దండకారణ్యంలో దట్టమైన అడవి మధ్య మానవ సంచారం లేని చోట ప్రశాంత వాతావరణంలో మంద్రంగా ''రాం, రాం'' అంటూ ధ్యానంలో మునిగివున్నాడు హనుమంతుడు. ఉన్నట్టుండి ''నాయనా ! హనుమా!'' అన్న పిలుపు వినపడింది. ఆనందంతో కళ్లు తెరిచి చూసేడు. ఎదురుగా స్వయంగా శ్రీరామచంద్రమూర్తి రూపంలో మహావిష్ణువు ఉన్నాడు.
''గుండెల్లో నీవే, ఇప్పుడు ఎదురుగా ప్రత్యక్షంగా నీవే రామా'' అంటూ పరవశం చెందాడు హనుమంతుడు.
''హనుమా! ఈ పరవశం నుండి బైటకు రావయ్యా, నీతో మాట్లాడదామనే వచ్చేను'' అన్నాడు రాముడు.
''ఆహా! ఏమి నా అదృష్టము'' అంటూ మళ్ళీ హనుమంతుడు పరవశంలోకి జారుకోబోతూంటే వారించేడు.
''చెప్పు స్వామీ! ఏమిటి మాట్లాడుదామనుకుని వచ్చేవు?'' అని హనుమ అడిగేడు.
అప్పుడు రాముడు ఇలా చెప్పేడు: '' భూగోళం మీద నా భక్తుల్లో చాలామంది గుండెల్లో రగులుతున్న మంటల సెగలు నాకు తగులుతున్నాయి నాయనా. నా పేరు మీద అయోధ్యలో ఆలయం నిర్మిస్తామని కొందరు ప్రకటించి వసూలు చేసిన వేల కోట్ల ధనం గల్లంతైందన్న వార్త భక్తుల హృదయాలను కకావికలు చేస్తోంది. నా భక్తులు అలా బాధ పడుతూంటే నేనేం చేయాలో తోచక ఇలా నీదగ్గరికి వచ్చేను నాయనా.''
''స్వామీ! నీవు సర్వజ్ఞుడివి. నీకు తెలియకపోవడం ఏమిటి చెప్పు? భక్తులను ఆదుకోవడంలో నిన్ను మించిన వేరే దైవం ఉన్నాడా? అలనాడు భద్రాచల రామదాసును ఆదుకోడానికి నువ్వే దిగివచ్చి రక్షించలేదా?'' అన్నాడు హనుమ.
''ఆ ఉదంతం వేరు నాయనా. అక్కడ ప్రభువులకు చెప్పకుండా, వారి అనుమతి పొందకుండా ప్రజాధనాన్ని రామాలయ నిర్మాణానికి కంచెర్ల గోపన్న ఖర్చు చేసేడు. అందుకే అతగాడిని చెరసాలలో పెట్టేరు. అప్పుడు నేనే వచ్చి ఆ తానీషా కు దర్శనమిచ్చాను, ఆ తానీషా నన్ను అడిగింది ఒకటే. 'దేవా! నా స్థానంలో నీవే ఇక్కడ గోల్కొండకు రాజుగా ఉండి వుంటే అప్పుడు ఏం చేసేవాడివి?' అని అడిగాడు. 'ప్రజాధనాన్ని కాపాడేవాడిని. దానిని దారి మళ్ళించిన వాడిని శిక్షించేవాడిని' అని నేను బదులిచ్చాను. 'మరి నేనిప్పుడు అదే కదా చేసింది' అని తానీషా అన్నాడు. అతగాడు చెప్పింది సబబే కదా. అందుకే మరి ఇంకేమీ చెప్పకుండా ఆలయం కోసం చేసిన ఖర్చును ఆయన ఖజానాకు జమ చేశాను, నా భక్తుడిని విడిపించుకున్నాను. ''
''మరింకేం స్వామీ? ఇప్పుడు కూడా రాజ్యాధినేతకు దర్శనమిచ్చి భక్తుల ఆవేదనకు పరిష్కారం చూపరాదా?'' అన్నాడు హనుమ.
''అయ్యో! నీకర్థం కావడంలేదు లాగుంది. ఇప్పుడు ఎంత ప్రజాధనం వసూలైందో తెలియదు, అందులో ఎంత దారి మళ్ళిందో తెలియదు. పైగా ఎవరినీ చెరసాలలో పెట్టలేదు. అన్నింటికీ మించి ఇప్పుడు ఘోష పెడుతున్న భక్తులు కంచెర్ల గోపన్న అడిగినట్టు చెర విడిపించమని అడగడం లేదు కదా? ధనాన్ని దారి మళ్ళించినవాళ్ళని చెరలో ఎందుకు పెట్టడం లేదని కదా వాళ్ళు కోరుతున్నారు?'' అని వాపోయాడు రాముడు.
''బాధపడకండి స్వామీ, ఈ విషయాన్నే రాజ్యాధినేతను అడగవచ్చు కదా?'' అన్నాడు హనుమ.
''ఆ పెద్దమనిషి మీడియా ప్రతినిధులకే కాదు, నాకు కూడా సమాధానం చెప్పడం లేదు. వ్యూహాత్మక మౌని అతగాడు. ఏం చెయ్యమంటావు చెప్పు?'' అని అడిగాడు రాముడు.
హనుమంతుడు కొంతసేపు తీవ్రంగా ఆలోచించి ఇలా చెప్పాడు:
''స్వామీ! ఈ విషయంలో తమరు కోపగించుకోకుండా నిదానంగా కొంత అవలోకనం చేసుకోవడం అవసరమేమోనని నాకు అనిపిస్తోంది. సదరు రాజ్యాధినేత, అతడి బృందం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ రామరాజ్యం స్థాపిస్తామని, రామ మందిరం నిర్మిస్తామని రాజకీయంగా లాభం పొందుతూనే వున్నారు. ఆ సంగతి తమకు తెలుసు కదా''
''తెలుసునయ్యా, ఆ రెండూ మంచివే కదా?'' అన్నాడు రాముడు.
''అవి మంచివే, కాని ఆ పేరుతో ఇక్కడ ఏమేమి జరుగుతోందో తమరు చూస్తున్నారా? ఇక్కడ ఏమేమి జరిగినా పైనున్న రాముడు చూసుకుంటాడులే అన్న భరోసాతోనే కదా కోట్లాది భక్తులు వోట్లేస్తూ వస్తున్నారు? అందుకే కదా కోట్ల ధనాన్ని విరాళాలుగా కుమ్మరించారు? ఇప్పుడేమో ఆలయం పేరుతో పోగైన ధనంలో చాలా భాగం కైంకర్యం అయిందన్న వార్తలు బైటకు పొక్కాయి. ఆ వార్తలు తప్పు అని ఎవరూ ఖండించలేదు. మరి అటువంటప్పుడు ఆ రాజ్యాధినేతకే కదా నోరు విప్పి వాస్తవాలు చెప్పవలసిన బాధ్యత ఉంది? ఇతర సందర్భాల్లో చాలాసార్లు ''భక్తుల మనోభావాలు గాయపడ్డాయి'' అంటూ రెచ్చిపోయిన ఆ రాజ్యాధినేత కాని, అతడి భజన బృందం కాని ఇప్పుడు కోట్లాదిమంది భక్తుల మనోభావాలు, పెట్టుకున్న నమ్మకాలు దారుణంగా దెబ్బ తినిపోతే నోళ్ళు ఎందుకు మెదపడం లేదు?'' అన్నాడు హనుమ.
''నిజమేనయ్యా. చూస్తూంటే నేను కాస్తంత ముందే పట్టించుకుని వుండాల్సిందేమో ననిపిస్తోంది. మరి ఇప్పుడు నేనేం చేయాలి?'' మళ్ళీ అడిగాడు రాముడు.
''స్వామీ! తమకు తెలియనిదేముంది? అప్పుడు నీ భక్తుడు కంచెర్ల గోపన్నను చెర నుండి విడిపించి భక్తపరాయణుడవని పించుకున్నావు. ఇప్పుడు నీ పేరు చెప్పుకుని నీతో సహా అందరినీ మోసం చేస్తున్న పెద్దమనుషుల చెరలో, వాళ్ళ పెత్తనంలో కోట్లాదిమంది చిక్కుకుపోయి అలో లక్ష్మణా అంటున్నారు. వాళ్ళనందరినీ ఈ మోసకారుల పెత్తనపు చెర నుండి వెంటనే విముక్తి చెయ్యి స్వామీ'' అన్నాడు హనుమ.
''అందుకేనయ్యా హనుమా! హనుమంతుడు పరమ జ్ఞాని అని విజ్ఞులంతా నిన్ను కొనియాడేది ఇందుకే. సత్యాన్ని సూక్ష్మంగా గ్రహించావు. అయితే నువ్వు తెలుసుకోవలసినది మరొకటి ఉంది సుమా. తాము ఇరుక్కున్న చెర నుండి బైట పడే తాళం కూడా నా కోట్లాది భక్తుల వద్దే ఉంది కదా! దానిని ఉపయోగించాలన్న సద్బుద్ధిని వాళ్ళకి వెంటనే ప్రసాదిస్తాను.'' అన్నాడు రాముడు.
''ఆగండి స్వామీ! ఈ తాళం మహిమ నీ భక్తకోటికి పూర్తిగా తెలియకపోయినా, ఆ మోసకారులకి బాగా తెలుసు. అందుకే ఇప్పుడు చాలామంది నుండి ఆ తాళాన్ని ఊడలాక్కునేందుకు చూస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ అని దానికో ముద్దుపేరు పెట్టారు. నీ రెండో పేరు రహీమ్ అని కదా భక్త కబీరు చెప్పేడు. ఆ రహీమ్ పేరుతో నిన్ను ఆరాధించేవారి ఓట్లకు, మరికొంతమంది ఓట్లకు కూడా ఎసరు పెడుతున్నారు. అందుచేత ఈ విషయంలో కూడా తగు జాగ్రత్త పడేలా నీ భక్త కోటికి జాగరూకత ప్రసాదించు స్వామీ. నీ పేరు చెప్పుకుని గద్దెనెక్కి మోసం చేస్తూ నువ్వు ప్రజలకి బోధించిన విలువలకే ఎసరు పెడుతున్న ప్రబుద్ధులకి తగిన శిక్ష నీ భక్తులు విధించేట్టు అనుగ్రహించు రామా!'' అన్నాడు హనుమ.
''తథాస్తు'' అన్నాడు రాముడు.
సుబ్రమణ్యం









కామెంట్‌లు (0)