డేటా సెంటర్ కథనం -5
పక్కనే డేటా సెంటర్ ఉన్నా ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం అపోహే
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : డేటా సెంటర్లు అంతర్జాతీయ క్లౌడ్ సేవలు, భారీ కార్పొరేట్ కంపెనీల కోసం ప్రత్యేక హై-స్పీడ్ ఫైబర్ నెట్‌వర్క్‌లను కలిగి ఉంటాయి తప్ప గృహాలకు ఇంటర్నెట్ అందించే బ్రాండ్‌బాండ్ ఒకటి కాదు. సాధారణ ప్రజలు ఉపయోగించే రూ. 399 నెలవారీ బ్రాడ్‌బాండ్ ప్లాన్‌ల నెట్‌వర్క్ రూటింగ్ పూర్తిగా వేరుగా ఉంటుంది. మీ ఇంటి పక్కనే అతిపెద్ద డేటా సెంటర్ ఉన్నప్పటికీ, మీ ఇంటర్నెట్ వేగం పెరగదు. మీ బ్రాడ్‌బాండ్ వేగం అనేది జియో, ఎయిర్‌టెల్ లేదా ఇతర స్థానిక కేబుల్ ఆపరేటర్లు మీ వీధిలో వేసిన ఫైబర్ వైర్లు, రౌటర్ల సామర్థ్యంపై మాత్రమే ఆధారపడి ఉంటుందని అంతర్జాతీయంగా రుజువైన వాస్తవమని టెలికం సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. ముంబై, చెన్నైలలో ఇంటర్నెట్ ల్యాండింగ్ స్టేషన్లు ఉన్నప్పటికీ, దేశంలోని మిగిలిన నగరాల్లోని ప్రజలు కూడా అదే స్థాయి ఇంటర్నెట్ వేగాన్ని పొందుతున్నారు. కాబట్టి, విశాఖ తీరానికి కొత్తగా అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుల్స్ వచ్చినంత మాత్రాన గృహా వినియోగానికి పెద్దగా ఉపయోగం ఉండదు.
ప్రజా వనరుల కేటాయింపులో ఇష్టారాజ్యం
ప్రజలకు సంబంధించిన భూమి, ఇతర వనరులను ముక్కలు ముక్కలు చేసి కార్పొరేట్లకు కట్టబెట్టే చర్యలను రాష్ర్టంలోని ‘కూటమి’ ప్రభుత్వం చేపట్టింది. ఉమ్మడి విశాఖ జిల్లా, దాని సమీప ప్రాంతాల్లో వందల ఎకరాలను గూగుల్-అదాని, రిలయన్స్‌కు డేటా సెంటర్ల పేరిట కట్టబెడుతోంది. అనుమతులను కూడా పై ముగ్గురు కార్పొరేట్లకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో చంద్రబాబు ఇచ్చేశారు. డేటా సెంటర్లకు సోలార్ వాడొచ్చంటూ తాను చేసిన వీడియోలో విశాఖ ఎంపి భరత్ తెలిపారు. ఆరు గిగావాట్ డేటా సెంటర్‌కు 30 గిగావాట్ సోలార్ ప్లాంట్ అవసరం అవుతుంది. ఒక గిగావాట్ పవర్ కావాలంటే ఐదు గిగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. ఒక గిగావాట్ పవర్ సోలార్ ప్లాంట్‌కు ఐదు నుంచి ఆరువేల ఎకరాలు కావాల్సి ఉంటుంది. ఈ లెక్కన 30 గిగావాట్ సోలార్ ప్లాంట్‌కు 1.80 లక్షల ఎకరాల భూమి కావాలి. ఎలాంటి ప్రయోజనం లేని ఈ డేటా సెంటర్లకు భూములను కట్టబెడుతున్నారు. అలాగే గూగుల్ డేటా సెంటర్‌కు 1.2 గిగావాట్ సామర్థ్యం గల డీజిల్ జనరేటర్ బ్యాకప్‌కు అనుమతులు ఇచ్చారు. దీనికోసం లక్షల లీటర్ల డీజిల్ నిల్వ అవసరం ఉంటుంది. అంటే ఒక పూర్తి వ్యవసాయ సీజన్‌లో 20 వేల నీటిపంపులను నడపడానికి సరిపడే స్థాయి ఇది. విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు పనిచేసే భారీ డీజిల్ జనరేటర్ల వల్ల భారీ శబ్ధ కాలుష్యం ఏర్పడుతుంది.
వెల్లడైన కార్పొరేట్ల సేవ
డేటా సెంటర్లు ప్రధానంగా కార్పొరేట్ల సేవకే పనిచేస్తాయ న్నది స్పష్టంగా తెలుస్తోంది. వీటికిచ్చిన సబ్సిడీలు, పన్ను రాయితీలు మొత్తం రూ.44 వేల కోట్లు. 2050 దాటాక కూడా రాష్ట్రానికి పెట్టుబడిపై ఆశించిన రాబడి ఉండదన్నది నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. డేటా సెంటర్లను అత్యంత ప్రాధాన్యత, క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ర్టక్చర్ గా ‘కూటమి’ ప్రభుత్వం వెల్లడి చేస్తూ విశాఖ నగరానికి నీరు ఇవ్వాలా ? డేటా సెంటర్లకు నీరు ఇవ్వాలా ? అనే స్థితి వస్తే డేటాసెంటర్లకే అన్న రీతిలో ప్రభుత్వం వీడియోల ద్వారా వాదన వెల్లడించడం చూస్తే కార్పొరేట్ల సేవలో తరిస్తోందన్నది ఇట్టే అర్థమవుతుంది. పైగా డేటా సెంటర్ల ఏరియా అంతటా కొన్ని వందల మీటర్ల వరకూ ఉష్ణోగ్రతలు రెండు నుంచి నాలుగు డిగ్రీలు అదనంగా పెరుగుతాయని ఎపి పిసిబి అధికారులే స్వయంగా చెబుతున్నారు.
లాభాలు దోచే సరుకుగా డేటా సెంటర్లు
పరిశ్రమలు తమ రోజువారీ డిజిటల్ కార్యకలాపాలు, ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్ కోసం వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజంలో సమాచార వ్యవస్థ కార్పొరేట్ల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. సమాచారంపై లాభాలు సంపాదించే వస్తువుగానే కార్పొరేట్ వర్గాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ‘కూటమి’ ప్రభుత్వం అందుకు సంపూర్ణంగా సహకరిస్తోంది. సమాచారం సరుకుగా మారిపోయిన తరుణంలో దీన్ని కార్పొరేట్‌లు అమ్మేసి ప్రయోజనం పొందడానికే చూస్తున్నారు. ‘తిలాపాపం తలాపిడికెడు’ అన్న రీతిలో కార్పొరేట్లతో వారు కలసిపోయి డేటా సెంటర్ల భారాలను ప్రజలపైకి రుద్దుతున్నారు.









కామెంట్‌లు (0)