నేటికీ నగరాల్లో సైతం మానవుల మలాన్ని చేతితో శుభ్రం చేసే పరిస్థితి కొనసాగడం అత్యంత అమానవీయం. ఈ పని చేసే వారికి ఎలాంటి ఉద్యోగ భద్రత లేని కాంట్రాక్టు పద్ధతిలో ఉండడం ఇంకా దారుణం. దీనికి మించి వీరిలో అత్యధికులు దళితులే కావడం మరింత ఘోరం. వీరిని పర్మనెంటు చేయాలని, మాన్యువల్ స్కావెంజింగ్ రద్దు చేయాలని ఎంత మొర పెట్టుకున్నా ఫలితం మాత్రం శూన్యమే కాక, వీరిపై జులుం ప్రదర్శించడం, చులకనగా చూడడం పరిపాటిగా మారింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో 2021 నుండి జులై 2026 మధ్య కాలంలోనే 593 మంది కార్మికులు మురుగు కూపాల్లో ఊపిరాడక మరణించారని గణాంకాలు చెబుతున్నాయి. చేతితో సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే అమానుష పద్ధతికి తక్షణమే ముగింపు పలకాలని, పారిశుధ్య పనులను పూర్తిగా యాంత్రీకరించాలని ఇటీవల ఆ కార్మికులు మరణించిన కుటుంబ సభ్యులతో కలిసి జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నగరాలను శుభ్రంగా ఉంచే కార్మికుల జీవితాలే అభద్రతలో కూరుకుపోవడం మన పాలనా వ్యవస్థలోని తీవ్రమైన వైఫల్యం. ఈ పరిస్థితిలో మార్పు కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడానికే డిసెంబరు 1,2,3 తేదీలలో మరో సమరశీల పోరాటానికి కార్మికవర్గం సన్నద్ధమవుతోంది.
ఆర్థిక సరళీకరణ విధానాల తరువాత ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో శాశ్వత ఉద్యోగాల స్థానంలో కాంట్రాక్టు విధానం విస్తరించింది. దీనివల్ల ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, సామాజిక భద్రత కార్మికులకు దూరమయ్యాయి. శాశ్వత ఉద్యోగులతో సమానంగా లేదా అంతకంటే ప్రమాదకరమైన పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికులకు తక్కువ వేతనాలే దక్కుతున్నాయి. ఆరోగ్య బీమా, పెన్షన్, ఇతర ప్రయోజనాలు చాలా మందికి అందడం లేదు.
ప్రభుత్వాలు ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించాల్సిన బాధ్యతను కాంట్రాక్టర్లకు అప్పగించి చేతులు దులుపుకుంటున్నాయి. ప్రజాధనంతో నిర్వహించాల్సిన సేవల్లో కాంట్రాక్టర్ల లాభాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. వేతనాల చెల్లింపులో జాప్యం, సిబ్బంది కొరత, అధిక పని భారం వంటి సమస్యలు కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
పారిశ్రామిక వార్షిక సర్వే ప్రకారం, తయారీ రంగంలో కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పుడు 42 శాతం మంది ఉన్నారు. ఈ సంఖ్య 1999-2000 నాటి సంబంధిత సంఖ్య కంటే రెట్టింపు కంటే ఎక్కువ. పారిశుధ్యంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన కేంద్రీకృత డేటా లేదు. కానీ పూనే లోని ఫ్లేమ్ యూనివర్సిటీకి చెందిన ధమ్మా దర్శన్ నిగమ్-శీవా దుబే అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా నగరాల వారీగా ఉన్న గణాంకాలు 50 శాతం నుండి 80 శాతం వరకు కార్మికులు కాంట్రాక్ట్ కిందే ఉన్నారని చూపుతున్నాయి. కాంట్రాక్ట్, సాధారణ కార్మికుల మధ్య వేతన వ్యత్యాసం చాలా గణనీయంగా ఉంది. దీనికంటే ఆశ్చర్యకరంగా పారిశుధ్య రంగంలో కుల వ్యవస్థ ప్రభావం నేటికీ కొనసాగుతోంది. ఈ పనుల్లో ఎక్కువగా దళితులు, ఇతర అట్టడుగు సామాజిక వర్గాలవారు పని చేస్తుండగా, కాంట్రాక్టు వ్యవస్థలో ఆర్థిక, రాజకీయ పలుకుబడి ఉన్నవారికి అధికారం, లాభాలు దక్కుతున్నాయి. బ్రిటిష్ కాలం నాటి కార్మిక నియామక పద్ధతులు, ఫ్యూడల్ కాలపు సేవా సంబంధాలు ఆధునిక కాంట్రాక్టు వ్యవస్థలో కుల, ఆర్థిక దోపిడీ కొత్త రూపాల్లో కనిపిస్తున్నాయి.
ఉదాహరణకు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 4800 మంది పారిశుధ్య కార్మికులుంటే, వారిలో 3800 మంది అంటే 80 శాతం మంది దళితులే. వీరి వేతనాలు కూడా ఇదే పని చేసే శాశ్వత కార్మికుని వేతనంలో సగం కంటే కూడా తక్కువగా ఉంది. శాశ్వత కార్మికుని ప్రారంభ వేతనం 30 వేల రూపాయల పైగా ఉండగా, వీరి వేతనం 15 వేల రూపాయలు మాత్రమే. సిఐటియు సారథ్యంలో చేసిన కృషి ఫలితంగా మరో ఆరు వేల రూపాయలు హెల్త్ అలవెన్సుగా సాధించుకున్నారు.
కులం ఆధారంగా కొన్ని వర్గాలకే పారిశుధ్య పనులు పరిమితం కావడం సామాజిక సమానత్వానికి విరుద్ధం. మానవ మలమూత్రాలను తొలగించడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం వంటి అత్యంత ప్రమాదకరమైన పనులను నిర్దిష్ట సామాజిక వర్గాల బాధ్యతగా చూడటం అమానవీయం. పారిశుధ్య కార్మికుల శ్రమపై ఆధారపడే సమాజం, వారికి కనీస గౌరవం, భద్రత కల్పించడంలో విఫలమవుతోంది.
స్వచ్ఛ భారత్ మిషన్, ఘన వ్యర్థాల నిర్వహణ, యాంత్రికీకరణ వంటి కార్యక్రమాలు పారిశుధ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా కార్మికుల ఆరోగ్యాన్ని, భద్రతను కాపాడాలి. కానీ చెత్తను ముందుగానే వేరు చేయకపోవడం, తగిన యంత్రాలు అందుబాటులో లేకపోవడం, నిర్వహణలో లోపాలు వంటి సమస్యల భారాన్ని కార్మికులపై మోపుతున్నారు. సాంకేతికత కార్మికుల శ్రమను తగ్గించి, వారి ప్రాణాలను రక్షించాలి. వారిని చౌక శ్రమగా ఉపయోగించుకునే సాధనంగా మారకూడదు. కానీ, యంత్రాలు అందుబాటులో ఉన్నప్పటికీ, మురుగు కాలువల్లోకి కార్మికులను దింపడం, రక్షణ పరికరాలు లేకుండా ప్రమాదకర పనులు చేయించడం కొనసాగుతోంది. ఇది ఆధునీకరణ లక్ష్యాలకే విరుద్ధం.
ప్రజలకు పారిశుధ్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదైతే, ఆ సేవలను అందించే కార్మికుల భద్రతకు బాధ్యత ఎవరిది? అన్నది ఇక్కడ కీలకమైన ప్రశ్న. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యతను వదులుకోలేదు. కాంట్రాక్టు సంస్థల పని తీరును పర్యవేక్షించడం, వేతనాలు సకాలంలో అందేలా చూడటం, కార్మికుల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యతగానే ఉంటుంది.
చారిత్రకంగా కులం, వృత్తి మధ్య ఏర్పడిన సంబంధాలు ఆధునిక కాంట్రాక్టు విధానంలోనూ కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి. ‘కాంట్రాక్టర్ రాజ్’ అనేది కేవలం ఉద్యోగ నియామక విధానం కాదు. ప్రభుత్వ బాధ్యతను బలహీనపరుస్తూ, కార్మికుల శ్రమను చౌకగా మార్చి, కుల అసమానతలను కొనసాగించే వ్యవస్థ. దానిని మార్చాలంటే కార్మికుల హక్కులను పరిరక్షించే విధానాలను అమలు చేయాలి. అందువల్ల ఉద్యోగ క్రమబద్ధీకరణ అనేది కేవలం వేతనాల సమస్య కాదు. కుల ఆధారిత వృత్తి అసమానతను సవాలు చేసే సామాజిక న్యాయ పోరాటం కూడా.
కార్మిక హక్కులే పారిశుధ్య సంస్కరణలకు పునాది. కాంట్రాక్టు కార్మికుల సర్వీసులను క్రమబద్ధీకరించాలి. ప్రభుత్వ ప్రత్యక్ష నియామకం, వేతన చెల్లింపు వ్యవస్థలోకి తీసుకురావాలి. సకాలంలో వేతనాలు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, సామాజిక భద్రత కల్పించాలి. కార్మిక చట్టాలను కఠినంగా అమలు చేయాలి. మురుగు కాలువలు, భూగర్భ డ్రైనేజీల శుభ్రతలో యాంత్రిక పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రమాదకర పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టకుండా సాంకేతికతను ఉపయోగించడం సమాజ పురోగతికి నిదర్శనం. అన్నింటికంటే, పారిశుధ్య పనులను కులంతో ముడిపెట్టే సామాజిక దృక్పథాన్ని మార్చాలి. కార్మికుల గౌరవం, భద్రత, సమాన హక్కులు మాత్రమే ఆధునిక నగరాల పరిశుభ్రతను కొలమానంగా ఉండాలి.
- వ్యాసకర్త: ఎ. అజ శర్మ, సెల్: 9490098790







కామెంట్లు (0)