సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనిర‌స‌న రాజ్యాంగ హ‌క్కు

1 గంట క్రితం

sc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 28, 2026, 12:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • పోలీసులు లాఠీచార్జ్ స‌మ‌ర్థ‌నీయం కాదు

  • పార్ల‌మెంట్ మార్చ్‌లో *పోలీస్ చ‌ర్య‌ల‌పై సుప్రీం

ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో : భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కల్పిస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవ‌లం ఆందోళ‌న జ‌రుగుతున్నంత మాత్రాన పోలీసులు లాఠీచార్జ్ చేయ‌డం స‌మ‌ర్థ‌నీయం కాద‌ని న్యాయ‌స్థానం పేర్కొంది. ప‌రీక్షా పత్రాల లీకేజీకి నిర‌స‌న‌గా విద్యార్థుల ఆందోళ‌న‌లో భాగంగా జులై 20న పార్ల‌మెంట్ మార్చ్‌లో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనపై స్వతంత్ర విచారణ జరపాలని, బాధ్యులైన పోలీసులుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ఘటనపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ జ‌య‌మ‌ల్య బాగ్చి, వి మోహ‌న‌తో కూడిన ధ‌ర్మాస‌నం సోమ‌వారం విచారించింది. ‘శాంతియుత, చట్టబద్ధమైన నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా కల్పించిందని. కేవలం ఆందోళన జరుగుతున్నంత మాత్రాన లాఠీచార్జ్ జరగాలని అర్థం కాదు. మితిమీరిన బలప్రయోగం జరిగిందన్న ఏ ఆరోపణనైనా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పరిశీలించాలి’ అని సిజెఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ సమస్య ఢిల్లీకే పరిమితం కాదని, నిరసన ప్రదర్శనల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఏకరీతి నియమాలు అవసరమని సూచించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఆత్మ సంయమనం ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. అలాగే నిరసనకారులు తప్పనిసరిగా క్రమశిక్షణ పాటించాలని అన్నారు. నిరసనల సమయంలో హింస కూడా ఏమాత్రం ఆమోద‌యోగ్యం కాద‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. శాంతియుత నిర‌స‌న‌కారుల‌పై విచ‌క్ష‌ణార‌హిత బ‌ల‌ప్ర‌యోగం జ‌ర‌గ‌కుండా చూసుకుంటూనే, హింస‌లో పాల్గొన్న సంఘ‌విద్రోహ శ‌క్తుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చ‌ని పేర్కొంది. అయితే విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల దాడి దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుత నిరసనలు ప్రాథమిక హక్కు అని, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనలు ఒక ప్రజాస్వామ్య మార్గమని,అలాంటి సందర్భాల్లో చట్టాన్ని అమలు చేసే సంస్థలు కూడా రాజ్యాంగబద్ధ హక్కులను గౌరవిస్తూ వ్యవహరించాలని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్