రంపచోడవరం (అల్లూరి) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును తన ప్రసంగంతో ఆకట్టుకున్న పదో తరగతి విద్యార్థిని శివాని ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీలో శివాని ఆత్మహత్య చేసుకుంది. శివాని రేకుల షేడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సోమవారం ఉదయం గుర్తించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ కంటతడి పెట్టిస్తోంది.
‘సారీ అమ్మా.. నా కోసం చాలా కష్టపడ్డావు. కానీ నీ కలను నెరవేర్చలేకపోతున్నా.. బతకాలని ఉన్నా ఈ బాధను భరించలేకపోతున్నా.. బతకడం కష్టంగా అనిపిస్తోంది.. ఈ బాధ మోయడం నావల్ల కావడం లేదు. నీ కోసం ఏమీ చేయలేకపోతున్నా డాడీ. మీ కోసం చాలా కష్టపడదాం అనుకున్నాను. మీరు కలలుగన్న జీవితం మీకిద్దాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. నేను చనిపోయాక నాపై కోప్పడకండి. నన్ను ఎప్పుడూ లవ్ చేస్తూనే ఉండండి. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మా.. మీరు ఇప్పటికైనా కలవండి. ద్వేషించుకోకండి’ అంటూ బాలిక ఆవేదనను వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. కుటుంబంలో వివాదాల కారణంగా శివాని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. కుటుంబంలో కలహాలు ఆమెను ఎంతో బాధపెట్టాయో ఈ లేఖ ద్వారా అర్ధమవుతుంది. నాలుగు రోజుల క్రితం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్న బాలిక ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకోవడం కుటుంబసభ్యుల్ని కలిచివేసింది.
శివాని మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడం ఆవేదన కలిగిచిందన్నారు. 'పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది. ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరం. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే ఆ విద్యార్ధిని దూరమవ్వడం నన్ను కలిచివేస్తోంది. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించాను. సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలి. ఎవ్వరూ ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకులోను కావొద్దని కోరుతున్నాను. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. మీ బాధను, ఆవేదనను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో పంచుకోండి. ఒత్తిడిని, అధిగమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండి. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాము' అంటూ ట్వీట్ చేశారు.
శివాని రంపచోడవరం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈ నెల 24న పోలవరం జిల్లా రంపచోడవరంలో మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ నిర్వహించగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో శివాని తన ప్రసంగంతో అందరిని ఆకట్టుకున్నారు. వచ్చే ఏడాది షైనింగ్ స్టార్ అవార్డు తీసుకుంటానని సీఎంకు ధీమాతో చెప్పారు.. చంద్రబాబు ఆమెను పిలిచి పక్కన కూర్చొపెట్టుకొని ప్రశంసించారు. అయితే ఇవాళ ఆమె ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అంత ధైర్యంగా మాట్లాడిన బాలిక ఆత్యహత్య చేసుకోవడంపై చర్చ జరుగుతోంది.








కామెంట్‌లు (0)