mh ad
మంగళవారం, 30 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సాహిత్య సంభాషణకు సమయం

1 రోజు క్రితం

literature
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 29, 2026, 06:00 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

20వ శతాబ్దం తెలుగు సాహిత్య చరిత్రలో అత్యంత కీలకమైనది. ఈ శతాబ్దంలోనే భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం వంటి ప్రధాన ధోరణులు ఆవిర్భవించి, సాహిత్యాన్ని కొత్త దిశలో నడిపించాయి. మార్పు లేనిదే మానవ చరిత్ర లేదన్నట్లే, ఆధునిక కవిత్వమూ నిరంతర మార్పును తన స్వభావంగా స్వీకరించింది. వాల్మీకి నుంచి ప్రారంభమైన భారతీయ కవిత్వ సంప్రదాయం ఆధునిక కాలంలో భావ, అభ్యుదయ కవిత్వాల ద్వారా సామాజిక చైతన్యానికి మరింత చేరువైంది.

ప్రస్తుతం కరుడుగట్టిన సంప్రదాయాలను అధిగమిస్తూ కొత్త కవిత్వం తన దారిని నిర్మించుకుంటున్న దశలో ఉన్నాం. అయితే ప్రగతిశీల సాహిత్యంలో ఉమ్మడి కార్యాచరణ తగ్గడం, భిన్న ధోరణుల వైపు రచయితలు విడివిడిగా ప్రయాణించడం గమనించాల్సిన అంశం. సమాజ మార్పును లక్ష్యంగా పెట్టుకున్న సాహిత్యానికి నిబద్ధత అవసరం. సమాజంలో మౌలిక మార్పులను ఆకాంక్షించే అభ్యుదయ రచయితలు తమ రచనల ద్వారా పురోగమన విలువలను బలపరుస్తూనే, ఉమ్మడి సాహిత్య ఉద్యమాలను నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్దేశంతోనే సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జూలై 11, 12 తేదీల్లో విజయవాడలో రెండు రోజుల సాహిత్య సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఐదు సెషన్లుగా జరిగే ఈ సమ్మేళనంలో కవిత్వ నిర్మాణం, వస్తు-శిల్పాలు, వర్తమాన సాహిత్యంలో వివిధ వాదాలపై డా. గుంటూరు లక్ష్మీనరసయ్య, డా. కోయి కోటేశ్వరరావు ప్రసంగించనున్నారు. ఈ శతాబ్ది ఆరంభం నుంచి ఆధునిక తెలుగు కవిత్వంలో అనేక ఉద్యమాలు, ధోరణులు ఆవిర్భవించాయి. వాటిలో కొన్ని నేటికీ సజీవ సాహిత్య ప్రవాహాలుగా కొనసాగుతున్నాయి. కవిత్వ నిర్మాణం, వస్తు-శిల్పాలపై చర్చలతో పాటు అస్తిత్వ ఉద్యమాలు, సామాజిక నేపథ్యం, జాతీయత, భాష, మాండలికం, ప్రాంతీయత, లింగభేదం, లైంగిక అస్తిత్వం వంటి అంశాలు ఆధునిక కవిత్వంలో ఎలా ప్రతిఫలిస్తున్నాయనే విషయంపై ఈ సమ్మేళనంలో విస్తృతంగా చర్చ జరగనుంది. ఇవి ప్రగతిశీల సాహిత్యానికి ఎంతవరకు దోహదపడుతున్నాయి? సమాజ పురోగమనాన్ని బలపరుస్తున్నాయా? లేక తిరోగమన ధోరణులకు అవకాశం కల్పిస్తున్నాయా? అనే ప్రశ్నలతో పాటు, అస్తిత్వ స్పృహ అవసరంపై కూడా భిన్న దృక్పథాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది.

ఈ సమ్మేళనంలోని మరో ప్రధాన సెషన్‌లో ‘సాహిత్య చరిత్ర – వివిధ దృక్పథాలు’ అంశంపై తెలకపల్లి రవి, ‘ప్రపంచీకరణ – ప్రతిఘటన సాహిత్యం’పై ఖాదర్ మోహియుద్దీన్ ప్రసంగించనున్నారు. నేడు చరిత్రతో పాటు సాహిత్య చరిత్రను కూడా వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మతతత్వ రాజకీయాలు చరిత్రను తమకు అనుకూలంగా మలచాలని చూస్తున్న ఈ సందర్భంలో, సాహిత్యం తన విమర్శనాత్మక దృష్టిని నిలబెట్టుకోవాల్సిన అవసరం మరింత పెరిగింది.

దేశంలో విద్వేష రాజకీయాలు, ఫాసిస్టు ధోరణులు బలపడుతున్న నేపథ్యంలో రచయితలు, కవులు తమ సామాజిక బాధ్యతను మరింత గంభీరంగా స్వీకరించాల్సిన అవసరం ఉంది. 1991 ఆర్థిక సంస్కరణల తర్వాత భారతీయ సమాజంలో చోటుచేసుకున్న మార్పులు, ప్రపంచీకరణ ప్రభావం, దానికి ప్రతిస్పందనగా వచ్చిన ప్రతిఘటన సాహిత్యం వంటి అంశాలపై ఈ సమ్మేళనంలో పరిశోధనాత్మక చర్చ జరగనుంది. యుద్ధాలు, సామ్రాజ్యవాద ప్రయోజనాలు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అసమానతలు వంటి సమకాలీన సమస్యల పట్ల సాహిత్యం ఎలా స్పందించాలి? రచయితలు తమ రచనల్లో వాటిని ఎంతవరకు ప్రతిబింబిస్తున్నారు? అనే ప్రశ్నలకు సమాధానాలు వెదికే ప్రయత్నంగా ఈ చర్చ ఉపయోగపడుతుందని ఆశించవచ్చు.

ఈ సమ్మేళనంలో మరో ప్రధాన ఆకర్షణ ‘సృజనకారుల స్వరం – మేమెందుకు రాస్తున్నాం?’ అనే చర్చావేదిక. ఈ వేదికలో వర్తమాన, వర్ధమాన కవులు, కథకులు తమ సాహిత్య ప్రయాణాన్ని, రచనల వెనుక ఉన్న అనుభవాలను, కవిత్వం, కథ, నవలల్లో వస్తు-శిల్ప వైవిధ్యాన్ని పంచుకోనున్నారు. ఈ చర్చల్లో మల్లిపురం జగదీష్, సిరికి స్వామి నాయుడు, సుంకర గోపాల్, అనిల్ డానీ, వైష్ణవి శ్రీ, కవిదాసు, కంచరాన భుజంగరావు, సాంబమూర్తి లండ, తంగిరాల సోనీ, పక్కి రవీంద్రనాథ్, నాస్తిక్, సింహాద్రి నాగశిరీష, వివి సుబ్బారావు, కేవి మేఘనాథ్ రెడ్డిలతో పాటు వేంపల్లి షరీఫ్, పాయల మురళీకృష్ణ, కట్ట సిద్ధార్థ, మెర్సీ మార్గరేట్, పుప్పాల శ్రీరామ్, సుబ్బు ఆర్వీ, బాలసుధాకర్ మౌళి, పల్లిపట్టు నాగరాజు, వావిళ్లపల్లి సృజన, వడ్లమూడి పద్మ తదితరులు పాల్గొంటారు.

కథాసాహిత్యానికి అంకితమైన సెషన్‌లో ‘తెలుగు కథ – సామాజిక చింతన’ అంశంపై అట్టాడ అప్పలనాయుడు, ‘కథా రచన మెళకువలు’పై మహమ్మద్ ఖదీర్ బాబు, ‘కవులు, రచయితలు – అధ్యయనం ఆవశ్యకత’పై ఆర్. సీతారాం ప్రసంగించనున్నారు. సమకాలీన కథాసాహిత్యంలో వస్తువు, శిల్పం, కథనరీతిలో వచ్చిన మార్పులు, జీవిత సంక్లిష్టతలను కథ ఎలా ఆవిష్కరిస్తోందనే అంశాలపై ఈ చర్చలు దృష్టి సారిస్తాయి. కథ ఇప్పుడు కేవలం ఒక సందేశాన్ని చెప్పే ప్రక్రియ మాత్రమే కాదు; మారుతున్న సమాజాన్ని, మనిషి అనుభవాలను, సంఘర్షణలను విభిన్న రూపాల్లో వ్యక్తీకరించే సృజనాత్మక ప్రక్రియగా విస్తరించింది. రచయిత వ్యక్తిత్వం, దృక్పథం, అనుభవాన్ని బట్టి కథా శిల్పం రూపుదిద్దుకుంటుందనే అవగాహనను కూడా ఈ చర్చలు మరింత బలపరుస్తాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సాహిత్య సమ్మేళనం ఆధునిక తెలుగు సాహిత్యంలో వస్తున్న కొత్త ఆలోచనలు, వ్యక్తీకరణలు, సవాళ్లు, అవకాశాలపై విస్తృత చర్చకు వేదిక కానుంది. కవులు, రచయితలు, విమర్శకులు, పరిశోధకులు, పాఠకులు ఒకే వేదికపై కలుసుకుని పరస్పర అనుభవాలను పంచుకోవడం ద్వారా సమకాలీన తెలుగు సాహిత్యానికి కొత్త దిశలను అన్వేషించే అవకాశం ఈ సమ్మేళనం కల్పిస్తుందని ఆశిద్దాం. జులై 11, 12 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి సాహిత్య సమ్మేళనంలో పాల్గొనవల్సిందిగా యువ, నవ రచయితలు, కవులకు సాహితీ స్రవంతి, మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం ఆహ్వానం పలుకుతున్నాయి.

సంప్రదింపులకు : 88868 22312, 94933 75447.

- కెంగార మోహన్

రాష్ట్ర అధ్యక్షులు, సాహితీ స్రవంతి

94933 75447

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్