డేటా సెంటర్ కథనం-3
పూడిమడక డిశాలినేషన్ ప్లాంట్‌పై ఎన్నో సందేహాలు
సిఆర్‌జెడ్ నిబంధనలు తుంగలోకి..
తగ్గిపోనున్న సముద్ర ఆక్సిజన్
మత్స్యసంపద, సముద్ర జీవుల మనుగడకు తీవ్ర ముప్పు
స్పందించని ప్రభుత్వం
కొద్ది రోజుల క్రితం డిప్యూటీ ముఖ్యమంత్రి, రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి కూడా అయిన పవన్ కల్యాణ్ గోదావరి నది కాలుష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ కాలుష్యపు నీళ్లు అంతా అంతిమంగా సముద్రంలోనే కలుస్తాయన్న అంశం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదొక్కటే కాదు. ఈ ప్రాంతంలో విచ్చలవిడిగా ఏర్పాటవుతున్న ఫార్మా పర్రిశమలు కూడా సముద్రజలాలను పెద్ద ఎత్తున కలుషితం చేస్తున్నాయి. ఫలితంగా సముద్రంలోని చేపలు గణనీయంగా తగ్గుతున్నాయంటూ మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది వారి జీవనోపాధిని తీవ్రంగా దెబ్బ తీస్తోంది. ఫార్మా కంపెనీల కాలుష్య నివారణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలు సైతం అమలుకు నోచుకోవడం లేదు. సముద్ర కాలుష్యంపై ఆంధ్ర విశ్వవిద్యా లయం అధ్యయన నివేదికలను. ఈ ప్రాంత పర్యారణ వేత్తలు, మేధావులు, నిపుణులు చేస్తున్న హెచ్చరికలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తాజాగా ఉమ్మడి విశాఖ జిల్లాల్లో పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న పరిశ్రమలు ఈ సమస్యను మరింత తీవ్రం చేయనున్నాయి. వాటిలో అనకాపల్లిలోని పూడి మడకలో నిర్మిస్తున్న భారీ డి శాలి నేషన్ ప్లాంటు ఒకటి! సముద్ర జీవావరణంపై ప్రభావం చూపే ఈ ప్లాంటుకు సంబంధించి న అన్ని అంశాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. దీంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో : అనకాపల్లిలోని పూడిమడకలో నిర్మిస్తున్న భారీ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లో భాగంగా 100 ఎంఎల్‌డి సామర్థ్యంతో రూ.1200 కోట్లతో నిర్మించబోయే డిశాలినేషన్ ప్లాంట్‌కు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు పూర్తిచేసింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్‌ను ఎన్‌టిపిసి త్వరలో ఏర్పాటు చేయనుంది. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల సమీపంలో రూ.1.85లక్షల కోట్ల భారీ పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం డిశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటు ప్రతిపాదన ముందుకు తెచ్చారు. ఈ ప్లాంట్ కోసం అవసరమౌతాయని అంచనా వేసిన రూ.1200 కోట్ల నిధులను ప్రైవేటు పెట్టుబడిదారులు సమకూరుస్తారా ? ప్రభుత్వమే ఇస్తుందా? అన్నది నేటికీ వెల్లడికాలేదు. నిర్మాణ గడువూ ప్రకటించలేదు. పర్యావరణ అనుమతులు ఇంతవరకూ రాలేదు. అయినప్పటికీ సన్నాహాలు జోరుగా సాగుతుండటం గమనార్హం. ఈ ప్రాజెక్టు పై విశాఖ ఎంపి శ్రీభరత్ ఇటీవల మాట్లాడుతూ పూడిమడకలో ప్రతిపాదిత 100 ఎంఎల్‌డి డిశాలినేషన్ ప్లాంట్‌కు నిరంతరాయంగా 14-21 మెగావాట్ల విద్యుత్ అవసరమన్నారు. దీన్ని ఎక్కడ నుంచి తెస్తారన్నది ఆయన వెల్లడించలేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్ల నిర్వాహకులు ఈ డిశాలినేషన్ ప్లాంట్ నిర్వాహకు ల నుంచి వాణిజ్య రేటుకు నీరు కొనుగోలు చేస్తారని శ్రీభరత్ మరో మాటగా చెప్పారు. ఒక కిలోలీటర్ డిశాలినేటెడ్ నీటి ధర ఎంత ? అనేది మాత్రం ఆయన చెప్పలేదు. సాధారణ పారిశ్రామిక నీటి ధర కిలోలీటరుకు రూ.30-40లు. డిశాలినేషన్ నీరు కనీసం రూ.90 నుంచి రూ.150లుగా ఉంటుందని సమాచారం. విశాఖకు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి ఇఎఎస్.శర్మ డిశాలినేషన్ ప్రాజెక్టుపై ఇటీవల స్పందిస్తూ 100 ఎంఎల్‌డిల ప్లాంట్ ఆరు గిగావాట్ల డేటా సెంటర్ల అవసరాలను ఎలా తీరుస్తుందని ప్రశ్నించారు. దానికీ ప్రభుత్వం నుండి స్పందన లేదు,
డిశాలినేషన్‌లో ఏం చేస్తారు?
పారిశ్రామిక అవసరాల కోసం.. హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకుగానూ డి-మినరలైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి సముద్రపు నీటిని మంచినీరుగా మార్చి పరిశ్రమలకివ్వడమే డిశాలినేషన్ లక్ష్యం. సముద్రపు నీటిలోని ఇసుకను రివర్స్ ఆస్మాసిస్ (ఆర్‌ఒ) పద్ధతి ద్వారా వడపోసి మంచినీరుగా మారుస్తారు.
ముఖ్యమైన సవాళ్లపై ప్రభుత్వం అశ్రద్ధ
డిశాలినేషన్ ప్రాజెక్టు అచ్యుతాపురం, రాంబిల్లి, పూడిమడక తీర ప్రాంతానికి కొత్త సవాళ్లను తెచ్చిపెట్టబోతుంది. ‘ఆ ప్రాంత ప్రజలు, మత్స్యకారులకేగాక సముద్ర సంపదల మనుగడనే ప్రశ్నార్థకం చేయబోతుంది’ అని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో తీరప్రాంత జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుంది. నీటిలోని ఆక్సిజన్ స్థాయిలు తగ్గి చేపలు, ఇతర సముద్ర జీవుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. సింగపూర్, థాయిలాండ్, నెదర్లాండ్స్ అనుభవాలు ఈ విషయాన్నే పట్టిచూపుతున్నాయి. ఇవేమీ పరిశీలించకుండా ప్రాజెక్టుకు ప్రతిపాదన చేస్తున్నారా? ఈ ప్రాంత ప్రజల మనుగడ పాలకులకు అవసరం లేదా? అన్న చర్చ జరుగుతోంది. సముద్రపు నీటిని తోడుకోవడానికి చేసే ప్రకియలో.. శుద్ధిచేసిన నీటిని బయటకు పంపించే క్రమంలో భారీ పైప్‌లైన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తీరప్రాంత నియంత్రణ మండలి (సిఆర్‌జెడ్) పరిధిలో ఎలాంటి నిర్మాణాలూ జరగకూడదని కాలుష్య నియంత్రణ మండలి నివేదికలు చెబుతున్నాయి. వీటిని తుంగలో తొక్కి నిర్మాణాలు చేస్తారా? అన్న ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. వీటికి కూడా ప్రభుత్వం నుండి సమాధానం రాకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.









కామెంట్‌లు (0)