానిస్తున్నాం. పోలీసులు ఏం చేస్తున్నారు?’’ అని అన్నారు. దేశ పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల విశ్వాసంపై తమకున్న తీవ్ర ఆందోళనలను తెలియజేయడమే తమ నిరసన లక్ష్యమని దీప్కే స్పష్టం చేశారు.

రాజస్థాన్ లో పాఠశాల యాజమాన్యం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అమైరా పుట్టినరోజు సందర్భంగా ఆమె కుటుంబం ఆందోళన వద్దకు వచ్చి సంఘీభావాన్ని తెలిపింది. జంతర్ మంతర్ లో ఆందోళన చేస్తున్న విద్యార్థుల కోసం అమైరా కుటుంబం ఆహారం తీసుకొచ్చింది. ఈ సందర్భంగా దీప్కే మాట్లాడుతూ “పాఠశాలలో వేధింపులకు గురైన తర్వాత ఆత్మహత్య చేసుకున్నప్పుడు అమైరా వయసు కేవలం తొమ్మిదేళ్లు. ఆ పాఠశాల రాజస్థాన్‌లోని అతిపెద్ద పాఠశాలల్లో ఒకటైన నీరజ మోడీ స్కూల్. ఎనిమిది నెలల తర్వాత కూడా, అమైరా కుటుంబం ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. అయినా, పాఠశాల యాజమాన్యంపైన గానీ, ప్రిన్సిపాల్‌పైన గానీ, ఉపాధ్యాయుడిపైన గానీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆదివారం అమైరా పుట్టినరోజు సందర్భంగా, సిజెపి ఆమెకు నివాళులర్పిస్తోంది. న్యాయం జరిగేంత వరకు ఆమె కుటుంబానికి అండగా ఉంటాం” అని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్